పుష్కరుడికి వీడ్కోలు

ABN , First Publish Date - 2022-04-25T04:21:10+05:30 IST

పన్నెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన ప్రాణహిత పుష్కరాలు ఆదివారంతో ముగిసాయి. ఈనెల 13న సాయంత్రం 3.50 నిమిషాలకు మీనరాశిలోకి గురుడు ప్రవేశించడంతో ప్రాణహితకు పుష్కరాలు ప్రారంభం కాగా కోటపల్లి మండలంలోని అర్జున గుట్ట వద్ద దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే సుమన్‌, ఎమ్మెల్సీ దండె విఠల్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీలు పుష్కరాలను ప్రారంభించారు.

పుష్కరుడికి వీడ్కోలు
నదికి హారతి ఇస్తున్న అర్చకులు, అధికారులు

ముగిసిన ప్రాణహిత పుష్కరాలు 

చివరి రోజు తగ్గని భక్తుల జోరు

మొత్తంగా 10 లక్షల మంది భక్తుల పుష్కర స్నానాలు

మళ్లీ 12 ఏండ్లకు వస్తామంటూ భక్తులు ఇంటిదారి 

కోటపల్లి, ఏప్రిల్‌ 24: పన్నెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన ప్రాణహిత పుష్కరాలు ఆదివారంతో ముగిసాయి. ఈనెల 13న సాయంత్రం 3.50 నిమిషాలకు మీనరాశిలోకి గురుడు ప్రవేశించడంతో ప్రాణహితకు పుష్కరాలు ప్రారంభం కాగా కోటపల్లి మండలంలోని అర్జున గుట్ట వద్ద దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే సుమన్‌, ఎమ్మెల్సీ దండె విఠల్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీలు పుష్కరాలను ప్రారంభించారు. రోజు 50 నుంచి 60 వేల మంది భక్తులు స్నానాలు చేయగా 9, 11, 12వ రోజుల్లో భక్తుల సంఖ్య లక్ష దాటింది. మొత్తంగా 12 రోజుల్లో 7.50 లక్షల మంది పుష్కర స్నానాలు ఆచరించినట్లు అంచనా. తమిళనాడు , ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి భక్తులు తరలి వచ్చారు. సాధారణ భక్తులతోపాటు వీఐపీలు తరలి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. 

చివరి రోజు తగ్గని జోరు 

పుష్కరాల్లో చివరి రోజైన ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల రాక కనబడింది. ఎండ వేడిని లెక్క చేయకుండా పుష్కర స్నానం ఆచరించేందుకు పల్లె జనం కదలివచ్చింది. పుష్కర స్నానాలు ఆచరించిన భక్తులు తీరంలో పిండ శ్రార్ధ కర్మలు, నదిలో వాయినాల సమర్పణ, సైకత లింగాలకు పూజలు, దీపాలు, జలతర్పణాలు   చేపట్టారు. చివరి రోజు సుమారు 1.20 లక్షల మందికి భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. భక్తుల రాకతో నది తీరం సందడిగా మారింది. వాహనాలతో పార్కింగ్‌ స్థలం నిండిపోయింది. సైకిల్‌ స్వామి ఆశ్రమం నిర్వహకులు వెంకటేశ్వర స్వామికి చక్రస్నానం నిర్వహించి తీరంలో పల్లకి సేవ చేపట్టగా సత్యసాయి భక్తులు సత్యసాయి విగ్రహంతో పల్లకి సేవ చేశారు. భక్తజన రద్దీతో నది తీరంలో పలువురు చిన్నారులు తప్పిపోగా పోలీసులు వారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సాయంత్రం వరకు వచ్చిన భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి నదీమ తల్లికి ప్రణామం చేస్తూ చల్లగా చూడు తల్లి మళ్లీ 12 ఏండ్లకు వస్తామంటూ ఇంటి దారి పట్టారు.

ప్రముఖుల స్నానాలు

చివరి రోజు పలువురు ప్రముఖులు పుష్కర స్నానాలు ఆచరించారు. తెలంగాణ రాష్ట్ర లోకాయుక్త ఉప జడ్జి నిరంజన్‌ రావు కుటుంబ సమేతంగా పుష్కర స్నానం ఆచరించి పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాధ్‌రావు నాయకులతో కలిసి పుష్కర స్నానాలు ఆచరించారు. 

