నకిలీ మాఫియా!

ABN , First Publish Date - 2021-06-23T06:05:08+05:30 IST

జిల్లాలో నకిలీ విత్తనాల మాఫియా పేట్రేగిపోతోంది.

నకిలీ మాఫియా!

  1. పత్తి రైతులే వారి టార్గెట్‌
  2. దళారుల ద్వారా విత్తనాల అమ్మకం
  3. పోలీసు, విజిలెన్స్‌ దాడుల్లో బహిర్గతం
  4. వ్యవసాయశాఖ తీరుపై తీవ్ర విమర్శలు


కర్నూలు(అగ్రికల్చర్‌), జూన్‌ 22: జిల్లాలో నకిలీ విత్తనాల మాఫియా పేట్రేగిపోతోంది. మూడు రోజుల క్రితం ఆదోని ప్రాంతంలో బయటపడిన వివిధ కంపెనీల లేబుళ్లు మాఫియా ఏ స్థాయిలో విస్తరించిందో చెప్పకనే చెబుతున్నాయి. హైదరాబాద్‌ కేంద్రంగా బొగూడ సురేష్‌ అనే వ్యక్తి వివిధ కంపెనీల ప్యాకింగ్‌ కవర్లను తయారు చేసి, నకిలీ విత్తన మాఫియాను నడిపించిన తీరు విస్తుగొలుపుతోంది. ఈ వ్యక్తి 22 ఏళ్లపాటు ప్రింటింగ్‌ అండ్‌ ప్యాకింగ్‌ కంపెనీల్లో సూపర్‌వైజర్‌గా పని చేశాడు. ఆ అనుభవంతో కపిలేశ్వర్‌ రొటో ప్యాకేజింగ్‌ ప్రైవైట్‌ లిమిటెడ్‌ పేరిట కంపెనీని ఏర్పాటు చేశాడు. ప్రధాన బ్రాండ్ల కవర్లు తయారు చేసేందుకు అనుమతులు తీసుకున్నాడు. ఇదే అదనుగా నకిలీ వ్యాపారానికి తెరతీశాడు. జిల్లాలో కొందరు ఆర్గనైజర్లను కూడదీసుకుని, వారి ద్వారా నాణ్యత లేని పత్తి విత్తనాలను తాను తయారు చేసిన బ్రాండెడ్‌ కంపెనీల ప్యాకెట్లలో నింపి జిల్లాతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో రైతులకు అంటగట్టాడు. పోలీసులు ఆదోనిలో తీగ లాగితే హైదరాబాద్‌లో డొంక కదిలింది. ఈ నెల 12న ఆదోని తాలుకా పోలీసులు తనిఖీలు చేస్తుండగా నకిలీ పత్తి విత్తనాలతో బైక్‌ మీద వెళ్తూ ఇద్దరు వ్యక్తులు దొరికారు. వారిని ఆరా తీస్తే హైదరాబాద్‌కు చెందిన బోగూడ సురేష్‌ వ్యవహారం బయటపడింది. పోలీసులు హైదరాబాద్‌కు వెళ్లి తనిఖీలుచేసి 683 సిలిండర్లు, తయారీ యంత్రాలు, ముడిసరుకు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2 కోట్లు ఉంటుందని అంచనా. 


నీరుగారుతున్న కేసులు


జిల్లాలో గడిచిన మూడేళ్లలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 36 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఒకరిద్దరు మినహా మిగిలిన నిందితులంతా కేసులనుంచి తప్పించుకున్నారు. చీటింగ్‌ కేసులు నమోదవుతున్నా, కేసు నమోదులో లోపాల కారణంగా విత్తన మాఫియా సులువుగా బయట పడుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. గత సంవత్సరం వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తూ పట్టుబడిన ఎం.రత్నాకర్‌రావుపై పోలీసులు పీడీ యాక్టును ప్రయోగించారు. మిగిలిన వారిపైనా ఇలాగే కఠినంగా వ్యవహరిస్తే నకిలీలకు అడ్డుకట్ట పడుతుందని రైతులు అంటున్నారు. 


