అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-11-23T07:37:18+05:30 IST

అప్పులు తెచ్చి వ్యవసాయం చేశాడు. ఆరుగాలం శ్రమించాడు. పంటలు బాగా పండితే అప్పులు తీర్చొచ్చని అనుకున్నాడు. కానీ,

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

దిగుబడి తక్కువ వచ్చిందని..

పత్తి పంటను దున్నిన మరో రైతు

కోనరావుపేట/ముదిగొండ, నవంబరు 22: అప్పులు తెచ్చి వ్యవసాయం చేశాడు. ఆరుగాలం శ్రమించాడు. పంటలు బాగా పండితే అప్పులు తీర్చొచ్చని అనుకున్నాడు. కానీ, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. దీంతో అప్పులు తీర్చే మార్గం లేక ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన మంగళిపల్లి దేవయ్య (55) అనే రైతు తనకున్న రెండు ఎకరాల్లో వరి సాగు చేశాడు. భారీ వర్షాలతో పంట దెబ్బతిని నష్టపోయాడు. 1.50 లక్షల రూపాయల అప్పు ఎలా తీర్చాలని ఆందోళన చెందుతున్నాడు.శనివారం రాత్రి ఇంట్లో పురుగుల మందుతాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.


మరోవైపు, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినపల్లిలో మీగడ గోపి అనే రైతు ఎకరాకు రూ.25 వేల పెట్టుబడి పెట్టి తనకున్న మూడెకరాల్లో పత్తి పంట వేశాడు. కానీ, ఇటీవల పడిన అధిక వర్షాలతో కొంత, విత్తన లోపంతో మరికొంత పంట దెబ్బతింది. పత్తి తీస్తే ఎకరానికి 20 క్వింటాళ్లు దిగుబడి రావాల్సి ఉండగా మూడు క్వింటాళ్లు మాత్రమే రావడంతో ఆ రైతు ఆవేదన చెందాడు. పంటను చేతికొచ్చే దశలో ట్రాక్టర్‌తో దున్నేశాడు. తన భూమిలో మొక్కజొన్న బాగా పండేదని, ప్రభుత్వ సూచన మేరకు మొక్కజొన్న కాకుండా పత్తివేశానని చెప్పాడు.


Updated Date - 2020-11-23T07:37:18+05:30 IST