ఇంటి దగ్గరే కంటి పరీక్షలు

ABN , First Publish Date - 2021-06-24T09:54:33+05:30 IST

బ్లాక్‌ ఫంగస్‌ కారణంగా కన్ను తొలగిస్తే కంటి మార్పిడి కుదరదని.. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిందేనని ఎల్వీ ఐ ప్రసాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ క్యాంపస్‌ డైరెక్టర్‌, ఆ సంస్థకు కాబోయే చైర్మన్‌ డాక్టర్‌ ప్రశాంత్‌ గార్గ్‌, పేషెంట్‌ విభాగం అధిపతి డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు.

ఇంటి దగ్గరే కంటి పరీక్షలు

  • 70 ఏళ్లు దాటిన వారికి ప్రత్యేక క్లినిక్‌లు.. 
  • అందుకోసం అయిదు ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు 
  • కొవిడ్‌, గ్లకోమాలపై ప్రత్యేక దృష్టి పెడతాం
  • బ్లాక్‌ఫంగ్‌సతో కన్ను తొలగిస్తే కంటి మార్పిడి కుదరదు
  • కరోనా రెండో వేవ్‌లో అత్యధికంగా కంటి సమస్యలు
  • చాలా మంది సాధారణ పరీక్షలూ చేయించుకోవట్లేదు


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): బ్లాక్‌ ఫంగస్‌ కారణంగా కన్ను తొలగిస్తే కంటి మార్పిడి కుదరదని.. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిందేనని ఎల్వీ ఐ ప్రసాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ క్యాంపస్‌ డైరెక్టర్‌, ఆ సంస్థకు కాబోయే చైర్మన్‌ డాక్టర్‌ ప్రశాంత్‌ గార్గ్‌, పేషెంట్‌ విభాగం అధిపతి డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. కరోనా సెకండ్‌ వేవ్‌లో చాలా మందికి  కంటి సమస్యలు వచ్చాయని వారు తెలిపారు. కంటి సమస్యలతో బాధపడుతున్న చాలా మంది కరోనా భయంతో ఆస్పత్రులకు రాలేకపోతున్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో.. ‘హోం కేర్‌’ పేరుతో ఇంటి వద్దనే కంటి పరీక్షలకు శ్రీకారం చుట్టుబోతున్నట్టు వెల్లడించారు. వృద్ధులపై ప్రత్యేకంగా దృష్టిసారించామని చెప్పారు. ‘హోం కేర్‌’ కార్యక్రమంలో భాగంగా తాము చేయబోయే పరీక్షల గురించి ఆయన వివరించారు. ఇంటి దగ్గర చేయదగ్గ పరీక్షలు ఏవేవి ఉన్నాయో వాటన్నింటినీ చేస్తామని గార్గ్‌ స్పష్టం చేశారు. అయితే.. వెంటనే కాకుండా, కొవిడ్‌ తీవ్రత తగ్గిన తర్వాత ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు తెలిపారు. వీటితోపాటు పలు అంశాల గురించి వారు ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ 


ముఖ్యాంశాలు..

ప్రశాంత్‌గారు.. చైర్మన్‌గా మీరు 

బాధ్యతలు చేపట్టబోతున్నారు కదా.. ఎలాంటి అంశాలపై దృష్టి సారించనున్నారు?

ఎల్వీప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రస్తుతం చేపడుతున్న సేవలను, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూనే.. కొత్త ఆలోచనలు, సరికొత్త ప్రణాళికలను రూపొందిస్తున్నాం. త్వరలో ఇంటింటికీ వెళ్లి అందరికీ నేత్ర పరీక్షలను చేపట్టబోతున్నాం. ఈ పరీక్షలకు ఉపయోగించే పరికరాలకు వీడియోను కనెక్ట్‌ చేసి పరీక్షలు చేస్తాం. మరిన్ని పరీక్షలు అవసరమైన వారిని ఆస్పత్రికి తరలిస్తాం. విలేజ్‌ విజన్‌ కాంప్లెక్స్‌ను మరింత అభివృద్ధి చేయబోతున్నాం. గ్లకోమా వాటిపై ప్రత్యేక దృష్టి పెడతాం. టెలీ కన్సల్టెన్సీ, కృత్రిమ మేధ వంటివాటిపై దృష్టి సారిస్తున్నాం. ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌, ఈ లెర్నింగ్‌ పోర్టల్‌ అభివృద్ధి చేస్తాం.


