ఓటీఎస్‌లో వెలుగుచూస్తున్న నిజాలు

ABN , First Publish Date - 2021-12-02T07:13:46+05:30 IST

జగనన్న శాశ్వత గృహహక్కు పథకంలో భాగంగా లబ్ధిదారుల నుంచి రుణ బకాయిల వసూలుకు రోజువారీ లక్ష్యాలు నిర్ణయిస్తున్నారు. కానీ లబ్ధిదారుల నుంచి స్పందన ఉండకపోవడంతో కింది స్థాయి ఉద్యోగులు తమ ఉన్నతాధికారులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక సతమతమవుతున్నారు.

ఓటీఎస్‌లో వెలుగుచూస్తున్న నిజాలు

  • మండపేట మండలంలో కట్టిన ఇళ్లలో సగంపైనే శిథిలం
  • కొన్ని మొండి గోడలతోనూ ప్రత్యక్షం  
  • కొన్ని అడ్రస్‌లే గల్లంతు

మండపేట, డిసెంబరు 1: జగనన్న శాశ్వత గృహహక్కు పథకంలో భాగంగా లబ్ధిదారుల నుంచి రుణ బకాయిల వసూలుకు రోజువారీ లక్ష్యాలు నిర్ణయిస్తున్నారు. కానీ లబ్ధిదారుల నుంచి స్పందన ఉండకపోవడంతో కింది స్థాయి ఉద్యోగులు తమ ఉన్నతాధికారులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక సతమతమవుతున్నారు. ఏకకాల పరిష్కారం (ఓటీఎస్‌) పేరుతో 1983 నుంచి 2011 వరకు గృహనిర్మాణ బకాయిలు చెల్లించాలని కొద్దిరోజులుగా అప్పటి లబ్ధిదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. గృహనిర్మాణసంస్థ అందజేసిన జాబితా ప్రకారం సచివాలయ వలంటీర్లు అందుబాటులో ఉన్నవారిని గుర్తించి అవసరమైన ధ్రువపత్రాల నకళ్లను తీసుకున్నారు. ఈ 28 ఏళ్లలో లబ్ధిదారుల్లో కొందరు చనిపోయారు. కొందరు ఇళ్లతో సహా స్థలాలను అమ్ముకోవడం, వారసుల స్వాధీనంలో ఉన్నాయి. అప్పుడు కట్టుకున్న ఇళ్లు ప్రస్తుతం 50 శాతం కూడా లేవు. శిథిలమైపోయి ఉన్నాయి. మం డపేట నియోజకవర్గంలో 1983 నుంచి 2011 వరకు గృహరుణం పొందిన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు. మొత్తం 6,227 మంది ఓటీఎస్‌కు అర్హులని గుర్తించారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 1179 మంది నుంచి ఒత్తిడి తెచ్చి వన్‌ టైం సెటిల్‌మెంట్‌ కింద నగదు కట్టించుకున్నారు. ఇక 1200 గృహాల ఆచూకీ లేదు. ఎవరైనా బినామీ పేర్లతో రుణం పొందారేమోనని అనుమానిస్తున్నారు.

సిత్రాలు చూడరో..

పైకప్పు శిథిలం కావడంతో తాటాకులతో, టార్పాలిన్‌ షీట్‌తో కప్పుకున్న ఈ ఇల్లు ఇదే చిత్రంలో ఉన్న వృద్ధురాలిది. 1984లో మండపేట మండలం పాలతోడు గ్రామంలోని బీసీ కాలనీలోఎన్టీఆర్‌ హయాంలో రూ.6 వేల రుణం పొందింది. ఇప్పుడు ఈ బకాయి కట్టమంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఇక కిందనున్న చిత్రం.. మొండిగోడలతో అసంపూర్తి నిర్మాణంగా ఉన్న ఈ స్థలం యజమానికీ డబ్బులు కట్టాలని చెబుతున్నారట. ఇది తాపేశ్వరం గ్రామంలోని దేవుళ్లమ్మ కాలనీలో ఉంది. 

Updated Date - 2021-12-02T07:13:46+05:30 IST