నకిలీ విత్తనాలపై నమోదైన కొన్ని కేసుల వివరాలు

2019లో పాణ్యం మండలం బలపనూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతని వద్ద రూ.15 లక్షల విలువైన విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే సంవత్సరం కోసిగి మండలం పల్లెపాడుకు చెందిన ఓ వ్యక్తి వద్ద రూ.5.5 లక్షల విలువైన 9 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదే మండలానికి చెందిన ఓ మహిళను అరెస్టు చేసి రూ.4.98 లక్షల పత్తి విత్తనాలను సీజ్‌ చేశారు. 


ఎమ్మిగనూరు మండలం దైవందిన్నెకు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి 17 కిలోల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.


2019లో డోన్‌ మండలంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ఓ సీడ్స్‌ ఏజెన్సీపై దాడులు నిర్వహించి రూ.6.95 లక్షల కందులు, రూ.2.8 లక్షల ఆముదం విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. 


ఓర్వకల్లు మండలం శకునాలకు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి.. అతని నుంచి లూజు పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. 


వెల్దుర్తి మండలంలో ఓ వ్యక్తి నుంచి రూ.10.50 లక్షల విలువైన 3.6 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యక్తి వద్దే 2020లో రూ.2.98 లక్షలు విలువైన 53 కిలోల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని పీడీ యాక్టు నమోదు చేశారు. 


నంద్యాలకు చెందిన ముగ్గురుని అరెస్టు చేసి రూ.3.96 లక్షల నకిలీ పత్తి విత్తనాలను విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 


సంజామల మండలం ముక్కమల్ల గ్రామంలో 5.6 లక్షల విలువైన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదే మండలం పేరుసోముల గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి 29 క్వింటాళ్ల నకిలీ కంది విత్తనాలను పట్టుకున్నారు. ఇదే మండలంలో ఓ వ్యక్తి నుంచి 7.5 క్వింటాళ్ల కంది విత్తనాలను సీజ్‌ చేశారు. 


2020లో ఎమ్మిగనూరు మండలంలోని ఓ జిన్నింగ్‌ మిల్లుపై దాడి చేసి 144 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.70 లక్షలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 


కల్లూరు మండల పరిధిలో ఓ ఆగ్రో ఏజెన్సీపై పోలీసులు దాడులు చేసి 37.8 క్వింటాళ్ల నాసిరకం పత్తి విత్తనాలు, 155.5 క్వింటాళ్ల నాసిరకం మొక్కజొన్న, 302 క్వింటాళ్ల నాసిరకం వరి విత్తనాలు విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.30 లక్షలు ఉంటుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. 


మంత్రాలయం మండలం వగటూరుకు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి అతని నుంచి రూ.65.12 లక్షల విలువైన నాసిరకం పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. 


కల్లూరు మండల పరిధిలో ఓ కోల్డ్‌ స్టోరేజీపై పోలీసులు దాడులు చేసి రూ.36 లక్షల విలువ చేసే 62.46 క్వింటాళ్ల నాసిరకం పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. 


ఇటీవల ఆదోని మండలం పెసరబండకు చెందిన ఓ వ్యక్తి, సి.బెళగల్‌ మండలం యనగండ్లకు చెందిన ఓ వ్యక్తి, చిన్న పెండేకల్‌ గ్రామానికి చెందిన ఇద్దరి నుంచి నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. 


