నేటి నుంచి రైతు బంధు సాయం !

ABN , First Publish Date - 2021-06-15T08:36:48+05:30 IST

వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతుబంధు నిధుల పంపిణీ నేటి (మంగళవారం) నుంచి ప్రారంభం కాబోతోంది.

నేటి నుంచి రైతు బంధు సాయం !

  • ఖాతాల్లోకి బదిలీ కానున్న నగదు
  • 7,508.78 కోట్లు చెల్లించే అవకాశం
  • 63,25,695 మంది రైతులకు లబ్ధి   

హైదరాబాద్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతుబంధు నిధుల పంపిణీ నేటి (మంగళవారం) నుంచి ప్రారంభం కాబోతోంది. మొదటిరోజు ఎకరం లోపు భూమి ఉన్న రైతుల ఖాతాలకు నగదు బదిలీ చేయనున్నారు. వీరి సంఖ్య సుమారు 18 లక్షల వరకు ఉంటుందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. 10.50 లక్షల ఎకరాల విస్తీర్ణానికి తొలిరోజు సుమారు రూ.525 కోట్లు చెల్లించే అవకాశం ఉంది. రేపు (16 తేదీన) రెండెకరాల లోపు భూమి ఉన్న రైతులకు నగదు బదిలీ చేస్తారు. ఆ మరుసటి రోజు మూడెకరాలు... ఇలాగే పది రోజుల్లో పదెకరాల వరకు భూమి ఉన్న రైతులకు నగదు బదిలీ చేయనున్నారు. 11వ రోజు 10 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతులందరి ఖాతాల్లో ఎకరానికి రూ. 5 వేల చొప్పున నిధులు జమచేస్తారు. ఈ ప్రక్రియంతా 11 రోజుల్లో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు లబ్ధిదారుల సంఖ్యను 63,25,695 గా నిర్ణయించిన విషయం విదితమే! వీరి ఆధీనంలో ఉన్న 150.18 లక్షల ఎకరాలకు రూ.7,508.78 కోట్లు చెల్లించనున్నారు. రైతుబంధు నిధులు ఖాతాలో జమ అయిన తర్వాత వ్యవసాయశాఖ నుంచి, రంగారెడ్డి జిల్లా ట్రెజరీ కార్యాలయం నుంచి రైతుల సెల్‌ నెంబర్లకు మెసేజ్‌ వస్తుంది. 

Updated Date - 2021-06-15T08:36:48+05:30 IST