అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-17T05:47:57+05:30 IST

అప్పుల బాధ తాళలేక పోల కల్‌ గ్రామానికి చెందిన రైతు గంపరాజు గోపాల్‌(43) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

సి.బెళగల్‌, జనవరి 16: అప్పుల బాధ తాళలేక పోల కల్‌ గ్రామానికి చెందిన రైతు గంపరాజు గోపాల్‌(43) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గోపాల్‌కు రెండు న్నర ఎకరాల పొలం ఉంది. వివిధ రకాల పంటలు సాగు చేసినా కలిసిరాలేదు. ఏటా నష్టాలు వస్తుండటంతో అప్పులు రూ.6 లక్షలకు పైగా పేరుకుపోయాయి. తీర్చే మార్గం లేక తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం గూడూరుకు వెళ్లిన గోపాల్‌, ఓ దుకాణంలో గడ్డి మందు కొనుగోలు చేశాడు. స్వగ్రామానికి తిరిగి వెళ్లకుండా పడకాన వీధిలోని సింగాని లక్ష్మన్న కల్లందొడ్డిలోకి వెళ్లి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు శనివారం ఉదయం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ నాగార్జున ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతు వివరాలను తెలుసుకుని సమీప బంధువులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోడుమూరు ఆసుపత్రికి తరలించారు. రైతు గోపాల్‌కు  భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-01-17T05:47:57+05:30 IST