రిజిస్ట్రేషన్ల జాతర!

ABN , First Publish Date - 2022-01-29T05:23:51+05:30 IST

రిజిస్ట్రేషన్ల జాతర!

రిజిస్ట్రేషన్ల జాతర!

  • ఉమ్మడి జిల్లాలో రద్దీగా మారిన రిజిస్ర్టేషన్‌ కార్యాలయాలు
  • బారులు తీరిన క్రయవిక్రయదారులు
  • సాధారణం కంటే నాలుగింతలు పెరిగిన రిజిస్ట్రేషన్లు
  • రాత్రి 9 గంటల వరకు కొనసాగిన రిజిస్ర్టేషన్లు
  • సర్వర్‌ సమస్యతో తప్పని ఇబ్బందులు
  • కొవిడ్‌ నిబంధనలకు తిలోదకాలు..
  • పట్టించుకోని అధికారులు


 వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, భవనాల విలువ పెరగనున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో సబ్‌ రిజిస్ట్రార్‌, జాయింట్‌ సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాలు క్రయవిక్రయదారులతో కిటకిటలాడుతున్నాయి. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు (ఓపెన్‌ ప్లాట్లు),  భవనాల విలువ పెరగనున్న నేపథ్యంలో ఇంతకు ముందే ఒప్పందాలు చేసుకున్న కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు రావడంతో ఈ కార్యాలయాలు రద్దీగా మారాయి.  మరోపక్క  సర్వర్‌ సమస్య ఉత్పన్నమవుతుండడంతో రిజిస్ట్రేషన్‌ కోసం  రాత్రి వరకు వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.


రంగారెడ్డి అర్బన్‌/వికారాబాద్‌ప్రతినిధి/మేడ్చల్‌/ఘట్‌కేసర్‌/ఇబ్రహీంపట్నం/కందుకూరు/చేవెళ్ల/మహేశ్వరం, జనవరి 27 : ఉమ్మడి జిల్లాలోని రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున సందడి నెలకొంది. రెండు రోజులుగా కార్యాలయాల వద్ద రిజిస్ర్టేషన్‌ జాతర కనిపిస్తోంది. స్తిరాస్తి రిజిస్ర్టేషన్లతో ఆఫీసులు రద్దీగా మారాయి. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి వ్యవసాయ భూముల విలువ 50 శాతం, ఖాళీ స్థలాల (ఓపెన్‌ ప్లాట్లు) విలువ 35 శాతం, భవనాల విలువ 25 శాతం పెంచనున్నారన్న ప్రచారంతో ఇంతకు ముందే  ఒప్పందాలు చేసుకున్న కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు రావడంతో కార్యాలయాలు రద్దీగా మారాయి. పెరగనున్న విలువతో తమపై పడే ఆర్థిక భారాన్ని తప్పించుకునేందుకు కొనుగలుదారులు ప్రస్తుతం ఉన్న ధరలతోనే రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పలు కారణాలతో వాయిదా వేసుకుంటూ వచ్చిన వారందరూ రిజిసేర్టషన్లు పూర్తి చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే భూములు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకోని వారందతా మీసేవా సెంటర్లకు పరుగులు పెడుతున్నారు. స్లాట్‌ బుకింగ్‌ల సంఖ్య పెరగడంతో రిజిస్ట్రేషన్‌, తహసీల్దార్‌ కార్యాలయాలు జనాలతో కిక్కిరిసి పోయాయి. సాధారణ రోజుల్లో జరిగే రిజిస్ట్రేషన్లకు సుమారు ఐదింతలు పెరిగాయి. మరో రెండు రోజులు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదయం 10.30 గంటలకే కార్యాలయాల వద్ద జన జాతర తలపిస్తోంది. సాధారణంగా రోజుకు 50-75 డాక్యుమెంట్లు రిజిస్ర్టేషన్‌ అయ్యేవి. ప్రస్తుతం ఆసంఖ్య 200-300 దాటుతున్నాయి. సాధారణంగా మేడ్చల్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయంలో రోజువారీగా 40 నుంచి 50 డాక్యుమెంట్లు అయ్యేవి. రెండు రోజులుగా దాదాపు 300కు పైగా డాక్యుమెంట్లు అవుతున్నాయి. గతంలో ఘట్‌కేసర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రోజుకు 23 నుండి 35వరకు జరిగే రిజిస్టేషన్లు మూడు నుంచి నాలుగింతలు పెరిగాయి.  గురువారం 82 రిజిస్టేషన్లు కాగా శుక్రవారం 120 రిజిస్టేషన్లు జరిగాయి. శామీర్‌పేటలో 30 రిజిస్ట్రేషన్లకు బదులు 45 జరిగాయి, కీసరలో 30 రిజిస్ట్రేషన్లకు 218 రిజిస్ట్రేషన్లు జరిగాయి.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయంలో శుక్రవారం 50 ప్లాట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి. అలాగే చేవెళ్ల తహసీల్దార్‌ కార్యాలయంలో 100 రిజిస్ట్రేషన్లకు 52 చేశారు. షాబాద్‌ మండలంలో 41 రిజిస్ట్రేషన్లకు గాను 20  చేశారు. శంకర్‌పల్లి మండలంలో 59 రిజిస్ట్రేషన్ల కాగా మొయినాబాద్‌ మండలంలో 53 డాక్యుమెంట్లు రిజిస్టేషన్స్‌ అయ్యాయి. షాద్‌నగర్‌ సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో సర్వర్‌ సమస్య నెలకొంది. సాధారణంగా రోజుకు 40 డాక్యుమెంట్స్‌ రిజిస్ర్టేషన్లు  అవుతుండగా, శుక్రవారం 102 రిజిస్ర్టేషన్లు  చేశారు. 

