సమ్మక్క సారలమ్మ జాతరకు విస్తృత ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-01-28T05:17:44+05:30 IST

తెలంగాణలో జరిగే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క-సారలమ్మ. వరంగల్‌ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రెండేళ్లకోసారి వైభవంగా జరుగుతుంది.

సమ్మక్క సారలమ్మ జాతరకు విస్తృత ఏర్పాట్లు

 

- ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 80 చోట్ల జాతర

- దేవాదాయశాఖ ఆధ్వర్యంలో 33 చోట్ల ఏర్పాట్లు

- వెంటాడుతున్న కరోనా, ఒమైక్రాన్‌ భయం


కరీంనగర్‌ కల్చరల్‌, జనవరి 27: తెలంగాణలో జరిగే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క-సారలమ్మ. వరంగల్‌ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రెండేళ్లకోసారి వైభవంగా జరుగుతుంది. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. స్థానికంగా కూడా సమ్మక్క-సారలమ్మ జాతరను వైభవంగా నిర్వహిస్తారు. ఫిభ్రవరి 16 నుంచి 19 వరకు జాతర జరుగనుంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 80కి పైగా ప్రదేశాల్లో, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో 33 చోట్ల జాతర జరగనుంది. కరీంనగర్‌ జిల్లాలో కొత్తపల్లి, హుజూరాబాద్‌, వీణవంక, కేశవపట్నం, చింతకుంట, కొండపల్కల, కొత్తపల్లి (తిమ్మాపూర్‌), జూపాక, కేశవాపూర్‌, మల్యాల్‌, తనుగుల, చల్లూర్‌, కోరుకల్‌, వావిలాల, సైదాపూర్‌, దేవంపల్లి, జగిత్యాల జిల్లా ధర్మపురిలో, పెద్దపల్లి జిల్లాలో కొలనూరు, కొదురుపాక, నీరుకుళ్ల, గోదావరిఖని, మీర్జంపేట, హనుమంతు నిపేట, ఎలిగేడు, గర్రెపెల్లి, తేలుకుంట్ల, వెంకట్రావుపల్లి, పెగడపల్లి, మడక, తొగర్రాయి, గుండారం, ఈసల తక్కలపల్లి ప్రాంతాల్లో జాతర కొనసాగనుంది. 

భక్తులకు సౌకర్యాలు

జాతరకు దేవాదాయశాఖ, జాతర కమిటీలు, ఇతర శాఖల అధికారుల సహకారంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపనుంది. పోలీసు, అగ్నిమాపక శాఖలు అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే అనేకమంది 15 రోజుల ముందునుంచే మొక్కులు తీర్చుకోవడంలో భాగంగా నిలువెత్తు బంగారం(బెల్లం), తలనీలాలు, ఒడిబియ్యం, ఊయలలు కట్టడం, ఎదుర్కోళ్లు ప్రారంభించారు. గతంలో ఉమ్మడి జిల్లాలో జరిగిన జాతరలలో 35 లక్షల మంది అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ యేడు దాదాపు 40 లక్షల మంది భక్తులు దర్శించుకునే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కరోనా కేసులు పెరుగుతుండటంతో అందరూ బెంబేలెత్తుతున్నారు. ప్రధాన జాతర జరిగే మేడారంతో పాటు మిగతా ప్రాంతాలకు మరో 15 లక్షల మందికి వెళ్లే అవకాశాలున్నాయి.  

 వ్యక్తిగత జాగ్రత్తలు ముఖ్యం

కరోనా, ఒమైక్రాన్‌ దృష్ట్యా ప్రతి వ్యక్తి వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని మాస్కులు ధరించి తప్పనిసరి సానిటైజర్లు వాడాలని అధికారులు సూచిస్తున్నారు. గుంపులుగా ఉండకుండా భౌతిక దూరం పాటించాలని పేర్కొంటున్నారు. 


 కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

- ఆకునూరి చంద్రశేఖర్‌, ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్‌


ఉమ్మడి జిల్లాలో 33 చోట్ల జరగనున్న సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశాం. జాతర ప్రాంతాల సిబ్బందితో సమావేశం నిర్వహించి సూచనలిచ్చాం. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీరాజ్‌, వైద్య, ఆరోగ్య, పోలీసు, తదితర శాఖల సహకారంతో తాగునీరు, స్నానాలకు సదుపాయం, వైద్య శిబిరాలు, పారిశుధ్య నిర్వహణ ఏర్పాట్లను చేస్తున్నాం. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మేడారానికి 10 లక్షల మంది వెళ్లనున్నారు.  భక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటించి అమ్మవార్లను దర్శించుకోవాలి. 

Updated Date - 2022-01-28T05:17:44+05:30 IST