‘మద్దతు’ దక్కని రైతు

ABN , First Publish Date - 2021-04-12T09:07:53+05:30 IST

రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు రైతు ఆశించిన స్థాయిలో లేవు. ప్రభుత్వ మద్దతు ధరలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి. నిరుడు ప్రకృతి విపత్తులతో భారీగా పంట నష్టం

‘మద్దతు’ దక్కని రైతు

నిబంధనల పేరుతో కొనుగోళ్లకు ప్రభుత్వం కోత

ఆవేదనతో అన్నదాత ఆక్రోశం


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు రైతు ఆశించిన స్థాయిలో లేవు. ప్రభుత్వ మద్దతు ధరలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి. నిరుడు ప్రకృతి విపత్తులతో భారీగా పంట నష్టం జరిగింది. ప్రభుత్వం అందించిన నష్టపరిహారం సముద్రంలో నీటి బొట్టే అయింది. రబీలో పండించిన పంటలకు కూడా మద్దతు ధరలు రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఏ రైతుకూ ధర రాకుండా ఉండకూడదంటూ సీఎం జగన్‌ చేస్తున్న నిర్దేశాలు అధికారులతో నిర్వహించే సమావేశాలకే పరిమితమయ్యాయి. ధర రాలేదని రోడ్డెక్కకపోయినా.. రైతు లోలోన ఆవేదన చెందుతున్నాడు.


కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలకు సమాంతరంగా ఏపీ ప్రభుత్వం కూడా పంటలకు ఎమ్మెస్పీలు ప్రకటించింది. అయితేనేం నిబంధనల పేరుతో మొత్తం పంటలో ప్రభుత్వ రంగ సంస్థలు సుమారు 40 శాతంలోపు మాత్రమే కొనుగోలు చేస్తున్నాయి. సుమారు 60 శాతం పంటను వ్యాపారులే కొనుగోలు చేస్తున్నారు. దళారీ వ్యవస్థను ఉక్కుపాదంతో అణిచేస్తామన్న జగన్‌ సర్కార్‌.. పరోక్షంగా ప్రోత్సహిస్తూనే ఉందన్న విమర్శలున్నాయి.


దిగజారిన టమాట రేటు

పచ్చళ్ల సీజన్‌ అయినా టమాట ధర తగ్గిపోయింది. నాణ్యమైన టమాట కూడా క్వింటా గరిష్ఠ ధర రూ.1,000కి మించడం లేదు. నాశిరకం రూ.500 పలుకుతోంది. పచ్చికాయలు కూడా ఎండ, వడగాలికి త్వరగా పండిపోతున్నాయి. రాష్ట్రంలోని వివిధ మార్కెట్లలో గత 10 రోజుల్లో టమాట కనిష్ఠ, గరిష్ఠ ధరలు పుంగనూరులో రూ.540-1,000, మదనపల్లె 510-1,000, కలికిరి 520- 900, పలమనేరు 500-850,  గుర్రంకొండ 520-720గా ఉండగా, రిటైల్‌ మార్కెట్లలో కిలో రూ.20 చొప్పున అమ్ముతున్నారు. నాణ్యమైనవి రూ.25కు అమ్ముతున్నారు.


పసుపు ధర అంతంతే!

పసుపు పంటకు ధరలు ఓ మోస్తరుగానే ఉన్నాయి. దుగ్గిరాల యార్డులో బుల్బ రకం పసుపు క్వింటా రూ.5,350 నుంచి రూ.7వేలు దాకా పలుకుతోంది. ఫింగర్‌ రకం రూ.3,300-7,000, చుర రూ.2,700-2,800 ఉంది. కడప మార్కెట్‌లో బల్బు రకం రూ.3,900-6,800, ఫింగర్‌ రకం రూ.4వేల నుంచి రూ.7,400దాకా పలుకుతోంది. పసుపు పంటకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6,850 మద్దతు ధర ప్రకటించిన విషయం తెలిసిందే. 


శనగ రైతుకు దండగే

శనగలకు డిమాండ్‌ ఉన్నా రైతుకు ధర దక్కడం లేదు. నాణ్యత లేవన్న సాకుతో వ్యాపారులు తక్కువ ధరకు అడుగుతున్నారు. ఎమ్మిగనూరు మార్కెట్‌లో రూ.3,600 నుంచి రూ.4,400 మాత్రమే ధర వస్తోంది. కర్నూలు మార్కెట్‌లో రూ.4 వేల నుంచి రూ.4,800 దాకా పలుకుతోంది. ప్రభుత్వం రూ.5,100 మద్దతు ధర ప్రకటించినా ఎక్కడా ఆ ధరకు కొనుగోళ్లు లేవు. 2020లో విపత్తుల వల్ల జరిగిన నష్టం, పెట్టుబడుల భారంతో శనగ రైతులకు దండగే వస్తోంది. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి దారుణం. 


