Abn logo
Aug 3 2020 @ 04:53AM

రైతుసంక్షేమానికే రైతువేదికలు

దసరా లోపు అన్నీ అందుబాటులోకి..

ప్రతీఏటా రూ.14వేల కోట్లతో రైతుబంధు

రైతువేదిక శంకుస్థాపనలో మంత్రి పువ్వాడ


ఖమ్మంకమాన్‌బజార్‌, ఆగస్టు 2: రైతు సమగ్రాభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ క్రమంలోనే రైతువేదికలకు రూపకల్పన చేసిందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఖమ్మం నగరంలోని 7వ డివిజన్‌ అల్లీపురంలో రైతువేదికకు ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలనే కాకుండా పట్టణ ప్రాంత రైతులకు కూడా విశిష్ట సేవలందించేందుకు రైతువేదికలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో 129క్లస్టర్లలో పనులు ప్రారంభించగా 70క్లస్టర్లలో పని పూర్తిదశకు చేరుకుందని, దసరాలోపు అన్ని రైతువేదికలను అందుబాటులో తెస్తామన్నారు. అల్లీపురం రైతువేదికను రికార్డుస్థాయిలో 26రోజుల్లోనే నిర్మించేలా ఏర్పాట్లు చేసుకోవడం అభినందనీయమన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మెళుకువలను శాస్త్రవేత్తల సలహాలను, సూచనలు అందించే లక్ష్యంతో రైతువేదికలు పనిచేస్తాయని, మునిసిపాలిటీ పరిధిలో ఏడు రైతు వేదికలు అందుబాటులోకి రానున్నాయన్నారు.


రఘునాధపాలెం రైతువేదికను జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఆగస్టు15లోపు ప్రారంభించన్నుట్టు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ఏడాదికి రెండు పంటలకుగాను రూ.14వేలకోట్లతో రైతుబంధును అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, ‘సుడా’ చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, మేయర్‌ పాపాలాల్‌, కమిషనర్‌ అనురాగజయంతి, జేడీఏ విజయనిర్మల, కార్పొరేటర్‌ చేతుల నాగేశ్వరరావు, మందడపు సుధాకర్‌, రావూరి సైదుబాబు, సంక్రాంతి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement