బోరుమంటున్న బీర రైతు

ABN , First Publish Date - 2020-08-05T09:33:43+05:30 IST

సంప్రదాయ పంటలకు భిన్నంగా.. ఎన్నోఆశలతో బీర పంటను సాగు చేసిన కొందరు రైతులు బావురుమంటున్నారు.

బోరుమంటున్న బీర రైతు

పూత, కాత లేదంటూ ఆవేదన

మోసపోయామంటూ రైతుల గగ్గోలు


సత్తుపల్లిరూరల్‌/తల్లాడ, ఆగస్టు 4: సంప్రదాయ పంటలకు భిన్నంగా.. ఎన్నోఆశలతో బీర పంటను సాగు చేసిన కొందరు రైతులు బావురుమంటున్నారు. రూ.వేలల్లో పెట్టుబడి పెడితే తీరా పంట చేతికొచ్చే సమయానికి కాపు లేదంటూ లబోదిబోమంటున్నారు. సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి, కిష్టాపురానికి చెందిన పలువురు రైతులు సుమారు 30ఎకరాల్లో, తల్లాడ మండలం బాలపేటకు చెందిన ఓ రైతు ఎకరం విస్తీర్ణంలో బీరసాగు చేశారు. ఆ పంటలు ఆశాజనకంగా లేకపోవడంతో తమను ఆదుకోవాలంటూ బేతుపల్లి, కిష్టాపురానికి చెందిన రైతులు మంగళవారం మండల వ్యవసాయ అధికారి వై.శ్రీనివాసరావును కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. తాము మండలంలోని నారాయణపురంలో విత్తన దుకాణంలో విత్తనాలు కొని విత్తామని, కాపు, పూత రాలేదని, వచ్చిన కొన్ని కాయలను కూడా నాణ్యత లేదంటూ వ్యాపారులు కొనడం లేదంటూ వాపోయారు. తమను మోసగించిన విత్తన కంపెనీ, దుకాణం వారిపై చర్యలు తీసుకోవాలంటూ వినతిపత్రం అందించారు.


ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ విచాచరణ జరిపి చర్యలు తీసుకుంటామని, విత్తనాలను కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, బిల్లులు తీసుకోవాలని సూచించారు. ఇక తల్లాడ మండలం బాలపేట గ్రామానికి చెందిన పాలెపు బ్రహ్మం అనే రైతు వైరాలోని ఓ విత్తనదుకాణంలో బీరవిత్తనాలను కొనుగోలు చేసి తనకున్న ఎకరంలో విత్తాడు. రెండునెలల్లో కాపు రావాల్సి ఉండగా అది కనిపించకపోవంతో విత్తనలోపమేనని గుర్తించిన ఆ రైతు తనకు జరిగిన అన్యాయం గురించి ఉద్యానశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సోమవారం కాపులేని బీరపంటను ఉద్యాన అధికారి మీనాక్షి పరిశీలించారు.

Updated Date - 2020-08-05T09:33:43+05:30 IST