ఆపన్నులకు ఆలంబన...

ABN , First Publish Date - 2020-04-09T10:16:41+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనుల్లేక ఇబ్బందులు పడుతున్న ఆపన్నులను ఆదుకొనేందుకు అనేక మంది దాతలు

ఆపన్నులకు ఆలంబన...

విస్తృతంగా సేవాకార్యక్రమాలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) : లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనుల్లేక ఇబ్బందులు పడుతున్న ఆపన్నులను ఆదుకొనేందుకు అనేక మంది దాతలు ముందుకొస్తున్నారు. బియ్యంతోపాటు నిత్యావసర సరుకులు, కూరగాయలను అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.


హోంమంత్రి సుచరిత, దయాసాగర్‌ దంపతులు గుంటూరు మండలం తురకపాలెంలో పేదలకు ఐదు కిలోల చొప్పున బియ్యం పంపిణీచేశారు. గ్రామానికి చెందిన డబ్బూరి సూర్యప్రకాశరావు విరాళంగా అందించారు. డీసీసీబీ ఆధ్వర్యంలో ఫిరంగిపురం మండలం అమీనాబాద్‌ గ్రామ సచివాలయం వద్ద డీసీసీబీ చైర్మన్‌ రాతంశెట్టి సీతారామాంజనేయులు, ఇన్‌చార్జి సీఈవో సుబ్రహ్మణ్యేశ్వరరావు  పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.  


గుంటూరు కోబాల్ట్‌పేట 8 వలైను, తుఫాన్‌నగర్‌లో లేడీస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలను పంపిణీచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సతీమణి ఐ.సుజాత మాట్లాడుతూ లాక్‌డౌన్‌ను కచ్ఛితంగా పాటించాలని కోరారు. కోబాల్ట్‌పేట అంబేడ్కర్‌ సేవా సమితి సభ్యులు, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు.  


పశ్చిమ నియోజకవర్గంలో పలు వార్డుల్లో టీడీపీ పశ్చిమ ఇన్‌చార్జి కోవెలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో అయా డివిజన్‌ అధ్యక్షులు పేదలకు నిత్యావసరాలు పంపిణీచేశారు. 18, 25, 36 39, 40, 52 డివిజన్లలో పలు కాలనీల్లో పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద శానిటైజర్లతో కూడిన హ్యాండ్‌వాష్‌లను ఏర్పాటుచేయాలని కోరారు.


తూర్పు నియోజకవర్గ పరిధిలో 56వ డివిజన్‌లో టీడీపీ ఇన్‌చార్జ్‌ నసీర్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో డివిజన్‌ నాయకులు గుడివల్లి వాణి, నవీన్‌లు 2500మంది నిరుపేదలకు కూరగాయలను పంపిణీ చేశారు.


 వైసీపీ ఐటీ వింగ్‌ జిల్లా అధ్యక్షుడు  కొత్తా చిన్నపరెడ్డి ఆధ్వర్యంలో వైద్యుల రక్షణ కోసం అందించిన 200 ప్రాటెక్షన్‌ మాస్కులను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల చేతుల మీదుగా  పంపిణీ చేశారు.  వైసీపీ నాయకుడు సాధు ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరి, వైసీపీ నేతలు లేళ్ళ అప్పిరెడ్డి, పాదర్తి రమేష్‌గాంధీలు గుండారావుపేటలో వెయ్యి కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేశారు.  శ్రీ శారదాపరమేశ్వరి నిత్యాన్నదాన పథకంలో భాగంగా సేవాభారతి వారి సహకారంతో నగరంలోని పలు ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు.


అమరావతి పరిరక్షణ సమితి నాన్‌పొలిటికల్‌ జేఏసీ ఆధ్వర్యంలో కన్వీనర్‌ మల్లికార్జునరావు పేదకళాకారులకు నిత్యావసరావు పంపిణీ చేశారు. క్రైస్ట్‌ ఆర్ఫన్‌ సెంటర్‌ మినిస్ట్రీస్‌ ఆధ్వర్యంలో సంస్థ ఆధ్యక్షుడు స్టీఫెన్‌ సుందర్‌ వలసకార్మికులకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. 


గోరంట్లలోని 46వ డివిజన్‌లో మాజీ సర్పంచ్‌ యర్రంశెట్టి వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో జనసేన నేతలు పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ బెంజ్‌ ఆధ్వర్యంలో స్థానిక స్వర్ణభారతినగర్‌ 28వ లైనులోని సెయింట్‌ మేరీస్‌ కాన్వెంట్‌లో 800మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.  5వ డివిజన్‌లో టీడీపీ అధ్యక్షుడు చిలకా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఓ కల్యాణ మండపం వద్ద 300 మందికి అన్నదానం నిర్వహించారు. 


గాస్పెల్‌ మిషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ జనరల్‌ సెక్రెటరీ చంద్రబోసు, బోర్డు మెంబర్‌ పి. లీలబోస్‌ ఆధ్వర్యంలో స్థానిక సీతమ్మ కాలనీలో  వెయ్యి కుటుంబాలకు 10 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్‌ నూనె ప్యాకింగ్‌ చేసి పంపిణీ చేశారు. ఎన్‌జివో కాలనీ చివర ఉన్న బుడగజంగాల కాలనీలో పగటివేషగాళ్లు, చిలకప్రశ్న, గంగిరెద్దుల వారికి, వలసకూలీలకు బ్రాహ్మణ చైతన్యవేదిక, అయ్యప్పసేవా సమాఖ్య అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌ ఆధ్వర్యంలో ఆహార పొట్లాలను అందించారు.


Updated Date - 2020-04-09T10:16:41+05:30 IST