Abn logo
Sep 21 2021 @ 01:17AM

పిడుగుపాటుకు రైతు మృతి

రామ్మోహన్‌ (ఫైల్‌)

కొణిజేడులోని పొలానికి  మేత కోసం వెళ్లగా దుర్ఘటన

కొణిజేడు (టంగుటూరు), సెప్టెంబరు 20 : పిడుగుపాటుకు రైతు మృతిచెందాడు. ఈ విషాదకర సంఘటన మండలంలోని కొణిజేడు పొలాల్లో సోమవారం చోటుచేసుకుంది. కొణిజేడుకు చెందిన రైతు రామా రామ్మోహన్‌(43) పశువుల మేత కోసం ట్రాక్టర్‌ తీసుకొని ఊరిలో ఎస్సీ కాలనీ పక్కనే ఉండే తన పొలానికి వెళ్లాడు. ఇంతలోనే అతనికి సమీపంలో పిడుగుపడడంతో రామ్మోహన్‌ నిల్చున్న చోటనే కాలి తీవ్రంగా గాయపడి కుప్పకూలిపోయాడు. చుట్టుపక్కల రైతులు పరుగున వెళ్లి చూడగా అప్పటికే అతను మృతి చెంది  ఉన్నాడు. పక్కనే గడ్డి కోస్తున్న ఇరువురు మహిళలు సైతం పిడుగుపాటుకు సొమ్మసిల్లి పడిపోయి కొంత సమయం తర్వాత తేరుకున్నారు. రామ్మోహన్‌కు భార్య, ఇంటర్‌ చదివే కుమార్తె, 7వ తరగతి చదివే కుమారుడు ఉన్నారు. ఇంటికి పెద్దదిక్కును కోల్పోయిన వారు కన్నీరుమున్నీరుగా విలపించారు.