‘ఆంధ్రజ్యోతి’ నిఘా : మళ్లీ తెరపైకి నకిలీ వేలిముద్రల బాగోతం

ABN , First Publish Date - 2021-04-09T16:07:53+05:30 IST

ఈ విషయం ‘ఆంధ్రజ్యోతి’ దృష్టికి రావడంతో నిఘా పెట్టగా..

‘ఆంధ్రజ్యోతి’ నిఘా : మళ్లీ తెరపైకి నకిలీ వేలిముద్రల బాగోతం

  • కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ పారిశుధ్య విభాగంలో
  • అడ్డూ అదుపులేని ఎస్‌ఎఫ్‌ఏల అక్రమాలు
  • పట్టించుకోని అధికారులు

హైదరాబాద్/కుత్బుల్లాపూర్‌ : కుత్బుల్లాపూర్‌, గాజులరామారం జంట సర్కిళ్ల పారిశుధ్య విభాగంలో ఎస్‌ఎ్‌ఫఏల అక్రమార్జనకు, ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అధికారుల నిర్లక్ష్యం, అలసత్వంతో పారిశుధ్య కార్మికుల హాజరు నమోదు ప్రక్రియలో ఎస్‌ఎ‌ఫ్ఏలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఒక్కో ఎస్‌ఎ‌ఫ్ఏకి ఒక్కో గ్రూపులో ఏడుగురు కార్మికులు పని చేస్తారు. వీరు రోజూ ఉదయం విధులకు హాజరయ్యే సమయంలో, అనంతరం మధ్యాహ్నం విధుల నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు ఇలా రెండు దఫాలు బయోమెట్రిక్‌ యంత్రంలో ఎస్‌ఎఫ్‌ఏ హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. గతంలో హాజరును రిజిస్టర్‌ పుస్తకాల్లో నమోదు చేస్తుండడంతో ఎస్‌ఎప్‌ఏలు హాజరు వేసే విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణతో ఉన్నతాధికారులు బయోమెట్రిక్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. 


సాంకేతికతను అందిపుచ్చుకుని నకిలీ వేలి ముద్రలను (సింథటిక్‌ ఫింగర్‌ ప్రింట్స్‌) తెరపైకి తెచ్చారు. కార్మికుల నకిలీ వేలిముద్రలను తయారు చేయించి, విధులకు హాజరుకాని వారు హాజరైనట్టుగా బయోమెట్రిక్‌ యంత్రంలో నమోదు చేస్తున్నారు. ఇలా సిబ్బంది హాజరు కాని రోజుల్లో  కూడా హాజరు వేసుకొని నెలకు వచ్చే మొత్తాన్ని ఎస్‌ఎ‌ఫ్ఏలు కాజేస్తున్నారు. ఈ నకిలీ వేలి ముద్రల బాగోతం గతంలో  జీహెచ్‌ఎసీలోని పలు సర్కిళ్లలో సంచలనం సృషించడంతో పలువురిపై వేటు పడడంతోపాటు కేసులు నమోదై ఇంకా కొనసాగుతున్నాయి. అయినప్పటికీ కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ పరిధిలో ఓ ఎస్‌ఎ‌ఫ్ఏ అదే పంథాను కొనసాగిస్తుండడంతో ప్రస్తుతం మళ్లీ నకిలీ లీలలు బయటపడ్డాయి.


ఓ ఎస్‌ఎఫ్‌ఏ నకిలీ లీలలు

కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ పరిధిలోని గణే‌ష్‌నగర్‌, సూర్యానగర్‌, రాంరెడ్డినగర్‌ ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చూసుకొనే ఓ ఎస్‌ఎ‌ఫ్ఏ తన వద్ద పని చేసే 14 మంది (2 గ్రూపులకు గాను) పారిశుధ్య కార్మికుల్లో నలుగురితో పాటు అతని నకిలీ వేలిముద్రలను కూడా ఉపయోగిస్తున్నాడు. సదరు కార్మికులు విధులకు హాజరుకాకపోయినా, వారికి హాజరు మాత్రం వేస్తున్నట్లు తెలిసింది.


‘ఆంధ్రజ్యోతి’ నిఘాలో వెల్లడైన వాస్తవాలు..

సదరు ఎస్‌ఎ‌ఫ్ఏ వద్ద పని చేస్తున్న ఓ కార్మికురాలు ఇటీవల కాలు మడమ వద్ద ఎముక విరగడంతో నడవలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో గత నాలుగు రోజులుగా విధులకు హాజరు కావడం లేదు. కానీ, బయోమెట్రిక్‌ యంత్రంలో మాత్రం హాజరు నమోదవుతోంది. సదరు కార్మికురాలిని అడుగగా, తనకేమీ తెలియదని, తన కాలు బాగోలేక నాలుగు రోజులుగా విధులకు వెళ్లడం లేదని చెప్పింది. అలాగే ఓ కార్మికుడు  వారంలో నాలుగు రోజులు విధులకు హాజరు కాకపోయినా హాజరు నమోదైంది. ఇలా ఎవరు విధులకు హాజరుకాకపోయినా వారి హాజరు వేస్తున్నారు. ఈ విషయం ‘ఆంధ్రజ్యోతి’ దృష్టికి రావడంతో నిఘా పెట్టగా నకిలీ వేలిముద్రల వ్యవహరం బయటపడింది.

Updated Date - 2021-04-09T16:07:53+05:30 IST