వృద్ధుల కోసం ప్రత్యేక ప్రణాళికలేమైనా రూపొందిస్తున్నారా?

70 ఏళ్లు దాటినవారి విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాం. వృద్ధుల క్లినిక్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఇందు కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించి అయిదు కేంద్రాలను నెలకొల్పాం. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్‌తో పాటు అన్ని టెర్షియరీ కేంద్రాలలో ఈ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తాం. మధుమేహం, రెటినోపతి వంటి సమస్యలున్న వృద్ధుల ఇబ్బందులను పరిశీలిస్తాం. ఆ వయసులో వారు ఎలా ఉండాలి, కంటి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఎలాంటి కళ్లాద్దాలు వినియోగించాలి అంశాలపై సలహాలు, సూచనలు ఇస్తాం. వృద్ధులకు కూడా ఇంటి కంటి పరీక్షలు నిర్వహిస్తాం.


కరోనా నేపథ్యంలో.. కంటి సమస్యలు ఎక్కువగా ఏ దశలో గుర్తించారు?

ఎక్కువగా రెండో వేవ్‌లో చూశాం. మొదటి వేవ్‌లో కూడా వచ్చాయిగానీ.. రెండో దశలో కరోనా వల్ల కంటి సమస్యలతో బాధపడేవారి సంఖ్య నాలుగైదు రెట్లు ఎక్కువ ఉంది. గత రెండు నెలల్లో ఎల్వీపీఈఐ హైదరాబాద్‌ క్యాంప్‌సలో దాదాపు 170 దాకా మ్యూకోర్‌మైకోసిస్‌ కేసులను పరిశీలించాం. వారిలో దాదాపు 20 మందికి కళ్లను తొలగించాల్సి వచ్చింది. బ్లాక్‌ ఫంగస్‌ వల్ల బాధితుల కళ్లల్లో చాలా భాగాలు దెబ్బతిన్నాయి. కొందరిలో కార్నియా రిజెక్షన్‌ వచ్చింది. ఇన్‌ఫ్లమేషన్‌ వల్ల ఈ రిజెక్షన్‌ ఎక్కువగా చోటు చేసుకుంది. కంటిలోపలి వైపు, వెనక భాగంలో ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చాయి. కంటి మార్పిడి చేసినవారిలో కొవిడ్‌ వస్తే గ్రాఫ్ట్‌ ఫెయిల్‌ అవుతుంది. ఫలితంగా దృష్టి లోపం ఏర్పడుతుంది. ఈ సమస్యను సత్వరమే గుర్తించి వెంటనే చికిత్స తీసుకోకపోతే అంధత్వం ఏర్పడుతుంది. రక్తనాళాలు మూసుకుపోతాయి. కంటి పనితీరు  మందగిస్తుంది, అంధత్వం వచ్చే ముప్పు ఉంటుంది.


ఇంకేమైనా సమస్యలు గుర్తించారా?

షుగర్‌ వ్యాధిగ్రస్తులలో ఇన్ఫెక్షన్‌ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆ ప్రభావం కళ్లపై బాగా పడుతున్నట్టు గుర్తించాం. చాలా మంది రక్తనాళాలు మూసుకుపోవడంతో కంటి చూపు మందగించింది. అయితే, దానికే కన్ను తొలగించాల్సిన పని లేదు. కన్ను నుంచి బ్రెయిన్‌కు బ్లాక్‌ ఫంగస్‌ విస్తరిస్తోందనే విషయం రూఢి అయితే మాత్రం కంటిని తొలగిస్తాం. 


