వ్యవసాయ బిల్లులు

ABN , First Publish Date - 2020-09-26T07:32:22+05:30 IST

మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక వినాశకర వ్యవసాయ విధానాలపై అన్నదాతలు ఆగ్రహించారు. మెడలో ఉరితాడు బిగించు

వ్యవసాయ బిల్లులు

రైతుల పాలిట మరణ శాసనాలు

కలెక్టరేట్‌ వద్ద వామపక్షాలు, రైతుల ధర్నా 


ఏలూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 25 : మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక వినాశకర వ్యవసాయ విధానాలపై అన్నదాతలు ఆగ్రహించారు. మెడలో ఉరితాడు బిగించుకుని  మోదీ వ్యవసాయ బిల్లులు రైతుల పాలిట మరణ శాసనాలంటూ నిరసన వ్యక్తం చేశారు. అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ దేశ వ్యాప్త ఆందోళనలో భాగంగా ఏపీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతుల సంఘం, అఖిల భారత రైతు సంఘం, రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు.


వ్యవసాయ బిల్లుల ప్రతులను దహనం చేశారు. సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, కాంగ్రెస్‌, విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. సీపీఎం జిల్లా కార్యదర్శి చింతకాయల బాబూరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకరరావు మాట్లాడుతూ కేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు రైతుల పాలిట మరణశాసనాలు అని విమర్శించారు. కార్పొరేట్‌ కంపెనీలకు లాభాలు, రైతులకు నష్టం తెచ్చే బిల్లును అందరూ వ్యతిరేకించాలన్నారు.


మోదీ చెబుతున్నట్టు రైతుల ఆదాయం రెట్టింపు కాదని కార్పొరేట్‌ కంపెనీల ఆస్తులు అనేక రెట్లు పెరుగుతాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రాజ్య సభలో బిల్లులు ఆమోదించిన తీరు పార్లమెంట్‌ చరిత్రలో చీకటి రోజన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించి రైతుల మెడలకు ఉరితాడులుగా మార్చవద్దన్నారు.కార్యక్రమంలో నాగరాజు, జి.వెంకట్రావు, చక్రవర్తి, కె.హేమశంకర్‌, ఎల్‌.శ్రీనివాసరావు, శీలం రామరాజు, పి.భాస్కరరావు, బుచ్చిరాజు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-26T07:32:22+05:30 IST