ఎక్స్‌ప్రెస్‌ పేరుతో అదనపు బాదుడు

ABN , First Publish Date - 2021-08-02T06:20:48+05:30 IST

దొనకొండ ప్రాంత ప్రజలు వివిఽధ రాకపోకలకు రైలుమార్గమే దిక్కు. ప్రస్తుతం రైళ్లు సక్రమంగా నడవకపోవడం, సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

ఎక్స్‌ప్రెస్‌ పేరుతో అదనపు బాదుడు

పాసింజర్‌ రైళ్ల కోసం ప్రజల ఎదురు చూపులు

డెమో ఎక్స్‌ప్రెస్‌ల పేరుతో  దోపిడి

ఆందోళనలో ప్రయాణికులు

దొనకొండ, ఆగస్టు 1 : దొనకొండ ప్రాంత ప్రజలు వివిఽధ రాకపోకలకు రైలుమార్గమే దిక్కు. ప్రస్తుతం రైళ్లు సక్రమంగా నడవకపోవడం, సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇక కొవిడ్‌ నేపథ్యంలో పాసింజర్‌ రైళ్లు రద్దుచేయడం, ఎక్స్‌ప్రెస్‌ చార్జీలు పెంచడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. 

కరోనా నేపథ్యంలో 2020 మార్చి నెలలో రద్దయిన పాసింజర్‌ రైళ్లు నేటికి తిరిగి పట్టాలెక్కలేదు. దీంతో ప్రజలు నాటి నుంచి పాసింజర్‌ రైళ్ల సేవల కోసం ఎదురుచూస్తున్నారు. గుంటూరు, విజయవాడ, విశాఖపట్టణం, నంద్యాల, గుంతకల్లు, బెంగుళూరు తదితర పట్టణ ప్రాంతాలకు  వెళ్లేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దొనకొండ, దర్శి, పొదిలి తదితర ప్రాంతాల ప్రజలు దొనకొండ రైల్వేస్టేషన్‌ నుంచి వారి రాకపోకలు గతంలో జరిపేవారు. రైల్వే అధికారులు దొనకొండ మీదుగా ప్రయాణించే పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల హాల్టింగ్‌ను దొనకొండలో ప్రస్తుతం తీసేశారు. దీంతో రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా సెకెండ్‌వేవ్‌ తగ్గుముఖం పట్టడంతో రైల్వే అధికారులు రైళ్ల రాకపోకలకు పచ్చజెండా ఊపి ఆన్‌లైన్‌ టికెట్ల ద్వారా ముందుగా కాచిగూడ-గుంటూరు- కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించారు. కరోనాకు ముందు పాసింజర్‌గా కొనసాగిన గుంటూరు-కాచిగూడ-గుంటూరు డెమో పాసింజర్‌ను ఈనెల 21 నుండి కొన్ని స్టేషన్స్‌లో హల్టింగ్‌ ఎత్తివేసి డెమో ఎక్స్‌ప్రెస్‌ పేరుతో ప్రారంభించారు. రైల్టేస్టేషన్‌లో టికెట్‌ కౌంటర్‌ ఏర్పాటు చేసి అధిక చార్జీలను ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నారు. కరోనాకు ముందు దొనకొండ-గుంటూరు రూ.30 ఉండగా ప్రస్తుతం రూ.60, దొనకొండ-మార్కాపురం రూ.10 ఉండగా రూ.30, దొనకొండ-నంద్యాల రూ.30 ఉండగా రూ.65, దొనకొండ-నర్సరావుపేటకు రూ.20 ఉండగా రూ.45కు టిక్కెట్‌ ధరలు పెంచారు. పాసింజర్‌ రైళ్లను అందుబాటులోకి తెచ్చి రైల్వేస్టేషన్‌లో టికెట్‌ కౌంటర్‌ ఏర్పాటు చేస్తే  చార్జీలలో అదనపు బాదుడు తగ్గుతుందని ప్రయాణికులు కోరుతున్నారు.

12 రైళ్లకు పట్టాలెక్కినవి నాలుగే

దొనకొండ రైల్వేస్టేషన్‌ మీదుగా గుంటూరు-గుంతకల్లు రైలు మార్గంలో కరోనా వైరస్‌ కారణంగా గతేడాది మార్చి నెలలో దాదాపు 16 నెలల క్రితం నిలిచిన పాసింజర్‌ రైళ్లు నేటి వరకు పునరుద్ధరణకు నోచుకోలేదు. గత ఏడాది మార్చి నెలకు ముందు దొనకొండ రైల్వేస్టేషన్‌ మీదుగా  బెంగుళూరు-విజయవాడ (రైలు నంబరు 56503), కాచిగూడ-గుంటూరు( రైలు నంబరు 57305) , మార్కాపురం-గుంటూరు (రైలు నంబరు 77249), డోన్‌-గుంటూరు (రైలు నంబరు 57327), హుబ్లీ-విజయవాడ (రైలు నంబరు 56502), కాచిగూడ-గుంటూరు( రైలు నంబరు 77282 )  విజయవాడ-బెంగుళూరు (రైలు నంబరు 56504), గుంటూరు-కాచిగూడ( రైలు నంబరు 77281), గుంటూరు-మార్కాపురం(రైలు నంబరు 77247) ,  విజయవాడ-హుబ్లీ( రైలు నంబరు 56501), గుంటూరు-డోన్‌ ( రైలు నంబరు 57328), గుంటూరు-కాచిగూడ (రైలు నంబరు 57306) తో మొత్తం 12 పాసింజర్‌ రైళ్లు ప్రయాణించేవి. ప్రస్తుతం వీటిలో నాలుగు రైళ్లు మాత్రమే పునరుద్ధరించారు. మిగిలిన పాసింజర్‌ రైళ్లు తిరిగి ఎప్పుడు పట్టాలెక్కుతాయో తమ రవాణా కష్టాలు ఎప్పుడు తీరుతాయోనని ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. దీనిపై రైల్వే అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు.


Updated Date - 2021-08-02T06:20:48+05:30 IST