ఎల్లలు దాటిన సంగీత ఝరి!

ABN , First Publish Date - 2022-01-23T05:30:00+05:30 IST

జైపూర్‌ ఘరానాల నుంచి వెస్ట్రన్‌ మ్యూజిక్‌ వరకూ... సంగీత రీతి ఏదైనా శ్రోతల్ని ఆకట్టుకొనే నైపుణ్యం ఉన్న గాయని, స్వరకర్త ఫల్గుణి షా.

ఎల్లలు దాటిన సంగీత ఝరి!

జైపూర్‌ ఘరానాల నుంచి వెస్ట్రన్‌ మ్యూజిక్‌ వరకూ... సంగీత రీతి ఏదైనా శ్రోతల్ని ఆకట్టుకొనే నైపుణ్యం ఉన్న గాయని, స్వరకర్త ఫల్గుణి షా. ‘గ్రామీ- బెస్ట్‌ చిల్డ్రన్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌’ పురస్కారాలకు రెండోసారి ఆమె ఇటీవల నామినేట్‌ అయ్యారు. ఆ ఘనత సాధించిన 


తొలి భారతీయురాలుగా నిలిచారు.

‘‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా ‘‘నీ హృదయం చెప్పిన దాన్ని అనుసరించు. నీ సృజనాత్మకతను నియంత్రించుకోకు. పరాజయాలు ఎదురయ్యాయని పారిపోకు...’’-  నా గురువులు చెప్పిన గొప్ప మాటలివి. అవి నాలో బలంగా నాటుకుపోయాయి. అందుకే రిస్క్‌ తీసుకోడానికి వెనుకాడను. ఎంత కష్టమైనదైనా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను’’ అని చెబుతారు ఫల్గుణి షా. ముంబయిలో పుట్టి... హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన ఆమె పాశ్చాత్య సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేయడం వెనుక కఠోర సాధనతో పాటు గట్టి పట్టుదల కూడా ఉంది. 


వారి నుంచి తప్పించుకోడానికి...

‘ఫలు’గా అభిమానులు పిలుచుకొనే ఫల్గుణి చిన్నప్పటి నుంచీ సంగీత వాతావరణంలోనే పెరిగారు. ఆమె తల్లి కిశోరి దలాల్‌ ఆలిండియా రేడియోలో మ్యుజీషియన్‌. ఇంట్లో అమ్మ పాడే పాటలు విని సంగీతంతో ప్రేమలో పడిపోయానంటారు ఫల్గుణి. ఆమె ఆసక్తిని గమనించిన తల్లి.... గుజరాతీ జానపద సంగీతంలో, గజల్స్‌లో శిక్షణ ఇప్పించారు. ఆ తరువాత సుప్రసిద్ధ సారంగి వాద్య నిపుణుడు సుల్తాన్‌ ఖాన్‌ దగ్గర,  విఖ్యాత గాయని కిశోరి అమోన్కర్‌ దగ్గర హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని ఫల్గుణి నేర్చుకున్నారు. జైపూర్‌ ఘరానా గాన సంప్రదాయంలో నిష్ణాతురాలయ్యారు. ‘‘రోజుకు పదహారు గంటలు సాధన చేసేదాన్ని. అయితే ఇదంతా నా తోటి పిల్లల నుంచి తప్పించుకోవడానికే. నేను కొంచెం నల్లగా ఉంటాను. నన్ను వాళ్ళు ఆట పట్టించేవారు. సంగీత సాధన పూర్తి ఏకాంతంలో చేయాల్సింది కాబట్టి, ఎక్కువసేపు అందులోనే గడిపేదాన్ని’’ అని చెబుతారు ఫల్గుణి. చదువు పూర్తయ్యాక, గౌరవ్‌ షాతో ఆమెకు వివాహం జరిగింది. గౌరవ్‌ ఉద్యోగ రీత్యా వారు అమెరికాలో స్థిరపడ్డారు. అతను కూడా గాయకుడే. అయితే, సాంస్కృతికమైన వైరుధ్యాల కారణంగా అమెరికా వాతావరణంలో ఇమడడానికి ఫల్గుణి ఇబ్బంది పడ్డారు. తనదైన సంగీత ప్రపంచాన్ని సృష్టించుకోవాలన్న ఆలోచనతో... ఒక ఇండో-అమెరికన్‌ సంగీత బృందంలో చేరారు.


