ఈమాన్‌- అద్వితీయ శక్తి!

ABN , First Publish Date - 2020-10-09T07:51:19+05:30 IST

ఇస్లాం ధర్మానికి ఉన్న అయిదు మూల స్తంభాల్లో విశ్వాసం రెండవది. అల్లాహ్‌, దైవదూతలు, దైవ గ్రంథాలు, దైవ ప్రవక్తల మీదా, మరణానంతర జీవితం మీదా విశ్వాసం ఉంచడాన్ని ‘ఈమాన్‌’ అంటారు. అది అద్వితీయశక్తి. ఆ విశ్వాసమే ఆలోచనలకూ, తాత్త్వికతకూ మూలం....

ఈమాన్‌- అద్వితీయ శక్తి!

ఇస్లాం ధర్మానికి ఉన్న అయిదు మూల స్తంభాల్లో విశ్వాసం రెండవది. అల్లాహ్‌, దైవదూతలు, దైవ గ్రంథాలు, దైవ ప్రవక్తల మీదా, మరణానంతర జీవితం మీదా విశ్వాసం ఉంచడాన్ని ‘ఈమాన్‌’ అంటారు. అది అద్వితీయశక్తి. ఆ విశ్వాసమే ఆలోచనలకూ, తాత్త్వికతకూ మూలం. దాని ఆధారంగానే జీవితగమ్యాన్ని నిర్దేశించే కార్యక్రమాలు రూపొందుతాయి. విశ్వాసిని ఆచరణాత్మకమైన మార్గంలో పయనింపజేస్తాయి. 


ఇతర జీవరాశులకు లేనివీ, మానవులకు ఉన్నవీ ఆలోచనాశక్తి, జ్ఞానం. జంతువుకూ, కీటకాలకూ, చెట్టు చేమలకూ ఆలోచనా శక్తి ఉండదు. చెట్లు తమంతట తాముగా కదలలేవు. జంతువులు ప్రకృతి శక్తికి లోబడి ఉంటాయి. తమకు తాముగా ఏమార్పూ తీసుకురాలేవు. కానీ మానవుడు తన మార్గాన్ని స్వయంగా నిర్దేశించుకోగలడు. ఆ మార్గంలో ప్రయాణించడానికి అవసరమైన ఆచణాత్మకత కోసం అతనికి అన్ని అవకాశాలను దైవం ప్రసాదించాడు. 

ఇస్లామీయ దృక్పథం మానవుడి జీవితంతో సంపూర్ణమైన సంబంధం కలిగి ఉంటుంది. అల్లాహ్‌పైనా, ఆయన ప్రవక్తలపైనా, మరణానంతర జీవితంపైనా విశ్వాసాన్ని నింపుతుంది. అతడిలో వివ్లవాత్మకమైన మార్పునకు ప్రేరణఅవుతుంది. ఈ దృక్పథం మానవుడి జ్ఞానం, బుద్ధి, స్వాభీష్టాల మీద ఆధారపడి ఉంది జంతువుల్లా అనాలోచిత జీవనాన్ని గడపడం మానవ లక్షణం కాదు. ఈ క్రమంలో మానవుడి ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి దేవునికి విధేయునిగా ఉండే మార్గం - విశ్వాస (ఈమాన్‌) మార్గం. రెండవది దేవుణ్ణి తిరస్కరించే మార్గం - అవిశ్వాస మార్గం. వీటిలో ఏది ఎంచుకోవాలనేది మానవుడు బాగా ఆలోచించాలి. ఇహలోకంలో, పరలోకంలో సాఫల్యం పొందాలంటే ఎంచుకోవలసింది విశ్వాస మార్గాన్నే! దానికి విరుద్ధంగా అవిశ్వాస మార్గం ఎంచుకుంటే పరాజితుడవుతాడనేది సత్యం.


‘‘మా ప్రభువు అల్లాహ్‌ అని నిశ్చయంగా ప్రకటించి, దానికి కట్టుబడి, స్థిరంగా ఉన్నవారికి ఏ భయమూ లేదు. వారు దుఃఖించడం జరగదు. అటువంటి వారే స్వర్గానికి వెళ్తారు. ప్రపంచంలో తాము చేసిన పనులకు ప్రతిఫలంగా స్వర్గంలోనే వారు శాశ్వతంగా ఉంటారు’’ అని దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ స్పష్టం చేశారు. 

- మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2020-10-09T07:51:19+05:30 IST