ఫ్రాన్స్‌ కోసం సిద్ధమైన మాస్క్‌లు.. గద్దలా తన్నుకుపోయిన అమెరికా

ABN , First Publish Date - 2020-04-04T14:38:24+05:30 IST

అప్పుడే బీజింగ్‌ నుంచి ఓ విమానం వచ్చింది. దాని నిండా లక్షలాది మాస్క్‌లతో కూడిన బండిల్స్‌ ఉన్నాయి.

ఫ్రాన్స్‌ కోసం సిద్ధమైన మాస్క్‌లు.. గద్దలా తన్నుకుపోయిన అమెరికా

మాస్కులు హైజాక్‌

షాంఘై ఎయిర్‌ పోర్టులో ఘటన.. 

మూడు రెట్లు ఎక్కువ డబ్బు ఎర

ఆరోపణల్లో నిజం లేదన్న అమెరికా

స్థలం: షాంఘై విమానాశ్రయం

సమయం: ఏప్రిల్‌ 3వ తేదీ ఉదయం

విమానం రాక:  అప్పుడే బీజింగ్‌ నుంచి ఓ విమానం వచ్చింది. దాని నిండా లక్షలాది మాస్క్‌లతో కూడిన బండిల్స్‌ ఉన్నాయి. ఇవన్నీ మెడికల్‌, పారామెడికల్‌ సిబ్బంది కోసం తయారు చేసిన ఎన్‌-95 తరహా కట్టుదిట్టమైన మాస్క్‌లు. కరోనా ధాటికి వందల మంది పౌరులను కోల్పోతున్న ఫ్రాన్స్‌ వీటి కోసం ఆర్డరిచ్చింది. ఇవి పారి్‌సకు వెళ్లాల్సి ఉంది.


ఏం జరిగింది: టర్మాక్‌ మీదకు విమానం ఆగగానే అంతలో ఓ నలుగురు వ్యక్తులు ఆ విమానం దగ్గరకు ప్రవేశించారు. అందులోని చైనా అధికారులతో మాట్లాడారు. ఫ్రాన్స్‌ ఇస్తానన్న డబ్బు కంటే మూడు రెట్లు ఎక్కువ ఇస్తాం... ఇవన్నీ మాకు ఇచ్చేయండి... అని బేరం మొదలెట్టారు. కానీ చైనా అధికారులు మొదట దీనికి అంగీకరించలేదు. ఆ తరువాత మరికాస్త ఎక్కువ సొమ్ము ఎరజూపారు. అయినా ఒప్పుకోలేదు. డబ్బు కట్టలు ఎత్తిచూపుతూ మరీ వెంటపడ్డారు. చివరకు అమెరికా నుంచి ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయి. మా దగ్గరే కేసులెక్కువ. ఫ్రాన్స్‌లో కంటే మా దేశంలోనే చైనీయులు ఎక్కువ మంది ఉన్నారు. మీరు మొదట సహకరించాల్సినది మాకే’ అని అమెరికా చైనా అధికారులకు నచ్చచెప్పింది. చివరకు చైనా విధిలేక ఆ కార్గో మొత్తాన్ని అమెరికాకు పంపేసింది. అలా ఫ్రాన్స్‌కు వెళ్లాల్సిన మాస్క్‌లన్నింటినీ అమెరికా ఆఖరినిముషంలో గద్దలా తన్నుకుపోయింది.


దుమారం

ఈ హైజాక్‌ ఘటన అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపింది. ఫ్రాన్స్‌ ఇది అనైతికమంటూ నిరసించింది. ప్రాణం ఎవరిదైనా ఒకటేనని, ఒక్క అమెరికన్‌ ప్రాణాలకే విలువుంటుందా.. అని నిలదీసింది. తమ దేశం నుంచి కూడా పెద్ద సంఖ్యలో మాస్క్‌ల కన్‌సైన్‌మెంట్లు దారిమళ్లించారని, దీని వెనుక ఎవరున్నారనేది తేలాలని కెనడా ప్రఽధాని ట్రూడో చెప్పారు. అయితే అమెరికా మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. మాస్క్‌లు, ఇతర ఉపకరణాల నిమిత్తం అమెరికా చైనాకు 23 పెద్ద కార్గో విమానాలను పంపినమాట మాత్రం నిజమని బ్రెజిల్‌ ఆరోగ్యమంత్రి లూయీ హెన్రిక్‌ మండేటా వెల్లడించారు. బ్రెజిల్‌, చెక్‌ రిపబ్లిక్‌ దేశాలు కూడా తమ దేశాలకు రావాల్సిన మాస్క్‌లు, వెంటిలేటర్లు దారిమళ్లాయని ఫిర్యాదు చేశాయి.

Updated Date - 2020-04-04T14:38:24+05:30 IST