పిల్లల్లో... కల్లోలం!

ABN , First Publish Date - 2021-08-01T08:04:07+05:30 IST

దాదాపు ఏడాదిన్నర కావొస్తోంది! బడి లేదు! మాస్టారిని ప్రత్యక్షంగా చూసింది లేదు! స్నేహితులతో ఆడుకున్నదీలేదు! అంతా... ఆన్‌లైన్‌ మయం! బడి ఎప్పుడు తెరుస్తారో తెలియదు

పిల్లల్లో... కల్లోలం!

కొవిడ్‌ ఆంక్షలతో బాల్యం బందిఖానా

ఏడాదిన్నరగా బడులు బంద్‌ 

అంతా ‘ఆన్‌లైన్‌’.. ఇంటికే పరిమితం

రోజుకు 10 గంటలకుపైగా ఫోన్‌తోనే

విద్యార్థుల ప్రవర్తనలో విపరీత మార్పులు

పెరుగుతున్న మానసిక సమస్యలు

వైద్యులను ఆశ్రయిస్తున్న తల్లిదండ్రులు

తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలని సూచన 


అతి పెద్ద నష్టం... ఇదే!

‘‘కొవిడ్‌ ఉపద్రవంతో గత 16 నెలలుగా బడులు మూతపడ్డాయి. దీనివల్ల దెబ్బతిన్నది చదువులు మాత్రమే కాదు! పిల్లలు ‘సోషియో - ఎమోషనల్‌’ కోణంలోనూ వెనుకబడిపోయారు. డిజిటల్‌ ఉక్కు గోడలు సామాజిక బంధాలను, భావోద్వేగాలను నాశనం చేశాయి!’’

- ఏటీఈ చంద్ర ఫౌండేషన్‌


ఆరో తరగతి చదువుతున్న ఓ అబ్బాయి..  ఉదయం ఆరు గంటలకు నిద్రలేచేవాడు. కాలకృత్యాలు తీర్చుకుని పాఠశాలకు వెళ్లడానికి బ్యాగ్‌ను సిద్ధం చేసుకుని కూర్చునేవాడు. తరగతి గదిలో ఉపాధ్యాయులు అడిగిన ప్రశ్నలకు టక్కున సమాధానం చెప్పేవాడు. ఆటపాటల్లో తోటి విద్యార్థులతో పోటీ పడేవాడు. ఇదంతా ఏడాది క్రితం మాట. ఇప్పుడు... ఉదయం 8గంటలకు లేవడం గగనమైపోయింది. లేచి హడా‘విడిగా’ ఫోన్‌ పట్టుకుని ఆన్‌లైన్‌ క్లాసులో లాగిన్‌ అయి కూర్చుంటాడు. ఆన్‌లైన్‌ క్లాస్‌లో ఇతర పిల్లలు.. ఉపాధ్యాయులను వివిధ ప్రశ్నలు అడుగుతున్నా అతడు మాత్రం మౌనంగా ఉంటున్నాడు. గతంలో ఖాళీ దొరికితే ఏదోఒక కథల పుస్తకం చదవడం అలవాటుగా ఉండే ఆ అబ్బాయి ఇప్పుడు వీడియో గేమ్స్‌, సెల్‌ఫోన్‌లో గేమ్స్‌కు అలవాటుపడ్డాడు!


బడికి వెళ్తే..

బడి అంటే... నాలుగు గోడలు మాత్రమే కాదు! అక్కడ తోటి పిల్లలను కలుస్తారు. మాట్లాడుకుంటారు. నవ్వుకుంటారు. ఆడుకుంటారు. దీనివల్ల... వారి మానసిక స్థితి మూడు రకాలుగా వికసిస్తుంది. 

  • ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ (భావోద్వేగాల అదుపు, ప్రదర్శన)
  • సోషల్‌ ఇంటెలిజెన్స్‌ (సాటివారితో కలివిడిగా ఉండటం)
  • యాంగర్‌ మేనేజ్‌మెంట్‌ (ఆగ్రహావేశాలను నియంత్రించుకోవడం)


విశాఖలోని తాటిచెట్లపాలేనికి చెందిన రాజ్‌ వెంకట్‌ (పేరు మార్చాం) పదో తరగతి చదువుతున్నాడు. కొవిడ్‌ కారణంగా పాఠశాలలు మూతపడడంతో ఏడాదిన్నర నుంచి ఇంటివద్దనే ఉంటున్నాడు. గంటల తరబడి ఫోన్‌తో గడుపుతున్నాడు. అస్తమానం ఫోన్‌ పట్టుకుంటే ఎలా అని తల్లిదండ్రులు అడిగితే.. వారిపై కోపంతో కేకలు వేస్తున్నాడు.


విశాఖలోనే ఎంవీపీ కాలనీకి చెందిన శ్వేత (పేరు మార్చాం) ఇంటర్మీడియట్‌ రెండో ఏడాది చదువుతోంది. ఆన్‌లైన్‌ క్లాస్‌ల పేరుతో రోజుకు 10 నుంచి 12 గంటలు ఫోన్‌తోనే గడుపుతోంది. రెండు వారాల నుంచి నిద్ర పట్టడం లేదని, ఏవేవో కలలు వస్తున్నాయని తల్లిదండ్రులకు చెప్పింది. సెల్‌ఫోన్‌ అతి వినియోగం వల్ల స్లీప్‌ డిస్ట్రబెన్స్‌, ఫియర్‌ అండ్‌ యాంగ్జైటీ సమస్యలతో బాధపడుతున్నట్టు గుర్తించారు. 


‘‘మాకు ఒక్కతే అమ్మాయి. చాలా బాగా చదివేది. అన్ని విషయాల్లో చురుకుగా, చలాకీగా ఉండేది. లాక్‌డౌన్‌ పుణ్యమా అని అంతా మారిపోయింది. గతంలో అన్ని విషయాలూ పంచుకునేది. ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా కసురుకుంటోంది. గట్టిగా మాట్లాడితే ఎదురు తిరుగుతోంది’’... ఇది విజయవాడకు చెందిన ఒక తల్లిదండ్రుల ఆక్రోశం. 


(అమరావతి/విశాఖపట్నం/విజయవాడ-ఆంధ్రజ్యోతి)

దాదాపు ఏడాదిన్నర కావొస్తోంది! బడి లేదు! మాస్టారిని ప్రత్యక్షంగా చూసింది లేదు! స్నేహితులతో ఆడుకున్నదీలేదు! అంతా... ఆన్‌లైన్‌ మయం! బడి ఎప్పుడు తెరుస్తారో తెలియదు. రెండోవేవ్‌ కథ ముగియకముందే... మూడో వేవ్‌ ముప్పుపై ఆందోళన! అందులోనూ పిల్లలపైనే ఎక్కువ ప్రభావం ఉంటుందనే భయం! దీంతో... బడులు తెరిచినా ఎంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పంపిస్తారో తెలియదు! ఈ పరిస్థితి పిల్లల చదువులనే కాదు... వారి మానసిక, భావోద్వేగ వికాసాన్నీ దెబ్బతీస్తోంది. ‘కరోనాతో జరిగిన అతి పెద్ద నష్టం ఇదే’ అని నిపుణులు పేర్కొంటుండటం గమనార్హం!


రకరకాల సమస్యలు... 

తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పే పాఠాలు వినడానికి, ఆన్‌లైన్‌లో క్లాసులు వినడానికి ఎంతో వ్యత్యాసం ఉందని నిపుణులు చెబుతున్నారు. పాఠాలను అర్థం చేసుకోవడంలో చాలామంది విద్యార్థులు వెనకబడుతున్నారు. దీంతో విద్యార్థులు ఒత్తిడికి, భయాందోళనకు గురవుతున్నారు. దీనికితోడు తోటి చిన్నారులతో ఆడుకునే అవకాశం లేకపోవడం.. ఎప్పుడూ ఇంట్లో ఉండటం వల్ల మరికొందరు మొబైల్‌, ట్యాబ్‌, కంప్యూటర్లకు బానిసలు అవుతున్నారు. కొందరు రోజుకు ఏకంగా పది గంటలు మొబైల్‌తోనే గడుపుతున్నారు. ఒక్కసారిగా ఇంటర్నెట్‌ అపరిమితంగా అందుబాటులోకి రావడంతో చిన్నవయసులోనే కొందరు దారితప్పుతున్నారు.  ఏడాదిన్నరగా నాలుగు గోడలకే పరిమితం కావడం వల్ల చిన్నారుల్లో ఒత్తిడి, భయం, ఆందోళన, కోపం, విసుగు, అసహనం, కలత నిద్ర, అరవడం, కోప్పడడం, తల్లిదండ్రులపై ఎదురుతిరగడం, సోషల్‌ మీడియా అడిక్షన్‌ వంటి మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మానసిక వైద్య నిపుణులను సంప్రదిస్తున్న తల్లిదండ్రుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చిన్న పిల్లల నుంచి టీనేజ్‌ పిల్లల వరకు పలురకాల సమస్యలతో తమ వద్దకు వస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.


అదుపు తప్పి... ఇలా!

గతంతో పోలిస్తే పిల్లలు వివిధ రకాల మానసిక-ప్రవర్తనా సమస్యలు 15 శాతం పెరిగాయి. అవేమిటంటే...

  • తీవ్రమైన ఒత్తిడి, భయం, ఆందోళన, విసుగు, కలత నిద్ర, అసహనం.
  • తల్లిదండ్రుల మీద తిరగబడడం, అరవడం, కోప్పడడం.
  • ఎమోషనల్‌ ఇంబ్యాలెన్స్‌ (మాట తీరు పూర్తిగా మారిపోవడం)
  • యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా అడిక్షన్‌ పెరగడం. 


అప్రమత్తం కావాలి...

సరిగా నిద్రపోకపోవడం, విపరీతమైన ఆకలి, అసంతృప్తి, చికాకు, తలనొప్పి, తీవ్రమైన ఒత్తిడితో బాధపడడం.... ఇలాంటి లక్షణాలు కనిపిస్తే... ఫోన్‌, కంప్యూటర్‌ అతిగా వాడటం  వల్ల వచ్చినవిగా భావించాలని వైద్యులు చెబుతున్నారు. 


ఏం చేయాలి?

  • ఆన్‌లైన్‌లో అనేక కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో చేర్పించడం ద్వారా పిల్లల్లో కొత్త ఆలోచనలు రేకెత్తించేందుకు అవకాశముంది. 
  • యోగా, ధ్యానం వంటివి చేయించడం ద్వారా మానసిక ఉత్తేజాన్ని కలిగించవచ్చు. 
  • సంగీతం, కళలు, ఆధ్యాత్మిక అంశాలపై దృష్టిసారించేలా చేయాలి.
  • ప్రతిరోజూ కొంత సమయం శారీరక శ్రమ కలిగించేలా ఆటలాడించాలి. 


పిల్లల ముందు ‘గొడవలు’ వద్దు 

ఒత్తిడి, ఆందోళన, నిద్ర పట్టకపోవడం, సోషల్‌ మీడియా అడిక్షన్‌ వంటి సమస్యలతో గతంలో రోజుకు ఇద్దరు ముగ్గురు వచ్చేవారు.  ఇప్పుడు ఆ సంఖ్య ఆరు, ఏడుకు పెరిగింది. కొవిడ్‌ వల్ల ఇళ్లల్లో గృహ హింస పెరిగింది. తల్లిదండ్రుల మధ్య గొడవ జరిగినపుడు వారి సంభాషణలు చిన్నారులను కలచివేస్తున్నాయి.  

- డాక్టర్‌ భాగ్యారావు, మానసిక వైద్య నిపుణులు, విశాఖపట్నం 


వ్యవహారశైలి పూర్తిగా మారుతోంది

పిల్లల్లో భావోద్వేగ, సామాజిక విషయావగాహన తగ్గుతోంది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు, పెద్దలతో ఎలా వ్యవహరించాలో తెలియడం లేదు. ఇళ్లల్లో పిల్లలను అతి గారాబం చేయడం వల్ల ఈ సమస్యలు ఎదురవుతున్నాయి. అల్లరి, హైపర్‌ యాక్టివ్‌ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. బాల్య దశలో నేర్చుకునే నైపుణ్యాలు తగ్గిపోతున్నాయి. రానున్న రోజుల్లో స్కూల్‌కు వెళ్లడానికి పిల్లలు ఇష్టపడని స్థితికి చేరిపోతున్నారు. 

