తవ్వినకొద్దీ ‘నకిలీ’ విత్తనాలు

ABN , First Publish Date - 2021-06-24T05:09:40+05:30 IST

పత్తి రైతులను ‘నకిలీ’ భూతం వెంటాడుతూనే ఉంది. ఈ ఏడాది కూడా అధికారుల అంచనాలకు మించి స్మగ్లర్లు భారీ ఎత్తున గ్లైసిల్‌ విత్తనాలను జిల్లాలో డంప్‌ చేసి రహస్య ప్రాంతాల్లో నిల్వ చేసుకున్నారన్న విషయం తరచుగా వెలుగులోకి వస్తోంది.

తవ్వినకొద్దీ ‘నకిలీ’ విత్తనాలు

- వరుస ఘటనలతో మరింత కూపీ లాగుతున్న పోలీసులు

- రూటు మార్చిన స్మగ్లర్లు 

- సరిహద్దులపైన పటిష్ట నిఘా

- పోలీసులకు దొరకకుండా చేలల్లోనే నిలువలు

- ఈ ఏడాది దాడుల్లో 69క్వింటాళ్ల విత్తనాలు స్వాధీనం

- 44మందిపై కేసులు నమోదు

(ఆంధ్రజ్యోతి, అసిఫాబాద్‌)

పత్తి రైతులను ‘నకిలీ’ భూతం వెంటాడుతూనే ఉంది. ఈ ఏడాది కూడా అధికారుల అంచనాలకు మించి స్మగ్లర్లు భారీ ఎత్తున గ్లైసిల్‌ విత్తనాలను జిల్లాలో డంప్‌ చేసి రహస్య ప్రాంతాల్లో నిల్వ చేసుకున్నారన్న విషయం తరచుగా వెలుగులోకి వస్తోంది. అసిఫాబాద్‌ జిల్లాలో 80-85శాతం విస్తీర్ణంలో పత్తి పంటను సాగు చేస్తున్నారు. ఈ ధరిమిలా నకిలీ వ్యాపారులు బీటీ-3 పేరిట ప్రభుత్వ ఆమోదం లేని గైసిల్‌ విత్తనాలను రైతులకు అంట గడుతూ వస్తున్నారు. ఈ తతంగం గడిచిన నాలుగేళ్లుగా సాగుతోంది. మరీ ముఖ్యంగా 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో ఈ చీకటి దందా బాగా పుంజుకున్నట్లు విజిలెన్స్‌ బృందాలు పసిగట్టాయి. దీంతో గతేడాది నుంచి బీటీ-3 పేరిట విత్తనాలను అక్రమంగా సరఫరా చేస్తున్న వ్యాపారుల నెట్‌వర్క్‌పై పోలీసులు దృష్టి సారించారు. స్మగ్లింగ్‌ రాకెట్లకు ఎక్కడికక్కడ చెక్‌ పెడుతూ వస్తున్నారు. అయినప్పటికినీ పోలీసులు, విజిలెన్స్‌ కన్నుగప్పి మరీ ఈ చీకటి దందా దర్జాగా సాగిస్తున్న పరిస్థితి కొనసాగుతోంది. ముఖ్యంగా సిర్పూర్‌ నియోజకవర్గంలోని చింతలమానేపల్లి, కౌటాల, సిర్పూర్‌(టి), బెజ్జూరు, పెంచికల్‌పేట, దహెగాం మండలాల్లో ఈ నకిలీ విత్తనాల విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు గుర్తిస్తున్నారు. అధికారుల అంచనాల ప్రకారం ప్రతీ ఏట ఆసిఫాబాద్‌ జిల్లాకు 180నుంచి 200క్వింటాళ్ల మేర నకిలీ విత్తనాలని రైతులకు అంటగడుతున్నారని చెబుతున్నారు. ఈ ముఠాలు ప్రధానంగా గుంటూరు, కర్నూలు, తెలంగాణలోని గద్వాల, సూర్యాపేట జిల్లాలు కేంద్రంగా విత్తనాలను రహస్య మార్గాల ద్వారా జిల్లాలోకి దిగుమతి చేస్తున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఈ నకిలీ విత్తనాలకు సంబంధించి ఉత్పత్తి చేస్తున్నవారి గుట్టు మట్లు అన్నీ అధికార యంత్రాంగానికి తెలిసినా ఆదిలోనే అడ్డుకట్ట వేయ్యాల్సింది పోయి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. వానాకాలం పనులు ప్రారంభం కాగానే హడావుడిగా దాడులు జరపడం వల్ల అసలు నిందితులు తప్పించుకొని స్థానికంగా విక్రయించే చిన్న చేపలు మాత్రమే చిక్కుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి వానాకాలం సీజన్‌ ప్రారంభానికి మూడు నెలల ముందునుంచే నకిలీ విత్తనాలు రైతుల చెంతకు చేరుతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన దళారులు 3వ కంటికి చిక్కకుండా అత్యంత పకడ్బబందీగా విత్తనాలను ఉత్పత్తిదారుల నుంచి కొనుగోళు చేసి రవాణా చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు, ఇళ్లలో విత్తనాలను దాచి ఉంచడం వల్ల దాడుల్లో పట్టుబడే అవకాశాలను పసిగట్టి ముందుగానే అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న రైతుల వ్యవసాయ క్షేత్రాలు, పశువుల కొట్టాల్లో నిల్వ ఉంచుతున్నట్లు చెబుతున్నారు. మరికొన్ని చోట్ల ఏకంగా భూమిలోనే పాతి పెట్టి అవసరాన్ని బట్టి విత్తనాలను కిలోల చొప్పున రైతులకు చేర వేస్తున్నట్లు ఇటీవల కనుగొన్నారు. తాజాగా పెంచికల్‌పేట మండలంలో ఇదే తరహాలో దాచిన దాదాపు 90కిలోల విత్తనాలు పోలీసులు పట్టుబడటం ఈ సందర్భంగా ఎంతైనా ప్రస్తావనార్హం. 

