‘అరువు’కే రైతన్న జై..!

ABN , First Publish Date - 2021-10-09T06:12:52+05:30 IST

‘రైతులకు కావాల్సిన అన్ని అవసరాలను వారి ముంగిటకు చేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.

‘అరువు’కే రైతన్న జై..!

ఆర్‌బీకేల్లో నగదు చెల్లిస్తేనే ఎరువులు

ప్రైవేటు దుకాణాల్లో అప్పుపై  ఇస్తున్న వ్యాపారులు

వారి వద్ద కొనుగోళ్లకే అన్నదాతల మొగ్గు

ఆర్‌బీకేల్లో ఇప్పటికి అమ్మింది 4,500 టన్నులు

వినియోగంలో పదిశాతం లక్ష్యం చేరుకోవడం కష్టమే

ముందస్తు ప్రణాళికలు లేకుండా, క్షేత్రస్థాయిలో రైతుల స్థితిగతులను అంచనా వేయకుండా ప్రభుత్వం తలపెట్టిన ఆర్‌బీకేల ద్వారా ఎరువుల పంపిణీ విఫల ప్రయోగంగా మిగిలిపోనుంది. అరువు వైపే రైతులు చూస్తున్నారు. జిల్లాలో ఉన్న రైతాంగంలో 80శాతం మంది చిన్న, సన్నకారు కావడంతో వారంతా ప్రతి సీజన్‌లో పెట్టుబడుల కోసం అష్టకష్టాలు పడుతుంటారు. అరువు ఇచ్చే వ్యాపారుల వద్దకు వెళ్లి ఎరువులు తెచ్చుకుంటుంటారు. కానీ రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్‌బీకేల్లో) ఆ పరిస్థితి లేదు. నగదు చెల్లిస్తేనే ఎరువులు ఇస్తున్నారు. దీంతో రైతులు ఆర్‌బీకేల వైపు చూడటం లేదు. ప్రైవేటు వ్యాపారులు ఇచ్చే వెసులుబాటు ఏదో ప్రభుత్వం కూడా కల్పించాలంటున్నారు. పంట కొనుగోలు చేసేది కూడా సర్కారే కనుక అప్పుడు ఆ మొత్తాలను మినహాయించుకోవాలని కోరుతున్నారు.  తాము ఆర్‌బీకేల్లో ఉండే ఎరువులను కొనుగోలు చేయడం వల్ల రవాణా ఖర్చులు కూడా కలిసి వస్తాయని అంటున్నారు. 

ఒంగోలు (జడ్పీ), అక్టోబరు 8 : ‘రైతులకు కావాల్సిన అన్ని అవసరాలను వారి ముంగిటకు చేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. అందులో భాగంగా ఎరువులను కూడా ఆర్‌బీకేల్లో ఉంచి రైతన్నలకు అందజేస్తున్నాం.’ అని పాలకులు చెబుతున్నారు. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో వినియోగించే ఎరువులలో కనీసం పదిశాతం ఆర్‌బీకేల ద్వారా రైతులకు అందించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా  నిర్దేశించింది. ఆ బాధ్యతలను మార్క్‌ఫెడ్‌కు అప్పజెప్పి పర్యవేక్షణకు ఆ విభాగానికి ఒక డీఎంను కూడా నియమించింది. అందుకు అనుగుణంగా రైతు భరోసా కేంద్రాల్లో దాదాపు పదివేల టన్నుల ఎరువులను మార్క్‌ఫెడ్‌ అందుబాటులో ఉంచింది. ఖరీఫ్‌ పనులు ముమ్మరంగా ప్రారంభమై ఇప్పటికే రెండునెలలు దాటింది. ఆర్‌బీకేల ద్వారా జిల్లావ్యాప్తంగా రైతులు కొనుగోలు చేసిన ఎరువులు 4,500టన్నులు మాత్రమే. ఇంత మందకొడిగా అమ్మకాలు జరగడానికి గల కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ప్రైవేటు ఎరువుల దుకాణాల వారు రైతులకు అరువు ప్రాతిపదికన ఎరువులు అందిస్తుండటమే. పంట చేతికొచ్చే సమయాన వారి దగ్గర నుంచి ఆ బకాయిలను వారు వసూలు చేసుకుంటారు. 


