Abn logo
Jun 30 2020 @ 02:54AM

ఫేస్‌ బుక్కయ్యింది!

  • ఊపందుకున్న ‘స్టాప్‌ హేట్‌ ఫర్‌ ప్రాఫిట్‌’ ఉద్యమం
  • ప్రకటనలు ఆపేసిన పలు పెద్ద కంపెనీలు
  • అదే బాటలో మరికొన్ని సంస్థలు
  • 8.3శాతం పడిపోయిన సంస్థ షేర్లు
  • 54 వేల కోట్లు తగ్గిన జుకర్‌బర్గ్‌ ఆస్తులు

విద్వేష పూరిత, తప్పుడు పోస్టులపై నిర్లక్ష్యం వహిస్తోందంటూ ఫేస్‌బుక్‌ను బహిష్కరించే ఉద్యమం ఊపందుకొంది. ‘స్టాప్‌ హేట్‌ ఫర్‌ ప్రాఫిట్‌’ పేరిట చేపట్టిన ఈ ఉద్యమంలో అనేక పెద్ద కంపెనీలు భాగస్వామ్యమవుతున్నాయి. ఫేస్‌బుక్‌కు ప్రకటనలు(యాడ్స్‌) ఇవ్వబోమని ప్రతినబూనుతున్నాయి. దీంతో ఫేస్‌బుక్‌ ఆదాయం గణనీయంగా పడిపోతోంది. గత శుక్రవారానికే 8 శాతానికిపైగా ఆదాయాన్ని ఫేస్‌బుక్‌ కోల్పోయింది. ఫేస్‌బుక్‌ కంపెనీ షేర్లు 8.3 శాతం పడిపోయాయి. జుకర్‌బర్గ్‌ రూ.54 వేల కోట్ల(7.2 బిలియన్‌ డాలర్లు) వ్యక్తిగత ఆస్తులు కోల్పోయారు. ఫేస్‌బుక్‌కు ప్రకటనలు ఇవ్వబోమని వెరిజోన్‌, యూనీలివర్‌, కోకాకోలా, హోండా తదితర ప్రముఖ కంపెనీలు ప్రకటించాయి. ఇప్పటి వరకు 160 కంపెనీల వర కు ఫేస్‌బుక్‌కు ప్రకటనలు ఇవ్వబోమని ప్రకటించాయి. ఫేస్‌బుక్‌కు ఉన్న 80 లక్షల ప్రకటనదారులతో పోలిస్తే, ఈ సంఖ్య నామమాత్రమే అయినప్పటికీ, వాటిలో ఇతర సంస్థలను ప్రభావితం చేసే వెరిజోన్‌, యూనీలివర్‌ వంటి సంస్థలు ఉండటంతో ఫేస్‌బుక్‌ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. విద్వేష పూరిత, తప్పుడు సమాచారం రాకుండా పటిష్ట చర్యలు చేపడతామంటూ 1600 పదాలతో ఫేస్‌బుక్‌ ఉపాధ్యక్షుడు కరోలిన్‌ ఎవర్సన్‌ ప్రకటనదారులకు లేఖ రాశారు.  


ప్రపంచవ్యాప్తం   కానున్న ఉద్యమం..

