ఈ రైతుకు వింత కష్టం.. ఆరేళ్లుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు.. సాయం కోసం కాదు..!

ABN , First Publish Date - 2021-08-24T17:28:33+05:30 IST

ఒక రైతుకు వింత కష్టం వచ్చింది. ఒకపక్క నష్టపోయిన పంటకు పరిహారం కోసం రైతులు ఉద్యమాలు చేస్తుంటే.. ఈ రైతు మాత్రం తన చేతికి వచ్చిన పరిహారం డబ్బును ప్రభుత్వానికి తిరిగిచ్చేందుకు నానా కష్టాలు పడుతున్నాడు.

ఈ రైతుకు వింత కష్టం.. ఆరేళ్లుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు.. సాయం కోసం కాదు..!

ఇంటర్నెట్ డెస్క్: ఒక రైతుకు వింత కష్టం వచ్చింది. ఒకపక్క నష్టపోయిన పంటకు పరిహారం కోసం రైతులు ఉద్యమాలు చేస్తుంటే.. ఈ రైతు మాత్రం తన చేతికి వచ్చిన పరిహారం డబ్బును ప్రభుత్వానికి తిరిగిచ్చేందుకు నానా కష్టాలు పడుతున్నాడు. అతనే హర్యానా రాష్ట్రానికి చెందిన సూరజ్‌మల్ నైన్ అనే రైతు. 65 ఏళ్ల సూరజ్.. కాలువల విభాగం ఇంజినీరింగ్ శాఖలో ఉద్యోగం చేసి రిటైరయ్యారు. 2014లో ఆయన పొలంలో 2 ఎకరాల్లో పంట నష్టపోయారు. తెల్ల ఈగ వల్ల ఈ నష్టం జరిగింది. ఇలా పంట నష్టపోయిన పంటకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. 2015లో ఈ పరిహారం చెల్లించింది. సూరజ్‌మల్ దగ్గర 20 ఎకరాల పొలం ఉంది. అయితే ఆయన నష్టపోయింది 2 ఎకరాల పంటే. అయితే లెక్కలు తీసిన ప్రభుత్వాధికారులు మాత్రం 10 ఎకరాల పంట నష్టపోయినట్లు రాసేశారు. దీంతో ఎకరానికి రూ.7వేల చొప్పున సూరజ్‌మల్ ఖాతాలో రూ.70 వేలు జమ అయ్యాయి. అయితే తనకు రావలసింది రూ.14వేలే అని, మిగతా రూ.56 వేలు తిరిగి తీసుకోవాలని సూరజ్‌మల్ ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.



రక్తం ధారపోసి తెచ్చుకున్న స్వతంత్రాన్ని అవినీతి అధికారులు సర్వనాశనం చేస్తున్నారని సూరజ్‌మల్ మండిపడ్డారు. తమ గ్రామంలో రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వస్తుందని తెలియడంతో.. ప్రభుత్వ అధికారులు తమ తెలివి తేటలు చూపించారని ఆయన తెలిపారు. నకిలీ దస్తావేజులు సృష్టించి, రైతుల పేరిట పరిహారం తీసుకొని మోసాలకు పాల్పడ్డారని వివరించారు. అలా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని అధికారులు నొక్కేశారని, ఈ వివరాలు బయటపడకుండా ఉండేందుకు రైతులకు కూడా కొంత డబ్బు ముట్టజెప్పారని సూరజ్ చెప్పారు. కానీ తాను దీనికి ఒప్పుకోబోనని, అందుకే తనకు ఎక్కువగా వచ్చిన డబ్బు తిరిగిచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని వెల్లడించారు. ఈ డబ్బు తిరిగి తీసుకోవాలంటూ తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాలకు ఇప్పటికే పలుమార్లు తిరిగానని చెప్పిన ఈ రైతు.. ఆరేళ్లుగా డబ్బు తిరిగిచ్చేందుకు పోరాడుతున్నాడు. తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా ఇదే విషయాన్ని రాశానని చెప్పాడు.

Updated Date - 2021-08-24T17:28:33+05:30 IST