నాయకుడి వీడ్కోలు

ABN , First Publish Date - 2022-01-19T05:49:35+05:30 IST

భారత క్రికెట్‌లో ఒక అధ్యాయం ముగిసింది. అత్యుత్తమ ఆటతీరుకు నిఖార్సయిన నిర్వచనంగా నిలిచిన విరాట్‌ కోహ్లీ సారథ్య బాధ్యతలకు వీడ్కోలు పలికాడు. ఇప్పటికే టి-20, వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న...

నాయకుడి వీడ్కోలు

భారత క్రికెట్‌లో ఒక అధ్యాయం ముగిసింది. అత్యుత్తమ ఆటతీరుకు నిఖార్సయిన నిర్వచనంగా నిలిచిన విరాట్‌ కోహ్లీ సారథ్య బాధ్యతలకు వీడ్కోలు పలికాడు. ఇప్పటికే టి-20, వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్‌ ఇకపై టెస్ట్‌ క్రికెట్‌లోనూ జట్టును నడిపించలేనంటూ అనూహ్యమైన నిర్ణయాన్ని ప్రకటించాడు. క్రీడావర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన ఈ వ్యవహారం అతడి అభిమానులకు ఒకింత బాధాకరమే. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో సంబంధాలు దెబ్బతిన్నందుకే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడంటూ విస్తృతంగా చర్చ జరుగుతోంది. అసలు విరాట్‌ టి-20 కెప్టెన్‌గా వైదొలగడమే ఈ మొత్తం వ్యవహారానికి కారణంగా భావించాలి. అయితే అతడు టి-20 సారథ్యం నుంచి ఎందుకు తప్పుకున్నాడన్నది మాత్రం ఓ మిస్టరీగానే ఉంది. పనిభారం కారణంగానే వద్దనుకున్నట్టు చెప్పినా, తర్వాత వన్డేలు, టెస్ట్‌ కెప్టెన్సీ బాధ్యతలనూ వదిలేయడం చూస్తే అది సరైన సమాధానం కాదని అర్ధమవుతుంది. కోహ్లీ కెప్టెన్‌గా వచ్చినప్పటి పరిస్థితుల్ని గమనిస్తే... అప్పటికి ధోనీ సారథ్యంలోని భారత జట్టు పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో మంచి విజయాలు సాధిస్తోంది. కానీ టెస్ట్‌ల్లో మాత్రం ధోనీకి మంచి రికార్డు (45 శాతం) లేదు. అప్పడు టెస్టుల్లో భారత జట్టు ర్యాంకు 7. విదేశాల్లో విజయాలూ అంతంత మాత్రంగానే లభించేవి. అయితే, ఈ అంశంలో మార్పు విరాట్‌ నాయకత్వంలో స్పష్టంగా కనిపించింది.


భారత క్రికెట్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా భాసిల్లిన సౌరవ్‌ గంగూలీ బోర్డు చీఫ్‌గా వచ్చినప్పటినుంచి విరాట్‌కు అతడితో పొసగకపోవడమే ఈ రాజీనామాలకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. సారథి ఎవరైనా ఒకదానివెంట ఒకటిగా వరుసపెట్టి మూడు ఫార్మాట్ల కెప్టెన్సీల నుంచీ నిష్క్రమించడం భారత క్రికెట్‌కు ఏ మాత్రం శోభనివ్వదు. ఈ నిర్ణయంతో డ్రెస్సింగ్‌ రూమ్‌ వాతావరణం కూడా కలుషితం అయ్యేందుకు అవకాశముంది. నిజానిజాలు ఎలాఉన్నా అసలు విరాట్‌ కెప్టెన్‌గా వైదొలిగిన సమయమే సరికాదన్న వాదనలూ వినవస్తున్నాయి. మైదానంలో దూకుడుగా వ్యవహరించే కోహ్లీ... కెప్టెన్సీని వదులుకునే విషయంలోనూ ఏ మాత్రం తగ్గలేదని అంటున్నారు. బెంగళూరు వేదికగా జరిగే తన 100వ మ్యాచ్‌ని ఆడిన తర్వాతే టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేయాలని బోర్డు సభ్యులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా విరాట్‌ ససేమిరా అన్నాడట. ఆ మ్యాచ్‌ సందర్భంగా సన్మానం చేస్తామని చెప్పినా అతడు దాన్ని ఖాతరు చేయలేదట. తనకు ఇలాంటి సన్మానాలు, రికార్డులు ఇష్టం ఉండదని చెప్పాడట. విరాట్‌ హయాంలో ఫిజికల్‌ ఫిట్‌నెస్‌, మానసిక దృఢత్వం లాంటి అంశాలపై జట్టులో అనూహ్యమైన మార్పు ఆవిష్కృతమైంది.


ఇక కోహ్లీ రికార్డుల విషయానికొస్తే, తన కెప్టెన్సీతో భారత్‌ను టెస్టుల్లో నెంబర్‌ వన్‌గా నిలిపాడు. 68 టెస్టుల్లో 40 విజయాలంటే మాటలు కాదు. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనే అత్యధిక విజయ శాతం సాధించిన జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ విషయంలో భారత కెప్టెన్లు ఎవరూ విరాట్‌ స్థాయిని అందుకోలేకపోయారు. 


విదేశాల్లోనూ అతడి రికార్డు బ్రహ్మాండంగా ఉంది. కాగితం పులులుగా చెడ్డపేరున్న భారత జట్టును అగ్రపీఠానికి చేర్చిన ఘనత కోహ్లీదే. అయితే వన్డే వరల్డ్‌కప్‌తో పాటు ఐసీసీ నిర్వహించే ఏ ఒక్క ప్రధాన టోర్నీని గెలిపించలేకపోయాడన్న లోటు మాత్రమే అతడి కెప్టెన్సీ కెరీర్‌కు మచ్చలా మిగిలిపోతుంది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగినా, ఎవరికీ భయపడాల్సిన అవసరమే లేదనే ఆట తీరును భారత జట్టుకు నేర్పించాడు. అది స్వదేశమైనా, విదేశమైనా ప్రత్యర్థికి తలొగ్గాల్సిన పనే లేదన్న వైఖరిని అవలంబించాడు. అతడి రాకతో ఆటగాళ్లకు ఏదో తెలియని ధైర్యం వచ్చినట్టయింది. తన తర్వాత బాధ్యతలు స్వీకరించే సారథులకు ఇది ఎంతో ఉపకరిస్తుంది. గెలుపోటములు, విజయాల సంఖ్య కంటే కూడా అతడి ముద్ర జట్టుపై ఏ స్థాయిలో ఉందన్నదే ప్రధానంగా గుర్తించాల్సిన అంశం. కోహ్లీ తన సారథ్యంతో జట్టులో స్ఫూర్తి నింపిన విధానం మాత్రం అద్భుతమనే చెప్పాలి.

Updated Date - 2022-01-19T05:49:35+05:30 IST