అప్పుల ఊబి నుంచి తప్పించుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేసిన రైతు.. బ్యాంకుతోపాటు రుణదాతలకూ కుచ్చుటోపీ

ABN , First Publish Date - 2022-01-13T10:52:23+05:30 IST

తలపై ఉన్న లక్షల అప్పు నుంచి తప్పించుకోవడానికి ఓ రైతు భారీ ప్లాన్ వేశాడు. అతడికి రుణం ఇచ్చిన బ్యాంకు, వడ్డీ వ్యాపారులందరికీ డబ్బులు ఇవ్వకుండా ఉండేందుకు పెద్ద కథనే అల్లాడు. సినీఫక్కీలో దొంగతనం చేయించాడు...

అప్పుల ఊబి నుంచి తప్పించుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేసిన రైతు.. బ్యాంకుతోపాటు రుణదాతలకూ కుచ్చుటోపీ

తలపై ఉన్న లక్షల అప్పు నుంచి తప్పించుకోవడానికి ఓ రైతు భారీ ప్లాన్ వేశాడు. అతడికి రుణం ఇచ్చిన బ్యాంకు, వడ్డీ వ్యాపారులందరికీ డబ్బులు ఇవ్వకుండా ఉండేందుకు పెద్ద కథనే అల్లాడు. సినీఫక్కీలో దొంగతనం చేయించాడు. కానీ చివరికి పోలీసుల చేతిలో బోల్తాపడ్డాడు. అసలేం జరిగిందంటే..


హరియాణా రాష్ట్రంలోని సోనీపత్ జిల్లా పరిధి జాగసీ గ్రామానికి చెందిన బ్రహ్మప్రకాశ్ అనే రైతు తన అప్పులు చెల్లించేందుకు గత సోమవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.6 లక్షలు విత్‌డ్రా చేసుకున్నాడు. డబ్బులన్నీ బ్యాగులో వేసుకొని ఇంటికి వెళుతుండగా.. దారిలో నలుగురు దుండగలు బైక్‌పై ఒక్కసారిగా వచ్చి తుపాకీతో బెదిరించి డబ్బులతో నిండిన బ్యాగును లాక్కొని పారిపోయారు. బ్రహ్మప్రకాశ్ అప్పటికప్పుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి దొంగతనం గురించి ఫిర్యాదు చేశాడు.


పట్టపగలే దొంగతనం జరగడంతో పోలీసుల వెంటనే రంగంలోకి దిగారు. బ్రహ్మప్రకాశ్‌ గురించి పూర్తిగా విచారణ చేశారు. అతడు బ్యాంకులో రుణం తీసుకున్నాడని, అది కాకుండా బయట అధిక వడ్డీకి అప్పు తీసుకున్నాడని తెలిసింది. ఆ అప్పులన్నీ వెంటనే తీర్చాలని వడ్డీ వ్యాపారులు అతనిపై ఒత్తిడి చేసినట్లు కూడా తేలింది. పోలీసులు దొంగతనం చేసిన వారి గురించి ఎంత వెతికినా వారి ఆచూకీ తెలియలేదు. దీంతో పోలీసులు బ్రహ్మప్రకాశ్‌ని మరోసారి ప్రశ్నించారు. అసలు ఘటన ఎలా జరిగింది?.. ఏ సమయంలో జరిగింది?.. ఎంత మంది ఎలా చుట్టుముట్టారు?.. అని మళ్లీ మళ్లీ అడిగారు. దొంగల గురించి ఏమైనా ఆనవాళ్లు తెలపమని అడిగితే.. బ్రహ్మప్రకాశ్ ఇంతకుముందు వివరించిన ఘటనకు ప్రస్తుతం చెప్పే సమాధానాలకు పొంతన కనపడలేదు. దీంతో పోలీసులకు బ్రహ్మప్రకాశ్‌పై అనుమానం కలిగింది.


బ్రహ్మప్రకాశ్‌ని పోలీసులు తమ పద్ధతిలో ప్రశ్నించగా.. అప్పుడు అతను నిజం చెప్పాడు. తానే ఆ దొంగతనం చేయించానని ఒప్పుకున్నాడు. బ్యాంకు నుంచి తీసిన డబ్బు ముందుగా ఇంటికి వెళ్లి భద్రంగా దాచేశానని, ఆ తరువాత మళ్లీ బ్యాంకుకు వెళ్లి ఒక ఖాళీ బ్యాగుతో వస్తుండగా.. తన స్నేహితులను దొంగలుగా వచ్చి ఆ ఖాళీ బ్యాగు తీసుకువెళ్లారని చెప్పాడు.


పోలీసులు బ్రహ్మప్రకాశ్‌పై చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అతనికి దొంగతనం చేసేందుకు సహాయం చేసిన వారి గురించి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2022-01-13T10:52:23+05:30 IST