వికారాబాద్‌ జిల్లాలో 4సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వికారాబాద్‌, పరిగి, తాండూరు, కొడంగల్‌ల్లోని కార్యాలయాల్లో సాధారణ రోజుల్లో నెలకు 1000 నుంచి 1200 వరకు జరగ్గా, ఐదారు రోజులుగా  మూడింతల వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే, తహసీల్దార్‌ కమ్‌ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నెలకు 1000 నుంచి 1400 వరకు  వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు కొనసాగుతూ రాగా, వారం రోజులుగా రిజిస్ట్రేషన్ల సంఖ్య మూడింతలు పెరిగాయి.

వికారాబాద్‌లో మూడింతలు పెరిగిన ఓపెన్‌ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు

వికారాబాద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సాధారణంగా రోజుకు 15 నుంచి 20 వరకు రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఓపెన్‌ ప్లాట్లు, భవనాల విలువ పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇది వరకే ఒప్పందాలు చేసుకున్న వారు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. కార్యాలయం రద్దీగా మారింది. ఈనెల 26న 37 రిజిస్ట్రేషన్లు జరగ్గా, 28న ఏకంగా 67 రిజిస్ట్రేషన్లు జరిగాయంటే పెరగనున్న భారం ఏ మేర కొనుగోలుదారులను ఆందోళనలకు గురిచేస్తుందనేది స్పష్టమవుతోంది. వికారాబాద్‌ తహసీల్దార్‌ కమ్‌ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రోజూ15 వరకు  రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య రెండింతలు పెరిగింది. ఈ కార్యాలయంలో శుక్రవారం 30 రిజిస్ట్రేషన్లు జరిగాయి. 

అమలుకు నోచుకోని కొవిడ్‌ నిబంధనలు

 భూముల మార్కెట్‌ విలువ పెరగనున్న నేపథ్యంలో పాత ధరలతో రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు వచ్చే కొనుగోలుదారులు, విక్రయించే వారితో సబ్‌ రిజిస్ట్రార్‌, తహసీల్దార్‌ కమ్‌ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు రద్దీగా మారాయి. క్రయవిక్రయదారులతో కిక్కిరిసిపోతున్నాయి. కొవిడ్‌ నిబంధనలు ఎక్కడ కూడా అమలు కావడం లేదు.  భౌతిక దూరం పాటించడం లేదు. శానిటైజర్లు కూడా అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు తప్ప లేదు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లోకి ఒకరి తర్వాత ఒకరిని పంపించాల్సి ఉండగా, ఆ విధంగా జరగడం లేదు. ఫలితంగా వచ్చిన వారిలో ఎవరికైనా కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చి ఉంటే... ఆ వ్యాప్తి ఏ విధంగా ఉంటుందనేది విస్మరిస్తూ ఆదాయమే ధ్యేయంగా అధికారులు వ్యవహరిస్తుండడం శోచనీయం. 

ఏడాదిలో రెండుసార్లు పెంపు

 ఏడాదిలో ప్రభుత్వం రెండుసార్లు భూముల ధరలు పెంచడంపై పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము భూములు, ఓపెన్‌ ప్లాట్లు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఎంతో కష్టపడి ఖాళీ ప్లాట్‌ కొనుగోలు చేసుకుంటే రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం కూడా భారమయ్యే విధంగా ప్రభుత్వ నిర్ణయాలున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాల మాదిరిగా కాకుండా గ్రామీణ ప్రాంతమైన వికారాబాద్‌ జిల్లాలో భూములు, ఖాళీ స్థలాల విలువ పెంపు చాలా కనిష్టంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

సర్వర్‌ డౌన్‌ సమస్య

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరగడంతో ధరణి వెబ్‌సైట్‌పై ప్రభావం చూపుతోంది. ఎక్కువ లోడ్‌పడడంతో సర్వర్‌ మొరాయిస్తోంది. మరోవైపు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కూడా సర్వర్‌ స్లో కావడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నెమ్మదిగా కొనసాగింది. ధరణిలో సాంకేతిక లోపంతో కందుకూరు రిజిస్ర్టేషన్‌ కార్యాలయంలో రాత్రి వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. శుక్రవారం 44 మంది రైతులు ధరణిలో స్లాట్‌బుక్‌ చేసుకున్నా సాయంత్రం వరకు కేవలం 10 మంది రైతులకు కూడా రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో రాత్రి 7:30 గంటల వరకు తహసీల్దార్‌ జ్యోతి తన సిబ్బందితో కలిసి పని చేశారు. ఇబ్రహీంపట్నం తహసీల్దారు కార్యాలయంలో ఈనెల 24, 25 తేదీల్లో స్లాట్‌ బుక్‌ అయినవి కూడా సర్వర్‌డౌన్‌ కారణంగా జనం పడిగాపులు గాశారు. సర్వర్‌ సమస్యతో రిజిస్ట్రేషన్‌ కోసం క్రయవిక్రయదారులు రాత్రి వరకు వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

పట్నంలో ఎక్కువ సంఖ్యలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు

 రెండ్రోజులుగా ఇబ్రహీంపట్నం సబ్‌ రిజిస్త్రార్‌ కార్యాలయంలో ఎక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. సాధారణంగా రోజుకు 30-40 వరకు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా గురువారం 150, శుక్రవారం 150 వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. 

Updated Date - 2022-01-29T05:23:51+05:30 IST