ఐపీఎల్‌ను వాయిదా వేయాలంటూ బీసీసీఐపై పెరుగుతున్న ఒత్తిడి

ABN , First Publish Date - 2021-05-03T20:37:46+05:30 IST

ఇద్దరు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లు కరోనా బారినపడడంతో నేడు ఆర్సీబీ-కేకేఆర్ మధ్య జరగాల్సిన టీ20 మ్యాచ్...

ఐపీఎల్‌ను వాయిదా వేయాలంటూ బీసీసీఐపై పెరుగుతున్న ఒత్తిడి

న్యూఢిల్లీ: ఇద్దరు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లు కరోనా బారినపడడంతో నేడు ఆర్సీబీ-కేకేఆర్ మధ్య జరగాల్సిన టీ20 మ్యాచ్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ను వాయిదా వేయాలంటూ బీసీసీఐపై ఒత్తిడి పెరుగుతోంది. నిజానికి టోర్నీ ప్రారంభానికి ముందే ఇలాంటి డిమాండ్లు వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. భారత్‌లో రెండో విడత కరోనా కలకలం ప్రారంభమైన తర్వాత కూడా ఇలాంటి డిమాండే వచ్చింది. ఐపీఎల్‌లో పరుగుల కంటే వేగంగా బయట ప్రాణాలు పోతున్నాయని, కాబట్టి ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహణ సరికాదంటూ పలువురు క్రీడా నిపుణులు విమర్శించారు. విదేశీ మీడియా కూడా ఐపీఎల్ నిర్వహణను తప్పబట్టింది. ఐపీఎల్ కంటే దృష్టిపెట్టాల్సిన తీవ్రమైన అంశాలు భారత్‌లో ఉన్నాయని పేర్కొంది. అయినప్పటికీ పట్టించుకోని బీసీసీఐ టోర్నీ నిర్వహణకే మొగ్గు చూపింది.


తాజాగా, ఇద్దరు కోల్‌కతా ఆటగాళ్లు కరోనా బారినపడిన తర్వాత మరోమారు ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది. ఐపీఎల్‌ను వెంటనే వాయిదా వేయాలంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. కేకేఆర్ ఆడే అన్ని మ్యాచ్‌లను వాయిదా వేసి ప్రత్యర్థులకు రెండేసి పాయింట్లు ఇవ్వడమో, లేదంటే మొత్తంగా ఐపీఎల్‌నే వాయిదా వేయడమో చేయాలని ఒకరు కామెంట్ చేస్తే.. ప్రతి రోజూ 3500 మందికిపైగా కరోనా బారినపడి మరణిస్తున్నారని, ఆక్సిజన్, వ్యాక్సిన్ల కొరత వేధిస్తుంటే వాటి సంగతి చూడడం మానేసి తీరిగ్గా ఐపీఎల్ నిర్వహిస్తున్నారని మరికొందరు దుయ్యబట్టారు. ఇప్పుడీ పరిస్థితిని బీసీసీఐ ఎలా పరిష్కరిస్తుందో చూడాలని ఉందని నెటిజన్లు పేర్కొన్నారు.

Updated Date - 2021-05-03T20:37:46+05:30 IST