రైతు బిడ్డ న్యాయ సేద్యం!

ABN , First Publish Date - 2021-04-07T07:29:47+05:30 IST

సాధారణ దిగువ మధ్య తరగతి రైతు కుటుంబానికి చెందిన రమణ... ఇప్పుడు భారత చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ

రైతు బిడ్డ న్యాయ సేద్యం!

  • కష్టాలకు ఎదురీది అత్యున్నత పీఠానికి జస్టిస్‌ రమణ.. కృష్ణా జిల్లా పొన్నవరం నుంచి ప్రస్థానం
  •  గుంటూరు జిల్లాలో ఉన్నత విద్యాభ్యాసం
  •  ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం
  •  హైకోర్టు న్యాయవాదిగా ప్రత్యేక ముద్ర 
  •  ఏపీ హైకోర్టు జడ్జిగా 13 ఏళ్లు సేవలు


కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగారు! గుంటూరులో చదువుకున్నారు! న్యాయవాదిగా ఎదిగారు. న్యాయమూర్తిగా ప్రస్థానించారు. ఇప్పుడు... భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనే... జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణ! అందరికీ...జస్టిస్‌ ఎన్వీ రమణగా సుపరిచితుడు! 


(విజయవాడ/గుంటూరు/న్యూఢిల్లీ - ఆంధ్రజ్యోతి)

సాధారణ దిగువ మధ్య తరగతి రైతు కుటుంబానికి చెందిన రమణ... ఇప్పుడు భారత చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణగా మారారు. ఆయన 1957 ఆగస్టు 27న జన్మించారు. తల్లిదండ్రులు... గణపతిరావు, సరోజనీ దేవి. స్వగ్రామం.. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం. ఆయనకు ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు.


వ్యవసాయం కలిసి రాకపోవడంతో గణపతిరావు కుటుంబం ఆర్థికంగా పలు ఇబ్బందులు పడింది. స్వగ్రామంలో ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు. బాల్యంలో కష్టాలు ఎదురైనప్పటికీ రమణ పట్టుదలతో కష్టపడి చదువుకున్నారు. కంచికచర్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. గుంటూరు జిల్లా ధరణికోట (అమరావతి) ఆర్‌వీవీఎన్‌ కళాశాలలో బీఎస్సీ చదివారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి 1982లో న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. 



యువరానర్‌ అంటూ...

రమణ 1983 ఫిబ్రవరి 10న రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. కర్నూలు మాజీ ఎంపీ ఏరాసు అయ్యపురెడ్డి వద్ద తొలినాళ్లలో జూనియర్‌గా పని చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి హైకోర్టులో ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు ‘పిల్‌’ రమణగా పేరు తెచ్చుకోవడం విశేషం.


ప్రజా సమస్యలపై ప్రజాప్రయోజన వ్యాజ్యాల ద్వారా అనేక అంశాలపై న్యాయ పోరాటం చేశారు. సుప్రీంకోర్టులోనూ వాదనలు వినిపించారు. కేంద్ర, రాష్ట్ర పరిపాలనా ట్రైబ్యునల్స్‌లోనూ వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పని చేశారు. పలు ప్రభుత్వ సంస్థలకు ప్యానల్‌ అడ్వొకేట్‌గా వ్యవహరించారు. రాజ్యాంగం, క్రిమినల్‌, సర్వీస్‌, ఎన్నికలు, అంతర్రాష్ట్ర నదీ జలాల సంబంధిత కేసులను వాదించారు. రమణ ఆంధ్రప్రదేశ్‌ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ హోదాలో సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించారు.



న్యాయమూర్తిగా...

న్యాయవాదిగా మంచి పేరు తెచ్చుకున్న జస్టిస్‌ రమణ తొలుత ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. 2000 జూన్‌ 27న రాష్ట్ర హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుమారు 13 ఏళ్లపాటు హైకోర్టు జడ్జిగా జస్టిస్‌ రమణ వేల కేసుల్లో తీర్పులు ఇచ్చారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకు ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక సీజేగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీ జుడీషియల్‌ అకాడమీ చైర్మన్‌గా, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా పనిచేశారు.