ఏ వయస్సు వారిలో ఈ సమస్యలను ఎక్కువగా గమనించారు?

ఎక్కువగా మధ్య వయస్సు వారిలోనే కంటి దోషాలు కనిపించాయి. యువతలోనూ బ్లాక్‌ ఫంగస్‌ కేసులను కొన్నింటిని చూశాం. ఎప్పటికప్పుడు లోపాలను గమనించి అవసరమైన మందులను, చికిత్సను అందించాం. 


బ్లాక్‌ఫంగస్‌ వచ్చిన వారికి కన్ను తొలగిస్తే దాని స్థానంలో దాతల నేత్రాలను అమర్చవచ్చా?

కొవిడ్‌లో బాధితులకు బ్లాక్‌ ఫంగస్‌ విస్తరించిన కంటి పూర్తి భాగాన్ని తొలగించాల్సి వస్తుంది. తద్వారా చుట్టుపక్కల భాగాలకు ఇన్‌ఫెక్షన్‌ విస్తరించకుండా నియంత్రిస్తాం. అలాంటి వారికి.. తొలగించిన కన్ను స్థానంలో మరో కన్నును ఏర్పాటు చేయడం ఎట్టి పరిస్థితులలో కుదరదు.


బ్లాక్‌ ఫంగ్‌సకు ఎన్ని రోజులలో చికిత్స పొందాలి?

గుర్తించిన ఒకటి, రెండు రోజులలో ఆస్పత్రికి రావాలి. కంటి చూపు మందగించడం, కంటి చుట్టూ నొప్పి, ముక్కు ఇబ్బందులుంటే నేత్ర వైద్యులను కలవాల్సి ఉంటుంది. వారికి పరీక్షలు, స్కాన్‌ చేసి ఫంగ్‌సను గుర్తించాల్సి ఉంటుంది. సరైన సమయంలో గుర్తించి మందులు అందిస్తే లోపాలను అధిగమించవచ్చు. ఆలస్యం చేస్తే కంటి చూపు పోయే ముప్పు ఉంటుంది. చికిత్స చేసినా.. కంటి రక్తనాళాలు మూసుకుపోయినవారికి, గుండె మార్పిడి చేయించుకున్న వారికి, మధుమేహ బాధితులకు కోలుకోవడం కొంత ఆలస్యం అవుతుంది. ఇతరులకు త్వరగా నయమవుతుంది.


ఇప్పటికే రకరకాలకంటి సమస్యలున్నవారు ఈ కొవిడ్‌ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

కొవిడ్‌ భయంతో చాలా మంది ఆస్పత్రికి రావట్లేదు. గ్లకోమా, రెటినోపతి బాధితులు మందులు వినియోగించట్లేదు. పరీక్షలు చేయించుకోవట్లేదు. కొవిడ్‌, లాక్‌డౌన్‌ వల్ల చాలామంది ఇంటికే పరిమితం కావడంతో రెగ్యులర్‌ పరీక్షలకు అంతరాయం ఏర్పడుతోంది. కొంత మంది క్యాటరాక్ట్‌ పరీక్షలు, కంటి శస్త్రచికిత్సలను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో కంటి జబ్బులు ముదిరిపోతున్నాయి. ప్రారంభ దశలో రావాల్సిన కంటి సమస్యలు అడ్వాన్స్‌ స్టేజీలో వస్తున్నాయి. కాబట్టి కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులకు చూపించుకోవాలి.


కంటి ద్వారా వైరస్‌ సోకుతుందా?

దీనిపై స్పష్టత లేదు. కొన్ని అధ్యయనాలు.. కరోనా కంటి ద్వారా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటుండగా, మరికొన్ని అలాంటి అవకాశం లేదంటున్నాయి. అయితే కొవిడ్‌ సమయంలో కంటి రక్షణపై దృష్టి పెట్టాలి, ఫేస్‌ షీల్డ్‌, సాధారణ కళ్లద్దాలు పెట్టుకోవాలి.

Updated Date - 2021-06-24T09:54:33+05:30 IST