పరీక్ష దోపిడీ..!

ABN , First Publish Date - 2021-04-28T06:18:34+05:30 IST

జిల్లాలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. ఇప్పటికే వేల మంది వైరస్‌ బారినపడ్డారు. కొద్దిపాటి అనారోగ్యం అనిపించినా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పరీక్ష దోపిడీ..!

ప్రైవేటు ల్యాబ్‌ల ఇష్టారాజ్యం

కొవిడ్‌ నిర్ధారణకు వేలల్లో వసూలు

సీటీ స్కాన్‌కు భారీగా బాదుడు

ప్రభుత్వ ధరలకు రెట్టింపు వసూలు

పట్టించుకోని జిల్లా వైద్యారోగ్యశాఖ

అనుమానిత బాధితుల్లో కొవిడ్‌ కలవరం 

చేసేదేమీ లేక పరీక్షలు చేయిస్తున్న బాధితులు

ఒంగోలులోని పలు ప్రైవేటు ల్యాబ్‌ల్లో కరోనా పరీక్ష కోసం ఒక్కో బాధితుడు నుంచి అవసరాన్ని బట్టి రూ.1500, నుంచి రూ.2వేల వరకూ వసూలు చేస్తున్నారు. సీటీ స్కాన్‌కు రూ. 4వేల నుంచి  రూ.5వేల వరకూ బాధితుడు ఆరోగ్య స్థితిని బట్టి గుంజుతున్నారు

మార్కాపురంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చెస్ట్‌ ఎక్స్‌రే మాత్రమే తీస్తుండగా, స్కానింగ్‌ మిషన్‌ లేకపోవడంతో స్థానికంగా ఉండే రెండు ప్రైవేటు సెంటర్లకు సిఫారసు చేస్తున్నారు. అయితే గతేడాది ఈ ల్యాబ్‌లో ఒక్కొక్కరి నుంచి రూ.4వేల వరకు వసూలు చేయగా అధికారులు దాడులు చేశారు. దీంతో ఈ ఏడాది రూ.2,500 వసూలు చేస్తున్నారు. 

అద్దంకిలో 10 వరకూ ప్రైవేట్‌ ల్యాబ్‌లు ఉన్నాయి. వీటిలో రోజుకు 200 నుంచి 300మంది వరకూ ర్యాపిడ్‌ పరీక్షలు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ట్రూనాట్‌ పరీక్ష కిట్‌ ఖరీదు రూ.250 కాగా రూ.2వేల నుంచి రూ.3వేల వరకూ దండుకుంటున్నారు. 

ఇదీ జిల్లాలో కరోనా పరీక్షల్లో జరుగుతున్న దోపిడీ. పలు ప్రైవేటు వైద్యశాలలు, ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బాధితుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఒక పక్క మహమ్మారి బారిన పడి అల్లాడుతున్న పేషెంట్లు మరో దిక్కులేక వారు అడిగినంత సమర్పించుకుని రిపోర్టులతో బయట పడుతున్నారు. ఆశించిన స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు లేకపోవడంతోనే జనం ప్రైవేటుకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.

ఒంగోలు (కార్పొరేషన్‌), ఏప్రిల్‌ 27: జిల్లాలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. ఇప్పటికే వేల మంది వైరస్‌ బారినపడ్డారు. కొద్దిపాటి అనారోగ్యం అనిపించినా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వైద్య సేవల కోసం ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. బాధితుల భయాన్ని కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. నిర్ధారణ పరీక్షల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ పరీక్షలను ఉచితంగానే చేస్తున్నాయి. అయితే ఫలితాలు రావడం ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న బాధితులకు పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం పలు ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లకు అనుమతిచ్చింది. కేవలం రూ.700లకు మాత్రమే కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉండగా, అందుకు రెట్టింపు వసూలు చేస్తున్నారు. బాధితుల భయాన్ని సొమ్ము చేసుకుంటున్న ల్యాబ్‌లు, ఆసుపత్రులపై వైద్యారోగ్యశాఖ పర్యవేక్షణ కొరవడటంతో ప్రైవేటు దోపిడీ పెరిగిపోయింది. ప్రభుత్వం స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ను నియమించినా, ల్యాబ్‌ల వసూళ్లపర్వానికి చెక్‌పడే పరిస్థితి కనిపించడం లేదు. 