భక్తుల సేవలో....

12 రోజుల పాటు పలు సేవా సంస్థలు భక్తుల సేవలో తరించాయి. ఫ్రెండ్స్‌ యూత్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో తాగునీరు అందించారు. అలాగే హేమసాయిరాంట్రస్టు, శ్రీతత్వమసి, విద్య, వైద్య ఆధ్యాత్మిక సేవా సంస్థ, అరుణాచల శివ అన్నప్రసాదం (రుద్రాక్షస్వామి), సత్యసాయి సేవా సంస్థ, బాల్క ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం, అన్నదానం, మజ్జిగ పంపిణీ చేపట్టగా పోలీసుల ఆధ్వర్యంలో ఘాట్‌పైన తాగునీరు, శనగలు పంపిణీ చేశారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నా చల్లని నీరు,  భోజనం అందించడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. 

పుష్కరాల విజయవంతంలో పోలీసుల సేవలు అభినందనీయం. పుష్కరాల ప్రారంభానికి వారం రోజుల ముందు నుంచే చెన్నూరు రూరల్‌ సీఐ నాగరాజు, కోటపల్లి ఎస్‌ఐ రవికుమార్‌లు  ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టారు. సర్పంచు గుర్రం లక్ష్మీరాజన్నల సహకారంతో 12 రోజుల పాటు అలుపెరుగకుండా పోలీసులు విధులు నిర్వహించారు. డీఎల్‌పీవో ప్రభాకర్‌ రావు, ఎంపీవోలు సత్యనారాయణరెడ్డి, సతీష్‌బాబు, శ్రీపతి బాపుల పర్యవేక్షణ లో పారిశుధ్య కార్మికులు పనులు చేపట్టారు. రెస్య్కూ, ఫైర్‌ టీం సభ్యులు నదిలో కాపలా కాశారు. దేవాదాయ శాఖ అధికారులు అనూష, రవికిషన్‌లు వారి సిబ్బందితో కలిసి భక్తులకు సేవలందించడంతోపాటు రోజుకో దేవాలయం హారతితో ఆధ్యాత్మికతను పంచారు. చివరి రోజు వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏసీపీ నరేందర్‌ ఆధ్వర్యంలో సమీక్ష జరుపుతూ పుష్కరాలను పూర్తి చేశారు. 

వేమనపల్లి: ప్రాణహిత నది జనసంద్రమైంది. పుష్కరాలు ముగింపు రోజైన 12వ రోజు ఆదివారం భక్తుల రాకతో వేమనపల్లి ప్రాణహిత నది తీరం కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా ఎడ్లబండ్లు, ప్రత్యేకవాహనాలు, బస్సులు, బైక్‌లతో నది ఒడ్డున మూడు కిలోమీటర్ల మేర వాహనాలే కనిపించాయి. ఆదివారం దాదాపు 70 వేల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. 12 రోజుల్లో దాదాపు 2లక్షల70వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలి పారు. చివరి రోజు పలువురు భక్తులు పితృదేవతలకు పిండ ప్రదానాలను చేశారు. మహిళలు దీపాలు, వాయినాలు సమర్పించారు.  మాజీ మంత్రి గడ్డం వినోద్‌, ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ కమిషనర్‌ విజయరామారావు పుణ్యస్నానాలు ఆచరించారు. 12 రోజులుగా భక్తుల కోసం నిత్యాన్నదానం చేసిన నిర్వాహకులు కోలి వేణుమాధవ్‌రావు, స్వర్ణలతసంతోష్‌కుమార్‌లను  విశ్వనాథ ఆలయ ధర్మకర్త రీనారాణిదాస్‌, ధర్మేందర్‌ దంపతులు సన్మానిం చారు. నది తీరంలో సేవలందించిన పారిశుధ్య కార్మికులను టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు సన్మానించారు. నీల్వాయి ఎస్‌ఐ సురేష్‌ ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు.  

Updated Date - 2022-04-25T04:21:10+05:30 IST