అనంతరం ‘ఫలు’ పేరుతో సొంత మ్యూజిక్‌ బ్యాండ్‌ ఏర్పాటు చేసుకున్నారు. ‘ఫలు’, ‘ఫోరస్‌ రోడ్‌’ అనే ఆల్బమ్‌లు చేశారు. రెండో ఆల్బమ్‌ గ్రామీ అవార్డుల తొలి జాబితాకు ఎంపికైనా, ప్రధాన నామినేషన్లకు నోచుకోలేదు. కానీ ఫల్గుణి సంగీత ప్రియుల దృష్టిలో పడ్డారు. ఆ తరువాత ఎ.ఆర్‌.రహమాన్‌, ఫిలిప్‌ గ్లాస్‌, వైక్లెఫ్‌ జెన్‌, ఉస్తాద్‌ సుల్తాన్‌ ఖాన్‌, రికీ మార్టిన్‌ యో-యో మా లాంటి సుప్రసిద్ధ సంగీత కళాకారులతో కలిసి పని చేశారు. 2015లో ‘ఎకనామిక్స్‌ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా- 20 మంది అత్యంత ప్రభావశీలులైన గ్లోబల్‌ ఇండియన్‌ ఉమెన్‌’ జాబితాలో ఆమె పేరు చోటు చేసుకుంది. ‘ఉమెన్‌ ఐకాన్‌ ఆఫ్‌ ఇండియా’ పురస్కారం కూడా ఆమె అందుకున్నారు.


సంగీతం కేవలం వినోదానికే కాదు...

2018లో హిందీ, గుజరాతీ, ఇంగ్లీష్‌ భాషల్లో... పిల్లల కోసం ఆమె తయారుచేసిన ‘ఫాలూ బజార్‌’ మ్యూజిక్‌ ఆల్బమ్‌కు విశేష ఆదరణ లభించింది. అది 2019లో ‘గ్రామీ- బెస్ట్‌ చిల్డ్రన్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌’ కేటగిరీకి అది నామినేట్‌ అయింది. ఆ తరువాత ఆమె రూపొందించిన ‘ఎ కలర్‌ఫుల్‌ వరల్డ్‌’ కూడా అదే కేటగిరీలో ఇటీవల నామినేషన్‌ దక్కించుకుంది. ఇలా రెండుసార్లు ఈ నామినేషన్‌ను ఒక భారతీయ మహిళ పొందడం ఇదే మొదటిసారి. త్వరలో జరగబోయే గ్రామీ పురస్కార ప్రదానోత్సవంలో... తనకు అవార్డు లభిస్తుందని ఫల్గుణి ఆశిస్తున్నారు. ‘‘జాతులు, నేపథ్యాలు, ప్రాంతాలకు అతీతంగా... పిల్లలంందరినీ దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఆల్బమ్‌ ఇది. కొవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని కమ్ముకున్న నేపథ్యంలో... పిల్లలు చాలా పరిమితులకు లోబడాల్సి వస్తోంది. వారిలో ఉత్సాహం నింపి, సానుకూల వైఖరిని, సమ్మిళితత్వ దృక్పథాన్ని కలిగించడం నా ఆల్బమ్‌ ప్రధాన ఉద్దేశం’’ అంటున్న ఫల్గుణి గత రెండేళ్ళుగా భారతదేశానికి రావాలనే కోరికను కరోనా వ్యాప్తి వల్ల వాయిదా వేసుకుంటున్నారు. సూరత్‌లో ఉన్న తన కుటుంబాన్ని వీడియో కాల్స్‌ ద్వారా పలకరిస్తున్నారు.


‘‘గుజరాతీ భాషలో పాటలు పాడాలన్నది నా కోరిక. ఒక గాయనిగా, నా పాటలను ఎక్కువమంది వినాలనీ, వారి హృదయాలను స్పృశించాలనీ నేను కోరుకుంటాను. దానికోసం నా ప్రతిభను అత్యుత్తమంగా ప్రదర్శించడానికి ప్రయత్నిస్తాను. కొవిడ్‌ కాలంలో మరింత సంగీతాన్ని సృష్టించడం ఎంతో అవసరం. ఎందుకంటే సంగీతం కేవలం వినోద సాధనం కాదు, దానికి స్వస్థత కలిగించే శక్తి ఉంది ’’అని చెబుతున్నారు ఫల్గుణి.


తనదైన సంగీత ప్రపంచాన్ని సృష్టించుకోవాలన్న ఆలోచనతో... ఒక ఇండో-అమెరికన్‌ సంగీత బృందంలో చేరారు. అనంతరం ‘ఫలు’ పేరుతో సొంత మ్యూజిక్‌ బ్యాండ్‌ ఏర్పాటు చేసుకున్నారు. ‘ఫలు’, ‘ఫోరస్‌ రోడ్‌’ అనే ఆల్బమ్‌లు చేశారు

Updated Date - 2022-01-23T05:30:00+05:30 IST