ఎండ్లూరి అస్తమయం

ABN , First Publish Date - 2022-01-29T09:19:30+05:30 IST

ప్రముఖ కవి, దళిత సాహితీ రథసారథి ఆచార్య డాక్టర్‌ ఎండ్లూరి సుధాకర్‌ (63) కన్నుమూశారు. రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా..

ఎండ్లూరి అస్తమయం

హైదరాబాద్‌ సిటీ/ కవాడిగూడ, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ కవి, దళిత సాహితీ రథసారథి ఆచార్య  డాక్టర్‌ ఎండ్లూరి సుధాకర్‌ (63) కన్నుమూశారు. రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా సేవలందించిన సుధాకర్‌ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు కుమార్తెలు మనోజ్ఞ, మానస ఉన్నారు. ఆయన భార్య హేమలత రచయిత్రి. ఆమె 2019లో మృతిచెందారు. జీవన సహచరి మరణంతో సుధాకర్‌ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. పెద్ద కుమార్తె మనోజ్ఞకు ఈనెల 21నే వివాహమైంది. ఆ వేడుక జరిగిన వారం రోజులకే ఆయన చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్న కుమార్తె మానస కథా రచయిత్రి. ఆమె రాసిన కథా సంపుటి ‘మిళింద ’కు 2020 కేంద్ర సాహిత్య యువ పురస్కారం లభించింది. సుధాకర్‌ అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం నారాయణగూడలోని క్రైస్తవ శ్మశానవాటికలో నిర్వహించారు. బంధువులు, స్నేహితులు, కవులు, రచయితలు, సాహితీవేత్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో నివాళులర్పించారు. 1959 జనవరి 21న నిజామాబాద్‌ జిల్లా పాముల బస్తీలో సుధాకర్‌ జన్మించారు.


తల్లిదండ్రులు ఎండ్లూరి దేవయ్య, శాంతాబాయి. వీధి బడిలోనే పాఠశాల విద్యనభ్యసించారు. ఉన్నత విద్యను హైదరాబాద్‌లో పూర్తి చేసుకున్నారు. తెలుగు ఉపాధ్యాయుడిగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి కేంద్ర విశ్వవిద్యాలయం ఆచార్యుడి స్థాయికి ఎదిగారు.  వర్తమానం, కొత్త గబ్బిలం, నా అక్షరమే నా ఆయుధం, మల్లెమొగ్గల గొడుగు, నల్ల ద్రాక్ష పందిరి, వర్గీకరణీయం, గోసంగి, కథానాయకుడు జాషువ, తెలి వెన్నెల తదితర  రచనలు చేశారు. కాగా అంతకుముందు ఆస్పత్రి నుంచి భౌతికకాయాన్ని దోమల్‌గూడలోని నివాసంలో ఉంచారు.  ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకులు  కె.శ్రీనివాస్‌, కవి, రచయిత గాయకుడు జయరాజ్‌, అరుణోదయ విమలక్క, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు, ప్రముఖ దళిత రచయిత్రి జూపాక సుభద్ర, ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత, సామాజిక వేత్త సజయ, వీక్షణం సంపాదకులు వేణుగోపాల్‌ తదితరులు నివాళులర్పించారు. 

Updated Date - 2022-01-29T09:19:30+05:30 IST