సకాలంలో పరిహారం ఇవ్వకపోవడం మానవ హక్కులను హరించడమే

ABN , First Publish Date - 2021-08-03T06:39:54+05:30 IST

ప్రాజెక్టులకు భూసేకరణ చేసి సకాలంలో పరి హారం ఇవ్వకపోవడం మానవ హక్కులను హరించడమే అని జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు.

సకాలంలో పరిహారం ఇవ్వకపోవడం మానవ హక్కులను హరించడమే
బీఎన్‌.తిమ్మాపురంలో నిర్వాసితుల సమావేశంలో మాట్లాడుతున్న ఆచారి

జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారి

భువనగిరి రూరల్‌, ఆగస్టు 2: ప్రాజెక్టులకు భూసేకరణ చేసి సకాలంలో పరి హారం ఇవ్వకపోవడం మానవ హక్కులను హరించడమే అని జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. బస్వాపురం రిజర్వాయర్‌ నిర్వాసితులతో బీఎన్‌.తిమ్మాపురం పంచాయతీ కార్యాలయం ఆవరణలో సోమవారం నిర్వహించిన సమా వేశంలో ఆయన మాట్లాడారు. బీఎన్‌.తిమ్మాపురం బాధితులకు మార్కెట్‌ ప్రకారం పరిహారం వెంటనే చెల్లించాలని, అనువైనచోట పునరావాసం కల్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులను చేపట్టకుండా రెవెన్యూ, పంచాయతీరాజ్‌, ఇతర శాఖల అధికారులు అడ్డుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల గ్రామంలో నూతనంగా నిర్మించిన 70ఇళ్లకు నీటి సరఫరా, విద్యుత్‌ సరఫరా ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిర్వాసితులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పరిహారం చెల్లించకపోగా, భూముల ఫౌతీ కూడా చేయడంలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు మానవ హక్కులను హరించడమేనని అలాంటి అధికారులు ఢిల్లీకి రావాల్సి ఉంటుందని ఆచారి హెచ్చరించారు. నూతనంగా నిర్మించుకున్న ఇళ్లకు నీటి సరఫరా కనెక్షన్‌ వెంటనే ఇవ్వాలని, ఎకరానికి రూ.21లక్షల చొప్పున పరిహారం ఒకే దఫా చెల్లించాలని, అనువైన ప్రాంతంలో పునరావాసం కల్పించాలని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీని ఆదేశించారు. రైతు బంధు, బీమా అందించాలన్నారు. రైతులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, కమిషన్‌ అండగా ఉండి న్యాయం జరిగేలా చూస్తుందన్నారు. ప్రాజెక్టుల్లో భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి పెళ్లి చేసుకునేందుకు పిల్లలు కూడా దొరకడంలేదని, ప్రభుత్వాలు ప్రజల మనోభావాలకు అనుగుణంగా భూ సేకరణ చేపట్టాలన్నారు. అనంతరం బస్వాపురం రిజర్వాయర్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, 1761ఎకరాలకు 432ఎకరాలు మాత్రమే భూసేకరణ చేపట్టడం సరికాదన్నారు. మిగిలిన 1197ఎకరాకు నోటిఫికేషన్‌ జారీ చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పీవీ శ్యాంసుందర్‌, గూడూరు నారాయణరెడ్డి, నర్ల నర్సింగ్‌రావు, పీఏస్‌ రవీందర్‌, దాసరి మల్లేశం, ధనుంజయ్య, ఆర్డీవో సూరజ్‌కుమార్‌, సర్పంచ్‌ పిన్నం లతా, ఎంపీటీసీ శారద, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ సత్తిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-08-03T06:39:54+05:30 IST