రూటు మార్చిన స్మగ్లర్లు..

జిల్లాలో రైతాంగానికి బెడదగా తయారైన నకిలీ విత్తనాల విక్రయాలపై పోలీస్‌ యంత్రాంగం, అటు వ్యవసాయశాఖ ఉక్కుపాదం మోపుతోంది. దీంతో విత్తన స్మగ్లర్లు రూటు మార్చి విక్రయాలు సాగిస్తున్నారు. గడచిన నెల రోజుల వ్యవధిలో 10-15చోట్ల పోలీసులు దాడులు జరపడంతో భారీ పరిమాణంలో నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. ముఖ్యంగా సూర్యాపేటకు చెందిన ఓ నకిలీ విత్తన వ్యాపారి తతంగం వెలుగులోకి రావడంతో పోలీసుశాఖ ఈ మొత్తం నెట్‌వర్కును చేదించేందుకు ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేసింది. టాస్క్‌ఫోర్స్‌ కూపీ లాగడంతో ఈ ముఠా చీకటి దందా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆసిఫాబాద్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌ జిల్లాలతో పాటు రాష్ట్ర సరిహద్దుకు అవతలి పక్కన ఉన్న మహారాష్ట్రలోని చంద్రాపూర్‌, గడ్చిరోలి జిల్లాల్లో కూడా విత్తనదందా పెద్ద ఎత్తున సాగిస్తున్నట్లు గుర్తించారు. టాస్క్‌ఫోర్స్‌ విచారణలో బయటపడిన సమాచారం ఆధారంగా జిల్లా పోలీసులు దాడులు ముమ్మరం చేయడంతో నకిలీ విత్తన ముఠాలు రూటు మార్చాయి. విత్తనాలను మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాలను స్థావరాలుగా మార్చుకొని రైతుల వారిగా డిమాండ్‌ను బట్టి చిన్న పరిమానాల్లో సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై కూడా పోలీసులకు స్పష్టమైన సమాచారం ఉండటంతో ఇటీవల మహారాష్ట్ర వైపునుంచి విత్తనాలను తెస్తున్న ముఠాసభ్యులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. 

69క్వింటాళ్ల విత్తనాలు స్వాధీనం, 44మందిపైన కేసులు..

ఆసిఫాబాద్‌ జిల్లాలో పెద్దఎత్తున అక్రమంగా విక్రయిస్తున్న నకిలీ పత్తి విత్తనాల వ్యవహారంలో పోలీస్‌ యంత్రాంగం ఈ ఏడాది గట్టి చర్యలే చేపట్టింది. ఫలితంగా గతంతో పోలిస్తే ఈ సారి నకిలీల బెడద సగానికి సగం తగ్గినట్టేనన్న అభిప్రాయాలు వ్యక్రమవుతున్నాయి. జిల్లా పోలీస్‌ యంత్రాంగం ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు నకిలీ విత్తన రాకెట్‌పై జరిపిన దాడుల్లో మొత్తం 69 క్వింటాళ్ల 5కిలోల నకిలీ పత్తి విత్తనాలు(గ్లైసిల్‌) పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో నిందితులుగా గుర్తించిన 44మందిపై కేసులు నమొదు చేయగా తరుచూ ఇదే పనిచేస్తున్న సాంబశివరావు అనే నిందితుడిపై పీడీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. మార్కెట్‌ విలువ ప్రకారం గ్లైసిల్‌ విత్తనాలు కిలోకు రూ.2వేలు చొప్పున విక్రయిస్తున్నారు. ఈ లెక్కన పట్టుబడిన విత్తనాల విలువ 1.38 కోట్లు ఉంటోంది. పోలీస్‌ అంచనాల ప్రకారం వీటివిలువ 1కోటి 31లక్షల 56వేలుగా నిర్ధారించారు.

Updated Date - 2021-06-24T05:09:40+05:30 IST