పేలిన తూటా..!

ABN , First Publish Date - 2021-06-16T06:11:18+05:30 IST

కడపలో..

పేలిన తూటా..!
నల్లపురెడ్డిపల్లెలో తుపాకీ కాల్పులతో ఇద్దరు మృతిచెందిన ఇంటిని పరిశీలిస్తున్న ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌

నల్లపురెడ్డిపల్లిలో ఇద్దరు బలి

లైసెన్స్‌ గన్‌తో ఒకరిని హత్య చేసిన వైసీపీ మాజీ ఎంపీటీసీ 

అదే గన్‌తో పేల్చుకొని నిందితుడి ఆత్మహత్య

జనవరిలో వీఎన్‌పల్లిలో గాలిలో కాల్పులు జరిపిన వైసీపీ లీడర్‌

జిల్లాలో బయట పడుతున్న గన్‌ సంస్కృతి

లైసెన్స్‌దారులపై కొరవడిన పోలీస్‌ నిఘా

జిల్లాలో 1,549 గన్‌ లైసెన్సులు

స్టేటస్‌ సింబల్‌గా మారిన తుపాకీ


(కడప-ఆంధ్రజ్యోతి): ముఠా పోరులో తుపాకీ, బాంబుల కల్చర్‌ జిల్లాకు కొత్తేమీ కాదు. అయితే.. కొన్నేళ్లుగా వర్గపోరు.. ముఠారాజకీయాలకు ప్రజలు దూరంగా ఉంటున్నారు. దీంతో తూటా.. బాంబుల సంస్కృతి దాదాపు కనుమరుగు అవుతోంది. ఈ సమయంలో పులివెందుల మండలంలో తూటాకు ఇద్దరు బలికావడం చర్చనీయాంశమైంది. నల్లపురెడ్డిపల్లెలో ఇంటిపై గొడవకు వచ్చిన ఓ వ్యక్తిపై వైసీపీ మాజీ ఎంపీటీసీ తన లైసెన్స్‌ గన్‌తో కాల్పులు జరపడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అదే గన్‌తో తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఓ లైసెన్స్‌ గన్‌ ఇద్దరి మృతికి కారణమైంది. జనవరిలో వీఎన్‌పల్లె మండలం పాయసంపల్లెలో ఇరువర్గాల ఘర్షణలో వైసీపీ నాయకుడు లైసెన్స్‌ గన్‌తో గాలిలో కాల్పులు జరపడం తెలిసిందే. ఈ ఘటనలు పల్లె ప్రజల్లో భయాందోళనకు కారణమవుతున్నాయి. వెపన్‌ లైసెన్సుదారులపై పోలీస్‌ నిఘా కొరవడిందనే ఆరోపణలు లేకపోలేదు. ఆ వివరాలపై ప్రత్యేక కథనం.


జిల్లాలో కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, రాయచోటి, రాజంపేట, మైదుకూరు పోలీస్‌ సబ్‌ డివిజన్లున్నాయి. వీటి పరిధిలో ప్రాణ రక్షణ కోసం తుపాకీ (గన్‌) లైసెన్సు కలిగిన వారు 1,549 మంది ఉన్నారని పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. గన్‌ లైసెన్సుదారుల్లో అధికశాతం మంది రాజకీయ నాయకులే. కొందరికి గన్‌ అవసరం లేకపోయినా స్టేటస్‌ సింబల్‌ కోసం రాజకీయ అండతో లైసెన్సు తీసుకున్న వారు కూడా ఉన్నారని తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో అదే గన్‌ ప్రాణాలు హరిస్తుందని చాలా మందికి తెలియదు. తుపాకీ లైసెన్సు ఇవ్వడమే కాదు.. ఆ గన్‌ వినియోగంపైన తరచూ అవగాహన కల్పించాల్సి ఉంది. గన్‌ లైసెన్సుదారుల మానసికస్థితిని తెలుసుకోవాలి. మానసిక పరిస్థితి బాగాలేని తెలిస్తే లైసెన్సు రద్దు చేయవచ్చని న్యాయ నిపుణులు అంటున్నారు. ఆ దిశగా అవగాహన కల్పిస్తున్నారా..? అన్నది ప్రశ్నార్థకమే. పులివెందుల నియోజకవర్గంలో ఇరుకుటుంబాల మధ్య తలెత్తిన విభేదాల వల్ల పేలిక గన్‌కు ఇద్దరు బలి కావడం జిల్లా అంతటా చర్చగా మారింది.