- డాక్టర్‌ నాగరాజు, మానసిక వైద్యుడు, ప్రభుత్వ మానసిక ఆస్పత్రి, విశాఖపట్నం 


ఆన్‌లైన్‌ పాఠాలతో ఒత్తిడి

కరోనా ముందు తరగతి గదుల్లో ఉపాధ్యాయులు అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పి ప్రశంసలు పొందిన పిల్లలు సైతం  ఆన్‌లైన్‌ క్లాసుల కారణంగా మౌనమునుల్లా మారిపోతున్నారు. ‘ఎవ్వరూ చూడటం లేదు’ అనే ధైర్యంతో వేరే సైట్లను బ్రౌజ్‌ చేస్తుండటం వంటివి చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి పిల్లలపై మూడు రకాలుగా ప్రభావం చూపుతోంది. ఇందులో మొదటిది యాంగ్జైటీ (ఆందోళన, కంగారు), రెండవది ఫోబియా, మూడవది ఓసీడీ. క్లాస్‌ రూంలో పిల్లలు గడిపే సరదా సరదా క్షణాలు, ఆటలు పాటలు ఆన్‌లైన్‌లో మిస్‌ అవుతున్నారు. ఫలితంగా పిల్లల్లో స్పోర్టివ్‌నెస్‌ కొరవడుతోంది.

- కర్రి రామారెడ్డి, మానసిక వైద్య నిపుణుడు, రాజమండ్రి


తల్లిదండ్రులే కీలకం...

కరోనా కారణంగా విద్యార్థులకు సమాజంతో సం బంధాలు తెగిపోయాయి. విద్యార్థులకు ఇంతకుముందున్న వాతావరణం లేకపోయినా ఉన్నట్టుగా చూపించాలి. ఒంటరితనం వారి దరికి రాకుండా చేయాలి. ఈ విషయంలో తల్లిదండ్రుల పాత్రే కీలకం. ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌ విధానంలో ఎక్కువ మంది పిల్లలను పర్యవేక్షించే అవకాశం ఉండదు. తల్లిదండ్రులే పర్యవేక్షకులుగా మారాలి. లేకుంటే పిల్లలు ఆన్‌లైన్‌లో దారి తప్పడం ఖాయం.

- డాక్టర్‌ రాధికారెడ్డి, మానసిక వైద్య నిపుణులు, విజయవాడ 


‘పేరంటల్‌ కంట్రోల్‌’ ఉండాలి

పిల్లలు ఇంటర్నెట్‌లో గడిపే సమయం అమాంతం పెరిగిపోయింది. ఫలితంగా వారు చెడు మార్గం.. చెడు ఆలోచనలకు లోనయ్యే అవకాశం లేకపోలేదు. ఫోన్లు.. డెస్క్‌టా్‌పల్లో తల్లిదండ్రులు ‘పేరంటల్‌ కంట్రోల్స్‌’ ద్వారా అశ్లీల సైట్లు బ్రౌజ్‌ చేయకుండా నిరోధించాలి. పిల్లలతో అలాంటి సైట్లు చూడటం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే దుష్పరిణామాల గురించి చర్చించి, వారికి అర్ధమయ్యేలా చెప్పాలి. పిల్లలు ఒంటరిగా గదిలో గడపకుండా చూడటంతోపాటు వారి ఫోను, కంప్యూటర్‌లలో ఏం చూస్తున్నారో ఓ కంట కనిపెడుతూ ఉండాలి.

- డాక్టర్‌ విశాల్‌రెడ్డి, మానసిక వైద్యనిపుణులు, విజయవాడ

Updated Date - 2021-08-01T08:04:07+05:30 IST