మార్క్‌ఫెడ్‌కు సరఫరా బాధ్యతలు

ఆర్‌బీకేల్లో ఎరువుల నిల్వలను ఉంచే బాధ్యతను మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వం అప్పగించింది. ఇప్పటివరకు మార్క్‌ఫెడ్‌ దిగుబడుల పర్యవేక్షణ, ఫెర్టిలైజర్‌ రంగంలోనే సేవలందిస్తోంది. గత రబీలో నామమాత్రంగా మార్క్‌ఫెడ్‌ ద్వారా ఎరువులను ఆర్‌బీకేల్లో ఉంచిన ప్రభుత్వం ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ నుంచి పూర్తిస్థాయిలో మార్క్‌ఫెడ్‌కు ఎరువులను ఆర్‌బీకేల్లో ఉంచే బాధ్యతలను అప్పగించింది.  


జిల్లాలో ఎరువుల అవసరాలు ఇలా...

ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో వివిధ రకాల ఎరువులను రైతాంగం వినియోగిస్తోంది. వాటిలో యూరియా 24వేల మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 13 వేలు, కాంప్లెక్స్‌ 38వేలు, ఎస్‌ఎస్‌పీ 5 వేలు, ఎంఓపీ 2 వేలు, ఇతర రకాలు 5,772 మెట్రిక్‌ టన్నుల వరకు జిల్లా రైతాంగం వాడుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇవి హోల్‌సేల్‌, రిటైలర్స్‌, మార్క్‌ఫెడ్‌, ఆర్‌బీకేలు, గోడౌన్‌లు వివిధ పాయింట్లలో అందుబాటులో ఉంటాయి.


ఇప్పటివరకు ఆర్‌బీకేల ద్వారా విక్రయించింది 4,500 టన్నులే

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 87,772 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం ఉంటుందని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. ఇందులో కనీసం పదిశాతం ఆర్‌బీకేల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే దాదాపు 9,000 మెట్రిక్‌ టన్నులను ఆయా కేంద్రాల ద్వారా అమ్మాల్సి ఉంది. కానీ ఇప్పటికి  కేవలం 4,500 టన్నులే విక్రయించారు. బహిరంగ మార్కెట్‌లో ఇప్పటికే 60వేల టన్నుల ఎరువుల అమ్మకాలు జరిగాయని అంచనా. ప్రస్తుతం ఆర్‌బీకేల్లో అమ్మకాలు జరుగుతున్న తీరు చూస్తుంటే ప్రభుత్వం నిర్దేశించిన పదిశాతం లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


ప్రైవేటు వ్యాపారులవైపే అన్నదాతల మొగ్గు

పెట్టుబడుల వేళ చేతిలో సమృద్ధిగా డబ్బులు లేకపోవడంతో అప్పులు ఇచ్చే వ్యాపారులనే రైతన్నలు ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. పంట విక్రయించిన తర్వాత డబ్బులు చెల్లిస్తుంటారు.  రైతుల అవసరాన్ని కొంతమంది వ్యాపారులు సొమ్ము చేసుకుంటూ లక్షలు ఆర్జిస్తున్నారు. దిగుబడుల సమయాన తాము కేవలం ఎమ్మార్పీ ధరలు మాత్రమే రైతుల దగ్గర నుంచి వసూలు చేస్తామని వ్యాపారులు చెబుతున్నా లోపాయికారీగా వారి దగ్గర నుంచి కొంత వడ్డీ కలిపి లాగుతూ అన్నదాతలను నిలువునా వంచిస్తున్నారు.


లక్ష్యాన్ని చేరుకుంటాం

జి.మీరయ్య, మార్క్‌ఫెడ్‌ అగ్రిఇన్‌పుట్స్‌ డీఎం

జిల్లాలో ఖరీఫ్‌ పనులు ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్నాయి. ఆర్‌బీకేల్లో ఎరువుల అమ్మకాలు ఊపందుకున్నాయి. ఖరీఫ్‌ ప్రారంభంలో 6వేల టన్నుల వరకు ఉంచితే వాటిలో 5వేల టన్నులు ఇప్పటికే అమ్ముడయ్యాయి. మరో 4వేల టన్నులను అందుబాటులో ఉంచాం. ఆలస్యంగా ఖరీఫ్‌ ప్రారంభం కావడం కూడా ఎరువుల అమ్మకాలు మందకొడిగా ఉండడానికి ఒక కారణం.  ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రైతులకు ఆర్‌బీకేల ద్వారా ఎరువులను అందించడానికి అన్ని చర్యలు చేపడుతున్నాం. ప్రస్తుతం ఆర్‌బీకేల్లో ఉంచిన నిల్వలన్నీ అమ్ముడవుతాయి. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటాం.




Updated Date - 2021-10-09T06:12:52+05:30 IST