Abn logo
Nov 28 2020 @ 03:14AM

హక్కులనేత వీఎస్‌ కృష్ణపై తప్పుడు కేసులు

ఎఫ్‌ఆర్‌ఐలను ఉపసంహరించుకోవాలని హక్కుల ఫోరమ్‌ డిమాండ్‌

హైదరాబాద్‌, నవంబరు 27: మానవ హక్కుల ఫోరమ్‌(హెచ్‌ఆర్‌ఎఫ్‌) నేత వీఎస్‌ కృష్ణతో పాటు పలువురు హక్కుల నేతలు, రచయితలు, దళిత సంఘాల కార్యకర్తలపై విశాఖ జిల్లా ముంచింగిపుట్టు, గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలిస్‌ స్టేషన్లలో పెట్టిన ఎఫ్‌ఐఆర్‌లు బూటకమని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ హెచ్‌ఆర్‌ఎఫ్‌ సమన్వయ కమిటీ ఆరోపించింది. ఈ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కమిటీ సభ్యులు ఎస్‌.జీవన్‌కుమార్‌, ఏ. చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. న్యాయం కోసం పోరాడుతున్న విశాఖ జిల్లా వాకపల్లి అత్యాచార బాధితులకు ఆహారం, ఆశ్రయం కల్పించడం చట్టపరంగా నేరంకాదన్నారు.


వాకపల్లి బాధితులకు మద్దతు ప్రకటిస్తున్నందువల్లే వీఎస్‌ కృష్ణను పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నియంత్రణ) చట్టాన్ని (ఉపా)కూడా ఆయనతోపాటు ఇతర హక్కుల నేతలపై ప్రయోగిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయ్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో.. తెలంగాణ రాష్ట్ర హెచ్‌ఆర్‌ఎఫ్‌ ఉపాధ్యక్షుడు ఆత్రం భూజన రావు, ఆదిలాబాద్‌ జిల్లా హెచ్‌ఆర్‌ఎఫ్‌ అధ్యక్షురాలు ఏ.సుగుణ, కొమ్రంభీమ్‌ జిల్లా అధ్యక్షుడు కనక వెంకటేశ్‌లపై ‘ఉపా’ను నమోదుచేశారని తెలిపారు. ఈ ముగ్గురూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారన్నారు. మానవ హక్కుల కోసం ఉద్యమించే లక్ష్యంతో ఏర్పాటైన హెచ్‌ఆర్‌ఎఫ్‌  ఏ రాజకీయపార్టీకి అనుబంధసంస్థకాదని నేడొక ప్రకటనలో వారు పేర్కొన్నారు. 


Advertisement
Advertisement
Advertisement