నల్లపురెడ్డిపల్లెలో ఏం జరిగింది..?

వైసీపీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు కొమ్మా శివప్రసాద్‌రెడ్డి (62) ఎదురింట్లోనే భూమిరెడ్డి పార్థసారథిరెడ్డి (48) నివాసం ఉంటున్నారు. ఇద్దరు కూడా దూరపు బంధువులు అవుతారు. పార్థసారథిరెడ్డికి ఆయన భార్యకు మధ్య కుటుంబ కలహాలు తలెత్తాయి. దీంతో ఇద్దరు పిల్లలతో ఆమె భర్తకు దూరంగా ప్రస్తుతం ప్రొద్దుటూరు టౌన్‌లో నివాసం ఉంటున్నారు. నల్లపురెడ్డిపల్లెలో పార్థసారథిరెడ్డి ఒక్కరే ఉంటున్నారు. భార్య భర్తల మధ్య జరిగిన పంచాయితీలో తనకు సహకరించలేదని శివప్రసాద్‌రెడ్డిపై పార్థసారధిరెడ్డి కక్ష పెంచుకొని తరచు గొడవలకు దిగేవాడని పోలీసులు పేర్కొంటున్నారు. అందులో భాగంగా సోమవారం ఉదయం 6.30 గంటల సమయంలో పార్థసారథిరెడ్డి వేట కొడవలితో శివప్రసాద్‌రెడ్డి కొడుకు కొమ్మా ఉమామహేశ్వరరెడ్డిపై దాడికి యత్నించాడు. దీంతో శివప్రసాద్‌రెడ్డి తన లైసెన్సు గన్‌తో పార్థసారఽథిరెడ్డి ఎదలో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆ కాల్పులకు కుప్పకూలిన పార్థసారథిరెడ్డి అక్కడిక్కడే మృత్యుఒడి చేరారు. ఈ ఘటన జరిగిన తక్షణమే ఇంట్లోకి వెళ్లిన శివప్రసాద్‌రెడ్డి మానసిక ఆందోళనకు లోనై గన్‌తో తానే గుండెపై కాల్చుకొని ఆత్యహత్య చేసుకున్నారు. ఇరుకుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నామని పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.


గన్‌ లైసెన్సు పొందాలంటే..!

ఏ వ్యక్తి అయినా సరే తన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని భావిస్తే ఆత్మరక్షణ కోసం తుపాకీ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే.. అందుకు ఆధారాలు కూడా చూపించాల్సి ఉంటుంది. మండల తహశీల్దారు, ఆర్డీఓ, స్థానిక పోలీస్‌ స్టేషన్‌ సీఐ స్థాయి అధికారి క్షేత్రస్థాయిలో విచారించి దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి గన్‌ లైసెన్సు అవసరమా.. లేదా..? అనేది కలెక్టరు, ఎస్పీకి నివేదిక ఇస్తారు. కలెక్టరు ఆదేశాల మేరకు లైసెన్సు జారీ చేస్తారు. ఎవరెవరి వద్ద లైసెన్సు వెపన్స్‌ ఉన్నాయో పోలీస్‌ శాఖ, రెవిన్యూ అధికారులు రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. ప్రతి మూడు ఏళ్లకు ఒకసారి గన్‌ లైసెన్సు రెన్యువల్‌ చేసుకోవాలి. అలా రెన్యువల్‌ చేసుకోకపోయినా.. అనుమతి లేకుండా తనవద్ద ఉంచుకున్నా శిక్షార్హులు అవుతారని పోలీస్‌ అధికారులు పేర్కొంటున్నారు.


పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లెలో ఇద్దరి మరణానికి కారణమైన గన్‌ లైసెన్సును వైసీపీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు కొమ్మా శివప్రసాద్‌రెడ్డి 2006లో తీసుకున్నారు. క్రమం తప్పక రెన్యువల్‌ చేస్తున్నారు. రాబోయే డిసెంబరుకు రెన్యువల్‌ గడువు ముగుస్తుంది. ఎదురెదురుగా ఉన్న రెండు కుటుంబాల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలతో ఆ గన్‌ ఇద్దరిని బలి తీసుకుంది. గత జనవరి ఒకటో తారీఖున వీఎన్‌ పల్లె మండలం పాయశంపల్లెలో నూతన సంవత్సర శుభకాంక్షలు తెలుపుకునే విషయంలో వైసీపీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఆ ఘర్షణ సమయంలో వైసీపీ రాష్ట్ర నాయకుడు తన లెసెన్సు తుపాకీతో గాలిలో నాలుగు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపారు. కొండాపురం మండలంలో కూడా ఓ ఘటనలో గన్‌ వినియోగం జరిగిందని పోలీసులు పేర్కొంటున్నారు.