దోచుకుంటున్నారు..!

కొవిడ్‌ పరీక్షలు ప్రైవేటు డాక్టర్లకు, ల్యాబ్‌ టెక్నీషియన్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఉచితంగా నిర్వహించే వాటిలో కిట్‌ల కొరత కారణంగా ర్యాపిడ్‌ పరీక్షలు నిలిచిపోయాయి. వీఆర్‌డీఎల్‌ పరీక్షలను మాత్రమే చేస్తున్నారు. అయితే ప్రైవేటు ల్యాబ్‌ల వారికి మాత్రం కావాల్సినన్ని కిట్‌లు దొరుకుతున్నాయి. దీంతో బాధితుల భయాన్ని సొమ్ము చేసుకుంటున్న ల్యాబ్‌ నిర్వాహకులు వేలకు వేలు దండుకుంటున్నారు. ఒక్కో పరీక్ష రూ.1800 నుంచి 2,500వరకూ వసూలు చేస్తున్నారు. ఒంగోలు, చీరాల, అద్దంకిల్లో ర్యాపిడ్‌, ట్రూనాట్‌ పరీక్షలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఆయాసానికి సీటీ స్కానింగ్‌ పేరుతో స్కానింగ్‌ సెంటర్లు ఆదాయవనరుగా మార్చుకుంటున్నాయి. పరీక్షల కోసం వచ్చేవారి నుంచి రూ.5వేల వరకూ ముక్కుపిండి మరీ వసూలు చేస్తుండగా, అది కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు రొప్పుతూ, దగ్గుతూ పడిగాపులు కాయాల్సి వస్తోంది. 


ప్రైవేటు ల్యాబ్‌ల ఇష్టారాజ్యం

నిర్ధారణ పరీక్షల కోసం ఎస్‌ కంపెనీ, జయమిత్ర కంపెనీలకు చెందిన కిట్‌లను ఉపయోగిస్తారు. ఒక్కో కిట్‌ ధర రూ. 350 నుంచి రూ.750 వరకు మాత్రమే ఉంది. కానీ రూ.2వేల వరకూ వసూలు చేస్తున్నారు. రోగి పరిస్థితి విషమయంగా కనిపిస్తే అదనంగా మరో వెయ్యి బాదుతున్నారు. కందుకూరులో గత వారంరోజులుగా ప్రైవేటు వైద్యశాలల్లో కొవిడ్‌ చికిత్సలు నిలిపివేశారు. స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు నిర్వహించి, సంబంధిత ఆసుపత్రి యాజమాన్యాలకు హెచ్చరికలు చేయడంతో ప్రస్తుతం బాధితులు ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. అయితే కరోనా నిర్ధారణ పరీక్షలకు మాత్రం అక్కడి ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌ల వారు అధిక మొత్తంలోనే వసూలు చేస్తున్నారు.  