ఏపీ నుంచి ఢిల్లీకి...

జస్టిస్‌ రమణ 2013 సెప్టెంబరు 2న ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తదుపరి ఏడాదే సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా సుప్రీం న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు... భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సౌమ్యుడిగా పేరుపొందిన జస్టిస్‌ రమణ చీఫ్‌ జస్టిస్‌గా నియమితులయ్యే క్రమంలో అనేక అడ్డంకులను ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ అధిగమించి అత్యున్నత స్థానాన్ని అధిష్టిస్తున్నారు.



దేశ విదేశాలకు...

జస్టిస్‌ రమణ మహిళా సాధికారత, పర్యావరణం, జుడీషియల్‌ యాక్టివిజమ్‌, జెండర్‌ జస్టిస్‌, సబ్‌-ఆర్డినేట్‌ కోర్టుల పాత్ర, మానవ హక్కులు, దివ్యాంగుల హక్కులు తదితర అంశాలపై జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొని పరిశోధనా పత్రాలు సమర్పించారు. బ్రిటన్‌ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఇంగ్లండ్‌ వెళ్లి, అక్కడి న్యాయవ్యవస్థ తీరును పరిశీలించారు.


అమెరికాలో న్యాయపాలనపై అధ్యయనం చేశారు. పేద ప్రజలకు న్యాయం అందుబాటులోకి రావాలని, వారికి ఉచిత న్యాయసేవలు లభించాలని ఆయన కోరుకుంటారు. న్యాయసేవల అథారిటీ చైర్మన్‌గా జస్టిస్‌ రమణ వేలాది మంది పేద ప్రజల కేసులు ఉచితంగా పరిష్కారం అయ్యేలా చూశారు. దేశంలో కోర్టులను ఆధునికీకరించాలని, మౌలిక సదుపాయాలను పెంచాలని, ఇందుకోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. 


ఇద్దరూ.. ఇద్దరే..!

ఒకరు న్యాయశాస్ర్తాన్ని ఔపోసన పెడితే, ఇంకొకరు వైద్యశాస్త్రం లోతులను తరచిచూసినవారు. వారే జస్టిస్‌ ఎన్వీ రమణ, డాక్టర్‌ యార్లగడ్డ నాయుడమ్మ. వీరిద్దరూ వియ్యంకులు. అవిభక్త కవలల శస్త్ర చికిత్సలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డాక్టర్‌ నాయుడమ్మ పేరు ప్రఖ్యాతలు పొందారు. ఆయన కుమారుడు రితేశ్‌తో జస్టిస్‌ రమణ కుమార్తె భువనకు వివాహం జరిగింది. 





లాయర్‌ కావాలనుకోలేదు...

న్యాయ వ్యవస్థలో అత్యున్నత పీఠానికి ఎదిగిన జస్టిస్‌ రమణ నిజానికి న్యాయవాది కావాలని భావించలేదు. యాదృచ్ఛికంగానే ఆయన ఈ వృత్తిని ఎంచుకున్నారు. ఆయన కుటుంబంలోనూ ఎవరూ న్యాయవాదులు లేరు. విద్యార్థి దశలో చురుకుగా వ్యవహరిస్తూ, సామాజిక అభ్యుదయం కోసం పలు పోరాటాలు చేశారు. అనేక విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో విద్యార్థులతో నిరసన ప్రదర్శనలు నిర్వ హించారు. ఒక దశలో తాను అరెస్టు నుంచి తప్పించుకున్నట్లు జస్టిస్‌ ఎన్వీ రమణ ఒక సందర్భంలో చెప్పారు. 


Updated Date - 2021-04-07T07:29:47+05:30 IST