చివరిలో పెరిగిన పత్తి ధర

రాష్ట్రంలో 80 శాతం మంది రైతులు పత్తి అమ్మేశాక ధరలు పెరిగాయి. పత్తికి మద్దతు ధర రూ.5,515 - రూ.5,825గా కేంద్రం ప్రకటించింది. కానీ ఆ ధరకు అమ్మిన రైతులు నామమాత్రమే. పండిన పత్తి మార్కెట్‌కు వచ్చాక క్వింటా రూ.3,500 నుంచి రూ.5,500లోపే పలికింది. ఆదోని మార్కెట్‌లో ప్రస్తుతం క్వింటా రూ.4వేల నుంచి రూ.6,900దాకా పలుకుతోంది. తక్కువ ధరకు గ్రామాల్లో కొనుగోలు చేసిన వ్యాపారులు రైతు ముసుగులో ఇప్పుడు అమ్మి, లాభపడుతున్నారన్న ప్రచారం ఉంది. 2020-21లో 11.51 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తి దిగుబడి రాగా, 20 లక్షల క్వింటాళ్ల పత్తి మాత్రమే సీసీఐ కొనుగోలు చేసింది. నాణ్యత, నిబంధనల సాకుతో సీసీఐ తప్పించుకోవడంతో మిగతా పత్తి అంతా వ్యాపారులే కొన్నారు. 


‘కర్ర’ రైతుకు కష్టాలు

రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల్లో ఉన్న సుబాబుల్‌, జామాయిల్‌, సరుగుడు ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లేకుండాపోయింది. గత ప్రభుత్వం సుబాబుల్‌ టన్ను రూ.4,200, జామాయిల్‌కు రూ.4,400 ధర నిర్ణయించిగా పేపర్‌ మిల్లులు కొంతమేరకే కొనుగోలు చేశాయి. 2019 నుంచి డిమాండ్‌ లేదంటూ ధరను పూర్తిగా తగ్గించేశాయి. నిరుడు, ఈ ఏడాది రూ.2,000కు మించి కొనడం లేదు. ఖర్చులన్నీ పోను రైతుకు రూ.1,200 మాత్రమే మిగులుతోంది. సుబాబుల్‌ రైతులకు హామీ ఇచ్చిన సీఎం.. మంత్రుల కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు. మంత్రులు చెప్పిన రేటు ఇవ్వలేమంటూ పేపర్‌ మిల్లులు చేతులు ఎత్తేయడంతో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి అంటూ ఉచిత సలహా ఇచ్చి కమిటీ తమ బాధ్యతను తీర్చుకుంది.


కొన్నింటికే మద్దతు 

కందులకు ప్రభుత్వం మద్దతు ధర రూ.6 వేలు ప్రకటించింది. కర్నూలు యార్డులో క్వింటా కందికి రూ.1,700 నుంచి  రూ6,300దాకా లభిస్తోంది. వేరుశనగకు రూ.5,275 ఎమ్మెస్పీ ఉండగా, ప్రస్తుతం మార్కెట్‌లో రూ.3వేల నుంచి రూ.6,300దాకా పలుకుతుంది. సన్‌ప్లవర్‌ విత్తనానికి రూ.5,995 కేంద్రం మద్దతు ధర ప్రకటించగా, కర్నూలు, నంద్యాల మార్కెట్లలో రూ.6,000 లోపు పలుకుతోంది. మొన్న దాకా మంచి మినుములకు మంచి ధరే ఉంది. అయితే మార్కెట్‌లో ఒడిదుడుకులు ఉన్నాయి.


ఎమ్మెస్పీ రూ.6వేలు ఉండగా, ఎమ్మిగనూరు మార్కెట్‌లో మినుములు క్వింటా రూ.5వేల నుంచి రూ.5,800 మాత్రమే పలుకుతున్నాయి. ఈ ఏడాది మినుము దిగుబడి తగినప్పటికీ ఎమ్మెస్పీ అందకపోవడం గమనార్హం. పచ్చళ్ల సీజన్‌ కావడంతో మిర్చికి, ఎండాకాలం కావడంతో నిమ్మకాయకి గిరాకీ బానే ఉంది. ఈ సీజన్‌లో ఈ రెండు పంటలకు రైతుకు లభిస్తున్న ధర ఆశాజనకంగానే ఉంది. 

Updated Date - 2021-04-12T09:07:53+05:30 IST