‘ఆధార్‌’ సేవల్లో దోపిడీని అరికట్టాలి

ABN , First Publish Date - 2021-06-04T05:15:48+05:30 IST

ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని, ఆధార్‌ కేంద్రాలవద్ద దళారులు సాగిస్తున్న దోపిడీని అరికట్టాలని సీపీఎం జిల్లా ఉత్తరప్రాంత కార్యదర్శి రాంభూపాల్‌ గురువారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

‘ఆధార్‌’ సేవల్లో దోపిడీని అరికట్టాలి

సీపీఎం జిల్లా ఉత్తరప్రాంత కార్యదర్శి రాంభూపాల్‌

అనంతపురం టౌన్‌, జూన్‌ 3: ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని, ఆధార్‌ కేంద్రాలవద్ద దళారులు సాగిస్తున్న దోపిడీని అరికట్టాలని సీపీఎం జిల్లా ఉత్తరప్రాంత కార్యదర్శి రాంభూపాల్‌ గురువారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. దళారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పథకాల లబ్ధి పొందాలంటే ఆధార్‌ కార్డుకు ఫోన్‌ నెంబర్‌ అనుసంధానం తప్పనిసరి అని ప్రభుత్వం ఇటీవల నిబంధన విధించిందన్నారు. దీనికి సంబంధించి ఈనెల 15వ తేదీతో అనుసంధాన గడువు ముగుస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆధార్‌ కేంద్రాలకు వెళ్తున్నారన్నారు. దీనిని అవకాశంగా తీసుకుని, కొందరు దళారులు.. ప్రజల నుంచి రూ.వెయ్యి నుంచి రూ.4వేల వరకు వసూలు చేస్తున్నారన్నారు. కరోనా సమయంలో పనుల్లేక ప్రభుత్వ పథకాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలను దోచుకుంటున్న దళారులను అరికట్టి, కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు అవసరమైన మేర ఆధార్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.




Updated Date - 2021-06-04T05:15:48+05:30 IST