Abn logo
Oct 15 2021 @ 01:05AM

కంటి వెలుగు సమావేశం రసాభాస

   కర్నూలు(హాస్పిటల్‌), అక్టోబరు 14: డా.వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమంపై నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో గురువారం కర్నూలు జీజీహెచ్‌లోని ధన్వంతరీ హాల్‌లో కంటి వైద్యులు, ఆప్తాల్మిక్‌ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కంటి శుక్లాలు ఉన్న రోగులను గుర్తించి ఆపరేషన్లు నిర్వహించాలని కోరగా.. ఈ విషయంలో ప్రాంతీయ కంటి ఆసుపత్రి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.నివేదిత కంటి వెలుగు ప్రొగ్రాం అప్తాల్మిక్‌ ఆఫీసర్‌ మహేశ్వరరెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఆప్తాల్మిక్‌ ఆఫీసర్‌గా వైద్యులకు చెప్పడం సరికాదని, కంటి ఆపరేషన్ల కోసం వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించకుండా ఎలా ఆపరేషన్లు చేస్తారని డా.నివేదిత ప్రశ్నించారు. కంటి ఆసుపత్రిలో ఇద్దరు ఎల్‌టీలు ఉన్నారని, వారితో పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వైద్యులు రోగిని చూసి లోపలి జబ్బులను ఎలా కనుక్కొంటారని ప్రశ్నించారు. ఆప్తాల్మిక్‌ ఆఫీసర్‌ చెప్పిందని తప్పని, మీరు మాట్లాడకూడదని పేర్కొనడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇంతలో డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సర్దుమణిగింది. అనంతరం 2020-21 సంవత్సరానికి ఉత్తమ సేవలు అందించిన ఆదోని ఏరియా ఆసుపత్రి ఆప్తాల్మిక్‌ సర్జన్‌ డా.పద్మకుమార్‌, ఆప్తాల్మిక్‌ ఆఫీసర్‌ (ఓర్వకల్లు) సత్యనారాయణ, ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్‌ గంగాధర్‌, ఉత్తమ ఎన్జీవోగా శాంతిరాం ఆసపత్రులకు అవార్డులు అందజేశారు. కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.నరేంద్రనాథ్‌ రెడ్డి, జిల్లా అంథత్వ నివారణ సంస్థ కార్యదర్శి డా.సంధ్యారెడ్డి, కర్నూలు ప్రాంతీయ కంటి ఆసుపత్రి అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, సుశీల నేత్రాలయ ప్రతినిధులు పాల్గొన్నారు.