పుల్వామా దాడుల్లో చనిపోయిన జవాన్‌ భార్యకు అవమానం.. నా ఫోన్‌ కూడా ఎత్తడం లేదంటూ..

ABN , First Publish Date - 2021-08-11T03:17:38+05:30 IST

అతను దేశం కోసం ఉగ్రవాదులతో పోరాడి ప్రాణాలొడ్డిన యోధుడు. ఉగ్రవాదులతో పోరాటంలో అతను అశువులు బాసిన రోజు..

పుల్వామా దాడుల్లో చనిపోయిన జవాన్‌ భార్యకు అవమానం.. నా ఫోన్‌ కూడా ఎత్తడం లేదంటూ..

ఇంటర్నెట్ డెస్క్: అతను దేశం కోసం ఉగ్రవాదులతో పోరాడి ప్రాణాలొడ్డిన యోధుడు. ఉగ్రవాదులతో పోరాటంలో అతను అశువులు బాసిన రోజు.. ఆ మరణం తీరని లోటంటూ దేశం మొత్తం భోరుమంది. రాజకీయ నాయకులు ప్రసంగాలిచ్చారు. వారి కుటుంబానికి అండగా ఉన్నామంటూ ట్వీట్లు చేశారు. ఆ దుర్ఘటన జరిగి రెండేళ్లు దాటింది. కానీ ఇప్పటికీ ఆ కుటుంబానికి ఏమీ దక్కలేదు, కన్నీళ్లు తప్ప. ఇప్పుడు ఆ కుటుంబం రోడ్డెక్కింది. తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాంటూ ధర్నాకు దిగింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది. 2019లో జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి గుర్తుంది కదా. ఆ దాడిలో కౌశల్ కుమార్ అనే జవాను దుర్మరణం పాలయ్యాడు. ఆయన కుటుంబానికి భూమి ఇస్తామని, ఇల్లు కట్టిస్తామని అప్పట్లో ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది.


ఇప్పటికీ ఆ హామీల్లో ఒక్కటీ నెరవేరలేదని కౌశల్ భార్య మమతా రావత్ వాపోతోంది. భర్త పేరిట జమ చేసిన డబ్బు కూడా తమకు దక్కలేదని చెప్పింది. అలాగే ఆయుధ లైసెన్స్, భూమి ఏవీ ఇవ్వలేదు. ‘‘డిప్యూటీ మేజిస్ట్రేట్‌ను అడిగితే జూలై నాటికి అన్నీ ఇచ్చేస్తామని చెప్పారు. కానీ ఏ ఒక్కటీ దక్కలేదు. పైగా ఫోన్ చేస్తే అసలు ఎత్తడం లేదు. వేరే ఫోన్ల నుంచి చేస్తే గొంతు విని గుర్తుపట్టి కట్ చేసేస్తున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు’’ ఆమె కన్నీరు మున్నీరవుతోంది. రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి ఆగ్రా వచ్చారని, అప్పుడు ఆయన్ను కలవడానికి ఈ కుటుంబం వెళ్తే.. పోలీసులు అడ్డుకున్నారని స్థానిక రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ నేత జయంత్ చౌధరీ చెప్పారు. ఆ కుటుంబాన్ని పోలీసు స్టేషన్‌లో ఉంచి నేరస్థులతో ప్రవర్తించినట్లు ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. ఇలా ఆ కుటుంబాన్ని అవమానించడం దేశానికే తలవంపులు తెచ్చే చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో ఈ కుటుంబానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, లేకుంటా తమ పార్టీ ధర్నాకు దిగుతుందని హెచ్చరించారు.

Updated Date - 2021-08-11T03:17:38+05:30 IST