Abn logo
Sep 19 2021 @ 12:48PM

ప్రాణాలు తీసిన కుటుంబ కలహాలు..

            - బ్యాడరహళ్ళి ఆత్మహత్యల కేసులో కొత్త మలుపు 


బెంగళూరు: బెంగళూరు బ్యాడరహళ్లిలోని తిగళరపాళ్యలో జరిగిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్యల కేసు కొత్త మలుపు తిరిగింది. భార్య, ముగ్గురు పిల్లలు, మనవరాలు ఆత్మహత్యకు పాల్పడేలా తన భార్య ఉసిగొల్పిందని పాత్రికేయుడు శంకర్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ కుటుంబంలోని ఇద్దరు కుమార్తెల సంసారాలు సరిగా లేవని, పలుమార్లు హితవు పలికినా వారు అత్తింటికి వెళ్లకపోవడంతో కుటుంబంలో మనస్పర్థలు తలెత్తాయని 7పేజీల ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆరేళ్ల క్రితం శంకర్‌ పెద్ద కుమార్తె సించనకు ప్రవీణ్‌ అనే యువకుడితో వివాహమైంది. జక్కూరులో వీరి కుటుం బం ఉండేది. అత్తింటిలో సమస్యలు రావడంతో వేరుకాపురం పెట్టేంతవరకు రానంటూ సించన ఏడాదిన్నర క్రితం పుట్టింటికి చేరింది.


రెండో కుమార్తె సింధూరాణికి ఆంధ్రప్రదేశ్‌లోని గోరంట్ల నివాసి శ్రీకాంత్‌తో గత ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేశారు. వీరి కుటుం బంకాడుగూడిలో ఉంటోంది. వీరి పాపకు పేరు పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్న తరుణంలో చెవిపోగు కుట్టించే విషయమై గొడవ జరిగింది. ఈ ఘటన అనంతరం కొద్దిరోజులుగా అత్తింటికి వెళ్లకుండా రెండో కుమార్తె కూడా పుట్టింటిలో తిష్టవేసింది. తన భార్య భారతి కూడా కుమార్తెలకు నచ్చచెప్పి అత్తింటికి పంపకపోవడంతో గొడవలు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏకైక కుమారుడు మధుసాగర్‌ బీఏ పూర్తి చేసి బ్యాంకులో పనిచేస్తున్నాడని, ఇతను కూడా ఇద్దరు అక్కల వివాహజీవితం అతలాకుతలం కావడంతో బాధపడేవాడన్నారు.


ఇటీవల ఇంట్లో పెద్ద గొడవ జరిగిందని, తాను మనస్తాపానికి గురై ఇంటినుంచి బయటకు వెళ్లిన అనంతరం నలుగురూ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారుల్లో ఒక బాబు కూడా ఆత్మహత్యకు గురి కాగా మరో చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఈ చిన్నారి ఏకంగా మూడురోజులపాటు మృతదేహాల మధ్యే గడిపి సొమ్మసిల్లిపోవడంతో తక్షణం ఆసుపత్రికి తరలించారు. పాప కోలుకుంటోందని పోలీసులు తెలిపారు. 


క్రైమ్ మరిన్ని...