Abn logo
Sep 22 2021 @ 23:38PM

పత్తి రైతులపై నకిలీ పిడుగు

నిండా ముంచిన సిక్సర్‌ పత్తి విత్తనాలు 

అదునుదాటి పోతున్నా.. కనిపించని కాత, పూత

జైనథ్‌, బేల మండలాల్లో వేల ఎకరాల్లో పంట నష్టం

కరువైన వ్యవసాయ శాఖాధికారుల పర్యవేక్షణ

ఆదిలాబాద్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లా పత్తి రైతులపై మళ్లీ నకిలీ విత్తన పిడుగు పడింది. ఏటా పత్తిని సాగు చేసే రైతులకు సహవాసం చేయాల్సి వస్తోంది. విత్తనం విత్తినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు రైతులను నకిలీ బెడద వెంటాడుతూనే ఉంది. ఖరీఫ్‌ ప్రారంభంలోనే నకిలీ విత్తనాలను కట్టడి చేయక పోవడంతో రైతులను నట్టేట ముం చు తున్నారు. గతేడు కింగ్‌ పత్తి విత్తనాలతో జిల్లా వ్యాప్తంగా 8,886 ఎకరాల్లో పంట దిగుబడులపై ప్రభా వం పడింది. దీంతో 3,250 మంది రైతులకు రూ.13 కోట్ల నష్టం జరిగింది. ఈ యేడు అవే పరిస్థితులు ఎదురుకావడంతో సుమారుగా 50వేల ఎకరాల్లో రైతు లు పత్తి పంటను నష్టపోయారు. ఈ యేడు సీజన్‌లో జిల్లాలో 5లక్షల 72వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేశారు. ఇందులో ప్రధానంగా 4లక్షల 34వేల ఎకరాల్లో పత్తి పంట సాగైనట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. ఏటా నకిలీ పత్తి విత్తనాలతో జిల్లా రైతులు నష్టపోతున్నా వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం అప్రమత్తమైనట్లు కనిపించడం లేదు. వ్యాపారులతో అధికారులు కుమ్మక్కు కావడంతోనే నకిలీ విత్తనాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

కఠినంగా వ్యవహరించక పోవడమే..

ఏటా జిల్లాలో నకిలీ విత్తనాల బాగోతం తరచూ వెలుగు చూస్తున్నా అధికారులు మాత్రం కఠినంగా వ్యవహరించినట్లు కనిపించడం లేదు. ప్రారంభంలోనే నకిలీ విత్తనాలను అరికట్టి ఉంటే ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యేవి కావన్న వాదనలు వినిపిస్తున్నాయి. నకిలీ విత్తనాలను విక్రయించిన వ్యాపారులపై పీడీయాక్టు కింద కేసులు నమోదు చేయకుండానే వదిలేయడంతో ఏటా నకిలీ విత్తనాలతో రైతులు నష్ట పోవాల్సి వస్తోంది. గతేడు కింగ్‌ పత్తి విత్తనాలతో నష్ట పోయిన రైతులే ఈ సారి గంగాకావేరి సిక్సర్‌ పత్తి విత్తనాలతో నష్ట పోయారు. ఈ విత్తనాలతో సాగు చేసిన పత్తి పంట ఏపుగా పెరిగి కనిపిస్తున్న కాతాపూత లేక పోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. మరో పక్షం రోజుల్లో పంట చేతికిరావాల్సి ఉండగా కాతాపూతా రావడం లేదని పత్తి రైతులు గుండెలు బాధుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 20 వేల సిక్సర్‌ పత్తి విత్తనాలను విక్రయించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. నకిలీ విత్తనాలను విక్రయించిన వారిలో బడా వ్యాపారులు ఉండడంతోనే చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనకాడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

రెండు మండలాల్లోనే భారీ నష్టం..

ఏటా జైనథ్‌, బేల మండలాల్లోనే పత్తి రైతులు నకిలీ విత్తనాలతో నష్ట పోవాల్సి వస్తోంది. ఈ రెండు మండలాల్లోనే భారీ నష్టం వాటిల్లింది. గంగా కావేరి సిక్సర్‌ పత్తి విత్తనాలతో జిల్లా వ్యాప్తంగా 50వేల ఎక రాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో 20వేలకు పైగా ఎకరాలలో జైనథ్‌, బేల మండలాల్లోనే నష్టం వాటిల్లింది. జిల్లాలో అతిపెద్ద మండలంగా గుర్తింపు పొందిన జైనథ్‌లో ఎక్కువగా పత్తి పంటను సాగు చేస్తున్నారు.

ఎమ్మెల్యే హెచ్చరించినా..

ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న వ్యవసాయ శాఖ అధికారులను హెచ్చరించినా అధికారుల పని తీరులో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఇటీవల వ్యవసాయ శాఖ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేక పోవడంతోనే రైతులు నష్టపోతున్నారు. సరైన సమయంలో సలహాలు, సూచనలు ఇస్తే నాణ్యమైన పత్తివిత్తనాలను విత్తుకునే అవకాశం ఉండేది. వ్యాపారులు చెప్పిన విధంగానే రైతులు 

పంటలను సాగు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జైనథ్‌, బేల మండలాల్లో పని చేసే ఏడీఏ పుల్లయ్యకు అదనంగా మార్క్‌ఫెడ్‌ బాధ్యతలు అప్పగించడంతో ఈ రెండు మండలాల వైపు కన్నెత్తి చూడడం లేదు. కనీసం ఫోన్‌లోనైనా తమ సమస్యలు చెప్పుకోవాలన్న అందుబాటులో ఉండడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.