సర్కారీ ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలి

ABN , First Publish Date - 2021-06-14T08:59:06+05:30 IST

కరోనా థర్డ్‌వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలను మెరుగుపర్చాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు.

సర్కారీ ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలి

  • ఆక్సిజన్‌ పడకలు, వైద్యులు, సిబ్బందిని పెంచాలి
  • పెద్ద ఆస్పత్రులపై చర్యలేవి?: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి 

హైదరాబాద్‌, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): కరోనా థర్డ్‌వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలను మెరుగుపర్చాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. ఆక్సిజన్‌ పడకల సంఖ్యను పెంచడంతోపాటు అదనంగా వైద్యులు, సిబ్బందిని నియమించాలని సూచించారు. నిత్యం ఆక్సిజన్‌ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే కరోనా సెకండ్‌వేవ్‌లో వందలాది మంది పేదలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆదివారం విలేకరులతో జగ్గారెడ్డి మాట్లాడారు. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకున్నాయో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ అందకనే చాలా మంది చనిపోయారని, మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. థర్డ్‌ వేవ్‌ వచ్చినప్పుడు చూద్దామనుకుంటే.. అంతకు మించిన దుర్మార్గం ఉండదని వ్యాఖ్యానించారు. ముందుగా అప్రమత్తం కావాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని చెప్పారు. 


రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిపుణులైన వైద్యులు ఉన్నా.. వసతులు సరిగ్గా లేవని తెలిపారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వసతులు, వైద్యం బాగున్నా.. ఇష్టానుసారం డబ్బులు వసూలు చేయడం బాగోలేదని అన్నారు. చికిత్స పొందుతూ చనిపోయిన వారి కుటుంబాల నుంచి డబ్బు వసూలు చేస్తే.. ఆయా ఆస్పత్రులకు ఉసురు తగులుతుందని వ్యాఖ్యానించారు. ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరితే కనీసం రూ.15లక్షలు చెల్లించాల్సి వస్తుందని, మనిషి బతికితే... ఇంకో ఐదు లక్షలు కట్టి ఇంటికి చేరుతున్నారని తెలిపారు. ఒకవేళ రోగి చనిపోతే.. డబ్బు కట్టాక గానీ మృతదేహాన్ని ఇవ్వడం లేదని, దీనిపై ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఆలోచన చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన చార్జీలను ప్రైవేట్‌ ఆస్పత్రులు అమలు చేయడం లేదని ఆరోపించారు. కరోనా కష్టకాలంలో ప్రజలను వేధించి... పాపం మూట కట్టుకోవద్దని హితవు పలికారు. ఈ విషయమై సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానని చెప్పారు. శస్త్రచికిత్స చేసిన తర్వాత ఇవ్వాల్సిన మందులు, ఇంజక్షన్లు దొరక్క బ్లాక్‌ ఫంగస్‌ రోగులు మరణిస్తున్నారన్నారు. మంత్రి కేటీఆర్‌కు ట్విటర్‌లో సమాచారం ఇస్తే.. కొందరికి మాత్రమే సాయం అందిందని ఆరోపించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్‌ ఆస్పత్రులపై చర్యలు తీసుకునేందుకు సీఎం వేసిన టాస్క్‌ఫోర్స్‌ కనబడటం లేదని విమర్శించారు. చిన్న ఆస్పత్రులపై దాడులు చేస్తున్న టాస్క్‌ఫోర్స్‌.. పెద్ద వాటి వైపు ఎందుకు చూడడం లేదని ప్రశ్నించారు. 


పీసీసీ లేదంటే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

టీపీసీసీ అధ్యక్షుడిగా తనకు అవకాశం కల్పించాలని సోనియా, రాహుల్‌కు విజ్ఞప్తి చేసినట్టు జగ్గారెడ్డి తెలిపారు. ఒకవేళ పీసీసీ ఇవ్వలేని పక్షంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గానైనా నియమించాలని కోరినట్లు చెప్పారు. ‘‘వీహెచ్‌ పార్టీలో చాలా సీనియర్‌. ఆయన ఏం మాట్లాడినా చెల్లుబాటవుతుంది. మేము అలా మాట్లాడలేం. పీసీసీ విషయంలో ఎవరి అభిప్రాయం వారిది. ఆ విషయంలో నేను జోక్యం చేసుకోను. సమయం.. సందర్భం వచ్చినపుడు అన్నీ చెబుతా’’ అని ఆయన స్పష్టం చేశారు.  

Updated Date - 2021-06-14T08:59:06+05:30 IST