చావనివ్వండి.. లేకుంటే చంపేస్తారు!

ABN , First Publish Date - 2021-09-29T08:47:29+05:30 IST

అప్పుల బాధ తాళలేక ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన భోజనపల్లి సత్యశ్రీధర్‌, అతని భార్య విజయ గౌరి, కుమార్తె లక్ష్మీ ఆశాజ్యోతి ముగ్గురూ మంగళవారం..

చావనివ్వండి.. లేకుంటే చంపేస్తారు!

అప్పులవాళ్లకు భయపడి కుటుంబం ఆత్మహత్యాయత్నం

ఎలుకల మందు తాగి అపస్మారక స్థితికి.. 

తెనాలిలో విషాదం.. గుంటూరు ఆస్పత్రికి తరలింపు


తెనాలి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): అప్పుల బాధ తాళలేక ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన భోజనపల్లి సత్యశ్రీధర్‌, అతని భార్య విజయ గౌరి, కుమార్తె లక్ష్మీ ఆశాజ్యోతి ముగ్గురూ మంగళవారం ఎలుకల మందు తాగి.. ఓ చెట్టుకింద అపస్మారక స్థితిలో పడిపోయారు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది వారిని ఆస్పత్రికి తరలించింది. చికిత్స అందిస్తుండగా కోలుకుని.. ‘మమ్ముల్ని చావనివ్వండి. బతికినా అప్పులవాళ్లు వదిలిపెట్టరు. చంపేస్తార’ంటూ అతని భార్య కన్నీటి పర్యంతమవుతుంటే, శ్రీధర్‌ మాత్రం.. తమ కుమార్తెకు ఏ పాపమూ తెలియదని, వద్దన్నా ఆమె కూడా తమతోపాటే ఎలుకల మందు తాగేసిందని, ఆమెను మాత్రం బతికించి, తమను చంపేయాలంటూ వేడుకోవటం చూపరులనూ కంటతడి పెట్టించింది. స్థానికులు, బాధితుడు శ్రీధర్‌ కథనం ప్రకారం... శ్రీధర్‌ ఓ పార్సిల్‌ ఆఫీ్‌సలో కమిషన్‌ ఏజెంట్‌. ఇతడికి ఇద్దరు సంతానం. కుమారుడు ఉద్యోగ నిమిత్తం మచిలీపట్నంలో ఉంటున్నాడు. వీరు మాత్రం తెనాలిలోని బుర్రిపాలెం రోడ్డులో రుణంతో కొనుక్కున్న అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు.


రూ.30 లక్షల వరకు అప్పులున్నాయని, అవి చాలవన్నట్టు భార్యకు కరోనా వస్తే మరింత అప్పులపాలయ్యామని తెలిపారు. ప్రైవేటు బ్యాంక్‌ అప్పు తీర్చనందుకు వారు ఇంటికి తాళం వేస్తామన్నారని, మంగళవారం వరకు గడువిచ్చారని, అయితే డబ్బు దొరకలేదని, చేసేదిలేక చనిపోవాలని నిర్ణయించుకున్నామని వారు చెబుతున్నారు. కాగా, ప్రథమ చికిత్స అనంతరం వారిని గుంటూరు ఆస్పత్రికి తరలించారు. దీనిపై తెనాలి రూరల్‌ పోలీసులు కేసు నమోదుచేశారు. 

Updated Date - 2021-09-29T08:47:29+05:30 IST