మాస్క్‌ను ధరించినా.. మనిషిని ఇట్టే గుర్తుపట్టొచ్చు.. అదెలాగంటారా..!

ABN , First Publish Date - 2020-05-25T17:59:21+05:30 IST

కరోనా కారణంగా ఫేస్ మాస్క్‌లు మనజీవితంలో భాగమయ్యాయి!..

మాస్క్‌ను ధరించినా.. మనిషిని ఇట్టే గుర్తుపట్టొచ్చు.. అదెలాగంటారా..!

తిరువనంతపురం(కేరళ): కరోనా కారణంగా ఫేస్ మాస్క్‌లు మనజీవితంలో భాగమయ్యాయి! మాస్క్‌లు లేనిదే బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇలా ఎన్నిరోజులు అనేది చెప్పలేము. ఎందుకంటే వ్యాక్సిన్ కనుక్కునే వరకు కరోనా వ్యాప్తి తగ్గేలా లేదు! కూరగాయల కోసం వెళ్లినా, కిరాణ దుకాణానికి వెళ్లినా మాస్క్ తప్పనిసరి. ముక్కు, నోరు, చెంపలను కవర్ చేసేలా ఉండే ఈ మాస్క్‌ల వల్ల పక్కనున్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టడానికి కాస్త సమయం పడుతోంది. ఎయిర్‌ఫోర్ట్ చెకింగ్ పాయింట్ల వద్దగానీ, ఎగ్జామ్ హాలులో గానీ ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించి రావడం వల్ల తనిఖీలు ఆలస్యమవుతున్నాయి. ఈ సమస్యలన్నింటికి ఓ వ్యక్తి పరిష్కారం కనుగొన్నాడు! అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


కేరళలోని కొట్టాయం ప్రాంతంలోని ఎట్టుమన్నూరుకు చెందిన బినేశ్ పాల్ అనే ఓ డిజిటల్ ఫొటోగ్రాఫర్ వెరైటీ ఫేస్ మాస్క్‌లు తయారుచేసి అందరిచేత ప్రశంసలందుకుంటున్నాడు. అవే ఫొటో పేస్ మాస్క్‌లు. మన ముక్కు, నోరు, చెంపల కలబోతతో ఉండే ఫొటో మాస్క్‌లను ధరించడం వల్ల.. మనమెవరమో సులువుగా గుర్తుపట్టొచ్చు. దీనివల్ల ఎగ్జామ్ హాలుకు వెళ్లినా.. పంక్షన్లకు వెళ్లినా మనమెవరమో తెలిసిపోతుంది. ఈ ఆలోచన మీకెలా వచ్చిందని బినేశ్‌ను అడగగా ఆయన ఈ విధంగా స్పందించారు. 


‘నేను చాలా మాస్క్‌లను చూశాను. ప్రతిదీ మిక్కీ మౌస్, టామ్ అండ్ జెర్రీ, డోరా, చోటా భీమ్, టెడ్డీ బెర్రీ, సినిమా వ్యక్తులు, జంతువుల బొమ్మలతో తయారు చేసినవే. మన ఫొటోలతో ఉండే మాస్క్‌లనే ఎందుకు వాడకూడదని ఆలోచించాను. ఆ ఆలోచనలో నుంచి పుట్టినదే ఈ మాస్క్’అని చెప్పారు. ఈ మాస్క్‌లు ధరించి పెళ్లిళ్లకు వెళ్లినా, ఎగ్జామ్ హాలుకు వెళ్లినా ఎటువంటి సమస్యలు ఎదురుకావన్నారు. అంతేకాకుండా మన ప్రధాని మోదీ కూడా కొత్త కొత్త ఆవిష్కరణలకు ఇదే అవకాశమని చెప్పారు.. కాబట్టి తాను కూడా ఓ కొత్త మాస్క్‌ను ఆవిష్కరించానని చమత్కరించారు. 


‘ముందుగా ఏ వ్యక్తికి మాస్క్‌ కావాలో.. అతని ఫొటోను హైరిసోలూషన్ కెమెరాతో తీసుకుంటాము. ఆ తర్వాత అతని ఫొటోను ఓ పేపర్ మీద ప్రింట్ చేసి.. ఆ తర్వాత ఓ కాటన్ వస్తువు మీద ముద్రిస్తాము. అతడి ఫేస్ గుర్తు పట్టే విధంగా, కొలతలు తీసుకుని అధిక ఉష్ణోగ్రత వద్ద జాగ్రత్తగా ఫొటోను కత్తిరిస్తాము’అని చెప్పారు. ఈ ఫొటో మాస్క్‌లను తయారు చేయడానికి కేవలం 20నిమిషాలు సరిపోతుందని, అంతేకాకుండా దీనిని కేవలం రూ.60కు విక్రయిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు 1000 ఫొటో మాస్క్‌లను తయారు చేశాము. అందరికీ నచ్చడంతో.. మరో 5000 మాస్క్‌లకు ఆర్డర్ వచ్చిందన్నారు. ఆర్డర్‌లు ఎక్కువగా వచ్చినా.. మాస్క్‌ల నాణ్యతలో ఎటువంటి తేడా రానివ్వమన్నారు.

Updated Date - 2020-05-25T17:59:21+05:30 IST