వ్యవసాయశాఖ నిర్లక్ష్యం


విత్తన మాఫియాను అరికట్టాల్సిన వ్యవసాయ శాఖ యంత్రాంగం ఆ దిశగా శ్రద్ధ పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కొందరు అధికారులు అడపా దడపా తనిఖీలు నిర్వహించడం, ఆ కంపెనీల ప్రతినిధులు ఇచ్చే మొత్తాన్ని జేబులో వేసుకుని వెనుదిరగడం పరిపాటిగా మారిందని రైతులు ఆరోపిస్తున్నారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌పోర్స్‌మెంట్‌ అధికారుల దాడులలో నకిలీ విత్తనాలు పట్టుబడుతున్నాయి. కానీ గ్రామస్థాయి నుంచి సిబ్బంది ఉన్న వ్యవసాయశాఖ యంత్రాంగం మాత్రం నకిలీను గుర్తించడం లేదు. కల్లూరు పారిశ్రామికవాడ, బళ్లారి చౌరస్తా ప్రాంతం, సమీప గ్రామాల్లోని గోదాములు, శిథిలావస్థకు చేరిన భవనాలను విత్తన మాఫియా అద్దెకు తీసుకుంటోంది. ఇక్కడి నుంచే నకిలీ విత్తనాల దందాను సాగిస్తోందని సమాచారం. ఈ విత్తనాలను దళారుల ద్వారా గ్రామాలకు తీసుకెళ్లి రైతులకు అంటగడుతున్నారు. విషయం తెలిసినా వ్యవసాయ శాఖ యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. 


విజిలెన్స్‌ దాడుల్లోనే..


జిల్లాలో గత ఐదేళ్లుగా పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అదే స్థాయిలో నకిలీ విత్తనాల దందా విస్తరిస్తోంది. వీటిని వినియోగించిన రైతులు దిగుబడి తగ్గిపోయి తీవ్రంగా నష్టపోతున్నా, వ్యవసాయ శాఖ యంత్రాం గానికి చీమ కుట్టినట్లు కూడా లేదని బాధితులు మండి పడుతున్నారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నకిలీ విత్తనాలను గుర్తిస్తున్నా, దీని వెనుక ఉన్నవారికి శిక్ష పడాలంటే వ్యవసాయశాఖ అధికారులు పూర్తి స్థాయిలో ఆధారాలు సంపాదించి కోర్టులకు సమర్పిం చాల్సి ఉంటుంది. కానీ సహకరించడం లేదన్న ఆరోప ణలు ఉన్నాయి. దీంతో నిందితులపై నమోద వుతు న్న కేసులు పెద్దగా ప్రభావం చూపడం లేదు. రోజు ల వ్యవధిలో జైలు నుంచి బయటకు వసు ్తన్నారు. మళ్లీ నకిలీ విత్తనాల వ్యాపారం కొనసాగిస్తున్నారు.



చర్యలు శూన్యం


జిల్లాలో ఏటా ఖరీఫ్‌, రబీ సీజన్లలో నకిలీ, నాసిరకం విత్తనాల దందా కొనసాగుతోంది. వీటి బారిన పడి రైతులు నష్టపోతున్నారు. ఎన్నోసార్లు రైతులను సమీకరించి ఆందోళన చేశాము. రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లాము. వ్యవసాయ శాఖ అధికారులు సవాల్‌గా తీసుకోవడం లేదు. నామ మాత్రపు తనిఖీలకు పరిమితమవుతున్నారు. విత్తన వ్యాపారులకు దళారులతో సంబంధాలు ఉండడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకు అధికారులు, సిబ్బంది ఉన్న వ్యవసాయశాఖ నకిలీలను అరికట్టలేని దుస్థితిలో ఉంది. 

- రామకృష్ణ, రైతు సంఘం కార్యదర్శి


తనిఖీ బృందాలు ఏర్పాటు చేశాం


జిల్లాలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు, పోలీసుల సహకారంతో నకిలీ, నాసిరకం విత్తనాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కర్నూలు, ఆదోని, నంద్యాల డివిజన్లలో తనిఖీ బృందాలను ఏర్పాటు చేశాము. లైసెన్సు ఉన్న డీలర్ల వద్దే విత్తనాలను కొనుగోలు చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నాము. ప్రభుత్వ ఆదేశాల మేరకు పేరున్న కంపెనీల విత్తనాలను రైతుభరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నాము. లూజు విత్తనాలను కొనుగోలు చేయకూడదని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాము.

- ఉమామహేశ్వరమ్మ, జేడీఏ

Updated Date - 2021-06-23T06:05:08+05:30 IST