Abn logo
Aug 20 2021 @ 17:34PM

రాహుల్ గాంధీకి ఫేస్‌బుక్ షాక్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పెట్టిన ఓ పోస్ట్‌ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తొలగించాయి. ఈ విషయాన్ని ఆయనకు, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్)కు తెలిపినట్లు సమాచారం. వాయవ్య ఢిల్లీలో కొందరు దుండగులు ఇటీవల తొమ్మిదేళ్ళ బాలికపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేయడంతో, బాధితురాలి తల్లిదండ్రులను రాహుల్ పరామర్శించారు. ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దీనిపై ఎన్‌సీపీసీఆర్, బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. 


ఈ పోస్ట్‌ తమ విధానాలకు విరుద్ధంగా ఉందని, దీనిని తొలగించాలని ఫేస్‌బుక్ ఇటీవల రాహుల్ గాంధీని కోరింది. ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి ఒకరు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తమ విధానాలను ఉల్లంఘిస్తున్న కంటెంట్‌ను తొలగించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. కమ్యూనిటీ స్టాండర్డ్స్‌ను ఉల్లంఘించే కంటెంట్‌ను ఫేస్‌బుక్ తొలగిస్తుంది. భారత దేశంలో అమల్లో ఉన్న చట్టాలకు అనుగుణంగా సరైన విజ్ఞప్తి వచ్చినపుడు కూడా ఇటువంటి చర్యలు తీసుకుంటుంది. 


ఎన్‌సీపీసీఆర్ గత వారం ఫేస్‌బుక్‌కు ఓ లేఖ రాసింది. రాహుల్ గాంధీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో చేసిన పోస్ట్ చట్ట వ్యతిరేకమని, దానిని తొలగించాలని కోరింది. జువెనైల్ జస్టిస్ యాక్ట్, 2015; లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ  (పోక్సో) చట్టం, 2012; భారత శిక్షా స్మృతి నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ పోస్ట్ చేశారని పేర్కొంది. దీనిపై తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో రాహుల్ గాంధీకి ఫేస్‌బుక్ నోటీసు ఇచ్చింది. పర్యవసానంగా తన సమక్షంలో హాజరై వివరణ ఇవ్వాలని ఫేస్‌బుక్‌కు జారీ చేసిన ఆదేశాలను ఎన్‌సీపీసీఆర్ ఉపసంహరించింది. 


ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో ఆగస్టు 1న కొందరు దుండగులు తొమ్మిదేళ్ళ బాలికపై అత్యాచారం చేసి, హత్య చేశారని కేసు నమోదైంది. బాధితురాలి తల్లిదండ్రులను రాహుల్ గాంధీ పరామర్శించారు. వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వారితో మాట్లాడుతుండగా తీసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లలో పోస్ట్ చేశారు. దీనిపై ట్విటర్ స్పందించి రాహుల్ గాంధీతోపాటు, దాదాపు 5,000 మంది కాంగ్రెస్ నేతల ట్విటర్ ఖాతాలను తాత్కాలికంగా బ్లాక్ చేసింది. బాధితురాలి కుటుంబ సభ్యుల అంగీకారంతోనే తాను ఈ ఫొటోను షేర్ చేశానని రాహుల్ గాంధీ తెలిపారు. వారు ఇచ్చిన అంగీకార పత్రాన్ని రాహుల్ ట్విటర్‌కు సమర్పించారు. అనంతరం రాహుల్‌తోపాటు కాంగ్రెస్ నేతల ఖాతాలను ఆగస్టు 14న ట్విటర్ పునరుద్ధరించింది. కానీ ఈ పోస్ట్‌‌ భారత దేశంలో కనిపించకుండా బ్లాక్ చేసింది.