గన్‌ వినయోగంపై అవగాహన ఏదీ..?

ప్రాణ రక్షణ కోసం తుపాకీ లైసెన్సు ఇవ్వడం ఎంత ముఖ్యమో. ఆ గన్‌ వినియోగంపై అవగాహన కల్పించడం కూడా పోలీసుల బాధ్యత. లైసెన్సు జారీ సమయంలోనూ.. రెన్యువల్‌ సమయంలో అవగాహన కల్పించాకే వెపన్‌ వారికి ఇస్తామని పోలీసులు అంటున్నారు. గన్‌ వినియోగ నిబంధనల ప్రకారం ముందుగా గాలిలోకి.. ఆ తరువాత కాళ్లపైకి.. అప్పటికీ ప్రాణాపాయం తప్పదనుకుంటే శరీరంపైకీ కాల్పులు జరపాలని పోలీసులే అంటున్నారు. సోమవారం జరిగిన కాల్పుల సంఘటన చూస్తే రెండు రౌండ్లు ఎదలో నేరుగా కాల్చారు. గాలిలోకో.. కాళ్లపైనో కాల్పులు జరిపి ఉంటే ప్రాణాపాయం ఉండేది కాదని, ఆ తరువాత కాల్పులు జరిపిన వ్యక్తి కూడా ఆత్యహత్య చేసుకునే పరిస్థితి ఉండేది కాదని అంటున్నారు. గన్‌ వినియోగంపై సరైన అవగాహన లేకపోవడమే ఇద్దరి మృతికి కారణమైందని తెలుస్తోంది.


ఇప్పటికైనా గన్‌ లైసెన్సుదారులకు వినియోగంపై తరచుగా అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు. అంతేకాదు.. మూడు నెలల కొకసారి లైసెన్సు తుపాకీలను తనిఖీలు చేయాలి. ఈ మధ్య కాలంలో తుపాకీ ఏదైనా వినియోగించారా..? ఎన్ని బుల్లెట్లు ఉన్నాయి..? అనే విషయాలపై విచారణ చేయాలి. తప్పకుండా తనిఖీలు చేయాలనే నిబంధన ఉన్నా.. ఈ ప్రక్రియ తూతూ మంత్రంగానే సాగుతోందనే విమర్శలు లేకపోలేదు. కేవలం ఎన్నికల సమయంలో పోలీసులు సీజ్‌ చేసి ఆ తరువాత అప్పగిస్తున్నారు.


పోలీస్‌ సబ్‌ డివిజన్ల వారీగా తుపాకీ లైసెన్సులు

-----------------------------------

సబ్‌ డివిజన్‌ లైసెన్సులు

-----------------------------------

కడప 389

ప్రొద్దుటూరు 145

జమ్మలమడుగు 178

పులివెందుల 169

రాయచోటి 203

రాజంపేట 249

మైదుకూరు 216

------------------------------------

మొత్తం 1,549

------------------------------------


తుపాకీ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నాం: కేకేఎన్‌ అన్బురాజన్‌, ఎస్పీ, కడప

తుపాకీ లైసెన్సు జారీ సమయంలోనూ, రెన్యువల్‌ సందర్భంగా గన్‌ వినియోగంపై లైసెన్సుదారులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇది నిత్యం జరిగే ప్రక్రియ. ఇటీవల జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సమయంలో అన్ని లైసెన్సు తుపాకులు స్వాధీనం చేసుకున్నాం. తిరిగి వారికి ఇచ్చే సమయంలో వినియోగంపైనా అవగాహన కల్పించాం. అంతేకాదు.. మానసికస్థితి బాగుంటేనే తుపాకీ లైసెన్సు ఇస్తాం. పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లెలో జరిగిన సంఘటన చూస్తే.. తన కొడుకుపై పార్థసారథిరెడ్డి వేటకొడవలితో దాడికి దిగడంతో ఎక్కడ కొడుకును చంపుతాడోనని శివప్రసాద్‌ రెడ్డి లైసెన్సు గన్‌తో కాల్పులు జరిపారు. పార్థసారథిరెడ్డి చనిపోవడంతో మనస్థాపానికి గురై ఆ వెంటనే అదే గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 





Updated Date - 2021-06-16T06:11:18+05:30 IST