రైతు ఇంట ‘చిరు’ ధాన్యాల పంట

ABN , First Publish Date - 2021-06-22T04:48:26+05:30 IST

ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు చిరుధాన్యాల సాగు పట్ల మక్కువ చూపుతున్నారు.

రైతు ఇంట ‘చిరు’ ధాన్యాల పంట
సజ్జ పంట

పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువ

చిరు ధాన్యాల సాగు పట్ల రైతుల ఆసక్తి 

ఆరోగ్యం పదిలం కోసం పెరిగిన డిమాండ్‌

2000 హెక్టార్లలో సాగుకు సిద్ధం

గోనెగండ్ల, జూన్‌ 21: ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు చిరుధాన్యాల సాగు పట్ల మక్కువ చూపుతున్నారు. ఈ సీజన్‌లో నియోజకవర్గం పరిధిలో రైతులు ఆశిం చిన మేరనే సాగు చేస్తున్నారు. కొర్ర, సజ్జ, రాగులు, జొన్న పంటలను అంతర్‌ పంటలుగా రైతులు సాగు చేస్తున్నారు. పల్లెలు, పట్టణాల్లో ఎక్కువ మంది చిరు ధాన్యాలనే ఆహారంగా వాడుతుండటంతో వాటికి మంచి గిరాకీ పెరిగింది. వైద్యులు సైతం చిరు ధాన్యాలను వాడాలని చెప్పడంతో ఈ పంటలకు మరింత డిమాండ్‌ పెరిగింది.

ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు, మంత్రాలయం మండలాల్లో రైతులు అంతర్‌ పంటలుగా చిరు ధాన్యాలను సాగు చేస్తున్నారు. నియోజకవర్గంలో 800 హెక్టార్లలో కొర్ర, సజ్జ, జొన్న, రాగులు, 600 హెక్టార్లలో, అంటు కొర్రలు మరో 600 హెక్టార్లలో రైతులు సాగు చేస్తున్నారు. 


పెట్టుబడి తక్కువ.. దిగుబడి ఎక్కువ

చిరు ధాన్యాల సాగుకు పెట్టుబడి తక్కువ దిగుబ డి ఎక్కువగా ఉంటుంది. ఈ పంటలను అంతర్‌ పం టలుగా సాగు చేస్తారు. క్వింటా రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు పలుకుతుంది. పశువులకు మేత కూడా వస్తుంది. పాడి పశువుల రైతులకు గ్రాసం భారం తగ్గి పాడి కూడా పెరుగుతుంది. అందువల్ల రైతులు ప్రస్తుతం ఎక్కువగా ఈ పంటల సాగుకు ఇష్టపడుతున్నారు. గోనెగండ్ల మండలంలో గాజులదిన్నె, కులుమాల, పెద్దనేలటూరు, చిన్నమరివీడు, చిన్న నేలటూరు, తిప్పనూరు, వేముగోడు, ఎర్రబాడు, హెచ్‌.కైరవాడి, నందవరం మండలంలో గురుజాల, ముగతి, నందవరం, మిట్టసోమాపురం, పూలచింత, సోమలగూడురు, నదికైరవాడి, ఎమ్మిగనూరు మండలంలోని పది గ్రామాల్లో ఈ పంటలు అధికంగా సాగు చేస్తున్నారు. 


కొర్ర వర్షాధార పంట

కొర్ర పంట వంద రోజు ల్లో చేతికి అందుతుంది. ఎకరాకు 10, 12 బస్తాలు దిగు బడి వస్తుంది. అన్ని పంటల్లా కొర్ర పంటకు నీటి అవసరం పెద్దగా ఉండ దు. వర్షంపై ఆధారపడి పంట పండించవచ్చనే ఉద్దేశంతో పంటకు ఎటు వంటి మందులు, ఎరువులు అవసరం లేకున్నా భూమిలోని సారాన్ని బట్టి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది.


సజ్జ, కొర్ర సాగు చేశా

నేను రెండు ఎకరాల్లో సజ్జ, కొర్ర పంటలు సాగు చేశాను. ప్రతి ఏడాది సజ్జ, కొర్రను సాగు చేస్తాను. ఈ పంటలకు మంచి గిరాకీ కూడా ఉంది. మార్కెట్‌లో ఎప్పుడైనా ధర పలుకుతాయి. ఆరోగ్యానికి అవసర మని చాలా మంది ఇంటి దగ్గరకే వచ్చి కొర్రలు, సజ్జలను విడిగా కొనుక్కొని వెళ్తారు. పెట్టుబడి కూడా పెద్దగా ఉండదు. మంచి లాభాలు వస్తాయి. 

- హుసేన్‌, ఐరన్‌బండ


చిరు ధాన్యాల సాగుపై రైతుల ఆసక్తి 

గతంలో చిరు ధాన్యాలు పంటల  గురించి రైతులకు ఎంత చెప్పినా పట్టించుకునేవారు కాదు. ఇటీవల వారే ఈ పంటలపై ఆసక్తి చూపుతున్నారు. కొర్రన్నం తినడం వల్ల రోగాలు కూడా తక్కువే. ఆరోగ్యరీత్యా చిరు ధాన్యాలకు మంచి గిరాకీ ఉంది. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అధికంగా అంతర్‌ పంటలుగా సాగు చేస్తున్నారు. ఈ పంటల్లో ఫైబర్‌ ఉన్నట్లు వైద్యులు తెలపడంతో చాలా మంది ఆరోగ్యం కోసం ఈ ధాన్యాలను వాడుతున్నారు. 

-రాజకిశోర్‌, ఏవో గోనెగండ్ల 





Updated Date - 2021-06-22T04:48:26+05:30 IST