ప్రభుత్వం ఆధ్వర్యంలో అంతంతమాత్రమే 

జిల్లాలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల కేంద్రాలు తగ్గాయి. గతంలో ప్రతి ప్రభుత్వ ఆసుపత్రితోపాటు, అర్బన్‌ హెల్త్‌సెంటర్‌, ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక సంజీవని బస్‌ జిల్లా అంతటా తిరిగి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. గతేడాది రోజుకు సుమారు 6వేల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, ఈ ఏడాది అధికారుల లెక్కల ప్రకారం 4వేల మందికి చేస్తున్నట్లు  విదితమవుతోంది. అయితే ఆచరణలో అన్ని కూడా జరగడం లేదని సమాచారం.  ఒంగోలులోని రిమ్స్‌లోని పీపీ యూనిట్‌లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా, గత వారంరోజుల నుంచి మాత్రమే సంజీవని బస్‌ అందుబాటులోకి వచ్చింది. అది ఒంగోలులోని ఒక ప్రాంతానికే పరిమితమై పరీక్షలు నిర్వహించడంతో అనుమానిత లక్షణాలు కలిగిన వారు పరీక్షలు చేయించుకునేందుకు ఎదురుచూపులు తప్పడం లేదు. కాగా సోమవారం పలువురు ఉన్నతాధికారులు జిల్లావ్యాప్తంగా ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్లలో ఆకస్మికంగా దాడులు నిర్వహించినా ఎక్కడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష కేంద్రాలను పెంచడంతోపాటు, బాధితులకు ప్రైవేటు ల్యాబ్‌ల్లో కాసుల దోపిడీ నుంచి కాపాడాలని పలువురు బాధితులు వాపోతున్నారు. 


ఆర్‌ఎంపీలకు ఫోన్‌చేస్తే ల్యాబ్‌ సిబ్బంది!

అద్దంకి: ఇంట్లో వాళ్లకు కొద్దిగా నలతగా ఉందని ఆర్‌ఎంపీలకు ఫోన్‌ చేస్తే చాలు వాళ్ల కంటే ముందే ప్రైవేట్‌ ల్యాబ్‌ల సిబ్బంది వాలిపోతున్నారు. వారే రక్తం సేకరించి పలురకాల పరీక్షల పేర్లు చెప్పి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజుతున్నారు. వైద్యశాలలకు వెళ్లి కొత్తరకాల జబ్బులు కొని తెచ్చుకోవటం ఎందుకులే అని ఇంట్లో వృద్ధులు, మహిళలకు  చిన్నపాటి  జ్వరం వస్తే ఆర్‌ఎంపీలతో వైద్యం చేయించుకుంటున్నారు. వారైతే ఇళ్ల వద్దకే వచ్చి వైద్యం చేస్తుండటంతో అద్దంకి పట్టణంతో పాటు సమీప గ్రామాల ప్రజలు అత్యధికశాతం మంది చిన్నచిన్న వ్యాధులకు ఆర్‌ఎంపీలపైనే ఆధారపడుతున్నారు.   ఈక్రమంలో ప్రైవేట్‌  ల్యాబ్‌  సిబ్బంది క్షణాల్లో రోగి ఇంటి వద్ద వాలిపోయి రక్తం సేకరిస్తున్నారు. పరీక్షలకయ్యే మొత్తంలో సగం అడ్వాన్స్‌గా తీసుకుంటున్నారు. ఇటీవల దామావారిపాలెంకు చెందిన  ఓవ్యక్తి ఫోన్‌ చేసి ఆర్‌ఎంపీని ఇంటికి రమ్మని చెప్పాడు. అతను రాక ముందే ఓ ప్రైవేట్‌  ల్యాబ్‌ సిబ్బంది వచ్చి పరీక్షల కోసం రక్త నమూనా సేకరించాడు. మలేరియా, టైపాయిడ్‌ పరీక్షల కోసం రూ.1200 అవుతుందని, అడ్వాన్స్‌గా రూ.600 ఇవ్వాలని చెప్పటంతో ఇచ్చి పంపారు. ఇలా పట్టణంలో ప్రతిరోజూ వైద్యుల సలహాలు, సూచనలతో పనిలేకుండా ల్యాబ్‌ల సిబ్బంది ఇష్టానుసారం పలురకాల పరీక్షలు చేస్తూ నిలువుదోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలల వద్ద కొవిడ్‌ 19 నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే వీఆర్‌డీఎల్‌ ఫలితం వచ్చేందుకు నాలుగైదు రోజులు పడుతోంది. దీంతో పలువురు ప్రైవేట్‌ ల్యాబుల్లో ర్యాపిడ్‌ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇదే అదనుగా వారు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు వసూలు చేస్తున్నారు.




Updated Date - 2021-04-28T06:18:34+05:30 IST