జీహెచ్‌ఎంసీలో ఇంజనీర్‌నని ఓ ప్రబుద్ధుడు...

ABN , First Publish Date - 2020-12-24T13:10:37+05:30 IST

జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయం వేదికగా ఓ ప్రబుద్ధుడు

జీహెచ్‌ఎంసీలో ఇంజనీర్‌నని ఓ ప్రబుద్ధుడు...

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయం వేదికగా ఓ ప్రబుద్ధుడు రూ.5.50 లక్షలు టోకరా వేశాడు. ‘‘నేను బల్దియాలో ఇంజనీర్‌ను. టాయిలెట్ల నిర్వహణ కాంట్రాక్టు నీకు వచ్చేలా చూస్తాను.’’ అని ఓ వ్యక్తి నమ్మబలికి నగదుతో ఉడాయించాడు. ఈ విషయంపై బాధితుడు సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మేసినేని నాగేశ్వరరావు అనే వ్యక్తికి పరిచయమైన ఒకరు తాను జీహెచ్‌ఎంసీలో ఇంజనీర్‌నని చెప్పాడు. ప్రధాన కార్యాలయంలోని మూడో అంతస్తులో తన ఛాంబర్‌ ఉంటుందని, టాయిలెట్ల నిర్వహణకు సంబంధించి టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటిస్తున్నామని, అది నాగేశ్వరరావుకు వచ్చేలా చూస్తానని నమ్మబలికాడు.


ఓ సారి ఆఫీ్‌సకు వచ్చి కలవాలని సూచించాడు. దీంతో నాగేశ్వర్‌రావు జీహెచ్‌ఎంసీ కార్యాలయం మూడో అంతస్తుకు వచ్చి ఇంజనీర్‌గా చెప్పుకున్న వ్యక్తికి ఫోన్‌ చేశాడు. తాను డిప్యూటీ మేయర్‌ చాంబర్‌ వద్ద ఉన్నానని, అక్కడకు రావాలని సూచించాడు. అక్కడ నుంచి ఇద్దరూ కలిసి హిమాయత్‌నగర్‌లోని మినర్వాకు వెళ్లి కాఫీ తాగారు. అనంతరం మెహిదీపట్నంలో నిర్మిస్తున్న టాయిలెట్లను నాగేశ్వర్‌రావుకు చూపించాడు. టెండర్‌ దక్కాలంటే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ పేరిట రూ.5.5 లక్షల డిమాండ్‌ డ్రాఫ్ట్‌ సమర్పించాలని చెప్పాడు. మధ్యాహ్నం 3.40 గంటల సమయంలో నాగేశ్వర్‌రావు తన సంస్థలోని ఉద్యోగితో నగదు పంపించాడు.


జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంలోని ఎస్‌బీఐలో డీడీ తీసేందుకు ఉద్యోగి వెళ్తుండగా.. మరో 20 నిమిషాలే సమయం ఉంది. వెంటనే డీడీ తీసుకోవాలి. నన్ను బ్యాంకు ఉద్యోగులు గుర్తుపడతారు. త్వరగా డీడీ తీస్తా. డబ్బులు ఇవ్వాలని మోసగాడు చెప్పాడు. నగదు తీసుకున్న అనంతరం అతను క్షణాల్లో మాయమయ్యాడు. మోసం గుర్తించిన నాగేశ్వర్‌రావు సైఫాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2020-12-24T13:10:37+05:30 IST