స్లీపింగ్‌ గెయింట్స్‌, ఫ్రీ ప్రెస్‌, కామన్‌సెన్స్‌ మీడి యా సంస్థలతో కలిసి పౌరహక్కుల సంస్థలు కలర్స్‌ ఆఫ్‌ చేంజ్‌, ఎన్‌ఏఏసీపీ, యాంటీ డిఫమేషన్‌ లీగ్‌ ఈనెల 17న స్టాప్‌ హేట్‌ ఫర్‌ ప్రాఫిట్‌ ఉద్యమాన్ని ప్రారంభించాయి. ఫేస్‌బుక్‌కు ప్రకటనలు ఇవ్వవద్దని పిలుపునిచ్చాయి. జూలైలో ఫేస్‌బుక్‌కు యాడ్స్‌ ఇవ్వొద్దని కోరారు. కాగా, అమెరికాలో జార్జి ఫ్లాయిడ్‌ మరణంతో ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ‘బ్లాక్‌ లివ్స్‌ మేటర్‌’ ఉద్యమంలాగే ఈ ఉద్యమమూ విస్తరించనుందని రాయిటర్స్‌ వార్తా సంస్థ ప్రత్యేక కథనం ప్రచురించింది. జూలైలో ఫేస్‌బుక్‌కు ప్రకటనలు ఇవ్వబోమని అమెరికాలోని 160కిపైగా కంపెనీలు ప్రకటించాయి. వాటిలో పటగోనియా, ఆర్‌ఈఐ, లెండింగ్‌ క్లబ్‌, ది నార్త్‌ ఫేస్‌ కంపెనీలు కూడా ఉన్నా యి. ఐరోపాలోనూ ప్రధాన కంపెనీలకు ఈ ఉద్యమం విస్తరించనుందని భావిస్తున్నారు. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రకటనదారులు ఇచ్చిన యాడ్స్‌ ద్వారా రూ.5.26 లక్షల కోట్లు (69.7 బిలియన్‌ డాలర్లు) ఆదాయాన్ని ఫేస్‌బుక్‌ ఆర్జించింది. కాగా, విద్వేష సమాచారా న్ని నిషేధించేందుకు ఫేస్‌బుక్‌ తన విధానాలను మార్చుకుంటుందని ఆ సంస్థ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ శుక్రవారం లైవ్‌స్ర్టీమ్‌ ద్వారా ప్రకటించారు. అయితే, యాడ్స్‌ బహిష్కరణను ఆయన ప్రస్తావించలేదు.  


ట్విటర్‌, గూగుల్‌లకూ తప్పదా?...

కాగా, ఈ ఉద్యమంలోకి వచ్చేలా ఇతర ప్రకటనదారులనూ వెరిజోన్‌ ప్రభావితం చేయగలదని విశ్లేషకులు పేర్కొన్నారు. జూలై నాటికి ఫేస్‌బుక్‌తోపాటు ట్విటర్‌ను ఇతర కంపెనీలూ బాయ్‌కాట్‌ చేస్తాయని, గూగుల్‌ను కూడా బాయ్‌కాట్‌ చేయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.        


ట్రంప్‌ పోస్టుతో ఆరంభం

ఈనెల మొదట్లో మిన్నియాపోలి్‌సలో ఆందోళనలను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పెట్టిన వివాదాస్పద పోస్టులను తొలగించేందుకు ఫేస్‌బుక్‌ నిరాకరించడంతో సమస్య మొదలైంది. మరోవైపు ట్విటర్‌  ట్రంప్‌ పోస్టుపై హెచ్చరిక కూడా జారీ చేసింది. అమెరికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై హింసను ఫేస్‌బుక్‌ ప్రోత్సహిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తాయి.  


జుకర్‌బర్గ్‌ హామీ ఇచ్చినా..

తామూ ఈ ఉద్యమంలో చేరుతున్నట్టు ఒమినిక్‌ గ్రూప్‌లో భాగమైన ప్రధాన యాడ్‌ ఏజెన్సీ గుడ్‌బై, సిల్వర్‌స్టీన్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌  కూడా ఈ వారం ప్రకటించింది. ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టులు పెట్టబోమని కూడా ప్రతినబూనింది. సొంత నిబంధనలపైనే ఫేస్‌బుక్‌ దృష్టి పెట్టలేకపోతోందని ఆ కంపెనీ కో-చైర్మన్‌ జెఫ్‌ గుడ్‌బై సీఎన్‌బీసీ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా,  ఫేస్‌బుక్‌ హామీ ఇచ్చినప్పటికీ సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయని ది మీడియా కిచెన్‌ సీఈవో బెర్రీ లోవెంతల్‌ పేర్కొన్నారు. కాగా, దీనిపై సమగ్ర ప్రణాళికను ఫేస్‌బుక్‌ రూపొందిస్తుందని ఫేస్‌బుక్‌ క్లైంట్‌ కౌన్సిల్‌ వ్యవస్థాపక సభ్యుడు డేవిడ్‌ జోన్స్‌ పేర్కొన్నారు.  -సెంట్రల్‌ డెస్క్‌

Advertisement
Advertisement
Advertisement