రాలిన ఆకులు

ABN , First Publish Date - 2021-06-14T06:55:48+05:30 IST

ఊపిరందని ఆకులన్నీ రాలిపోతాయి చూస్తూండగానే బూడిద కుప్పలవుతాయి అనుబంధాలు చిట్లిపోయి...

రాలిన ఆకులు

ఊపిరందని ఆకులన్నీ 

రాలిపోతాయి

చూస్తూండగానే

బూడిద కుప్పలవుతాయి

అనుబంధాలు చిట్లిపోయి

నిశ్శబ్దంగా గోడలకు వేలాడతాయి

సాక్ష్యం చెప్పే కళ్ళు

రెప్పలకింద ఎన్నో ప్రశ్నల్ని దాచుకుంటాయి

ప్రశ్నలకు చావుండదు

అవి కళ్ళను మూతపడనివ్వవు

నిశ్శబ్దాలు ప్రశ్నల్ని ఎగదోస్తాయి

మౌనాలన్నీ ఒక చోట చేరి

ప్రశ్నల్ని ప్లకార్డుల్లా పట్టుకుంటాయి

ఊపిరిపోతున్న చిట్టచివరి క్షణాలు

ఒక నిలదీతను వదిలివెళ్తాయి

అచ్చం గత శిశిరంలో

పాదాలన్నీ రక్తంముద్దలై నిలదీసినట్టు

పోతున్న ప్రాణంమీద

ఎంత బెట్టింగ్‌ నడిచిందని అడుగుతాయి

అంబులెన్స్‌ ఓనర్లు, మందుల వ్యాపార్లు

తెల్లమాఫియా, నల్లరాబందూ, 

దాని పిల్లలూ...

మీమీ వాటాలు మీకు చేరాయా 

అని ఆరా తీస్తాయి

రాలిన ఆకులు రాలిపోగా

మిగిలిన చెట్టుకొమ్మలన్నీ

జీవితాంతం ఎంత తపించినా

చెట్టు మళ్లీ పచ్చగా చిగురించదు

అన్నీ దులుపేసుకుని వెళ్లిపోవడం

కండువాలకైతే అలవాటే కానీ 

ఎండుచెట్లన్నీ

ఏదో ఒక రోజు 

తప్పక ఒక దావానలాన్ని కంటాయి!

సాంబమూర్తి లండ

96427 32008

Updated Date - 2021-06-14T06:55:48+05:30 IST