ఆ ఒక్క కారణంతో తల్లికి బిడ్డను దూరం చేయలేం: హైకోర్టు

ABN , First Publish Date - 2021-06-04T00:35:05+05:30 IST

ఒక మహిళకు అక్రమ సంబంధం ఉన్నంత మాత్రాన ఆమె బిడ్డను ఆమెకు అప్పగించకుండా ఉండలేమని పంజాబ్, హర్యానా ...

ఆ ఒక్క కారణంతో తల్లికి బిడ్డను దూరం చేయలేం: హైకోర్టు

చండీగఢ్: ఒక మహిళకు వివాహేతర సంబంధం ఉన్నంత మాత్రాన ఆమె బిడ్డను ఆమెకు అప్పగించకుండా ఉండలేమని పంజాబ్, హర్యానా హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. ఈ కారణం చేత ఆమె మంచి తల్లి కాలేదని చెప్పజాలమని స్పష్టం చేసింది. పితృస్వామ్య సమాజంలో ఓ మహిళ నైతిక ప్రవర్తన మీద అభాండాలు వేయడం పరిపాటిగా మారిందనీ.. ఇందులో చాలా ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు ఉండవని కూడా కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. పంజాబ్‌లోని ఫాతేగఢ్ సాహిబ్ జిల్లాకి చెందిన ఓ మహిళ వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై ధర్మాసనం ఈమేరకు స్పందించింది. తన నుంచి విడిపోయి ఆస్ట్రేలియా పౌరుడిగా ఉన్న భర్త నుంచి నాలుగున్నరేళ్ల కుమార్తెను తనకు అప్పగించాలంటూ సదరు మహిళ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ అనుపేందర్ సింగ్ గ్రేవాల్... ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్న కుమార్తెను వెంటనే ఆమె తల్లికి అప్పగించాలంటూ ఆదేశించారు.


కాగా తన భార్యకు వివాహేతర సంబంధం ఉందంటూ పిటిషనర్ భర్త ఆరోపించాడు. దీనిపై కోర్టు స్పందిస్తూ... ‘‘పిటిషన్‌లో పసలేని ఆ వాదనను పక్కనబెట్టండి. మీరు చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ కోర్టుకు సమర్పించలేదు. పితృస్వామ్య సమాజంలో ఓ మహిళ నైతిక ప్రవర్తన మీద అభాండాలు వేయడం సర్వసాధారణమని గమనించాలి. ఇందులో చాలా ఆరోపణలకు కనీసం ఎలాంటి ఆధారాలు ఉండవు. ఒకవేళ ఓ మహిళకు వివాహేతర సంబంధం ఉందని భావించినప్పటికీ...  ఆమె మంచి తల్లి కాబోదని చెప్ప వీలుపడదు..’’ అని పేర్కొంది. బిడ్డ ఎదుగుతున్న క్రమంలో ఆమెకు తల్లి ప్రేమ, అనురాగం, సంరక్షణ చాలా అవసరమని హైకోర్టు పేర్కొంది. చట్టప్రకారం ఐదేళ్లు నిండే వరకు ఆ చిన్నారి సంరక్షణ బాధ్యతలు తల్లికే ఉంటాయని స్పష్టం చేసింది. 

Updated Date - 2021-06-04T00:35:05+05:30 IST