నిండా మునిగిన రైతు

ABN , First Publish Date - 2020-10-25T05:51:57+05:30 IST

కల్తీ విత్తనాలతో అన్నదాతలు నిండా మునిగారు. ప్రకృతి వైపరిత్యాలు ఒకవైపు రైతులను ఆగం చేస్తుండగా తాజగా కల్తీ విత్తనాలు సాగుచేసిన రైతులు వరి కంకులు రాక ఆందోళన చెందుతున్నారు

నిండా మునిగిన రైతు

కల్లూరు, తల్లాడ, వేంసూరులో కల్తీ విత్తనాల సాగు

వరి కంకుల్లో బెరుకులు  


కల్లూరు/ తల్లాడ/వేంసూరు, అక్టోబరు 24: కల్తీ విత్తనాలతో అన్నదాతలు నిండా మునిగారు. ప్రకృతి వైపరిత్యాలు ఒకవైపు రైతులను ఆగం చేస్తుండగా తాజగా కల్తీ విత్తనాలు సాగుచేసిన రైతులు వరి కంకులు రాక ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లా వేంసూరులో 450 ఎకరాలు, తల్లాడలో 200 ఎకరాలు, కల్లూరులో సుమారు 100 ఎకరాల్లో రైతులు హుజూర్‌నగర్‌, తిరుమూరు నుంచి సన్నరకం వరి విత్తనాలు సాగుచేశారు. 130 రోజుల్లో పంట దిగుబడి రావాల్సిఉండగా అందుకు భిన్నంగా కంకులు పాలుపోసుకొని మెడవంపునకు గురైంది. రైతులు వ్యవసాయఅధికారులకు, ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు పంటలు పరిశీలించి నమూనాలను ల్యాబ్‌కు పంపించారు.


కంకుల్లో బెరుకులు

కల్లూరు మండలానికి చెందిన కొందరు రైతులు హుజూర్‌నగర్‌, తిరువూరులో విత్తనాలు కొనుగోలు చేశారు. చండ్రుపట్ల, చెన్నూరు, ముచ్చవరం గ్రామాల్లోని రైతులు 70ఎకరాలకుపైగా,  తల్లాడ మండలం నూతనకల్‌ గ్రామంలో 200ఎకరాల్లో  ఈరకం విత్తనాలను సాగుచేశారు. రెండురకాలుగా కంకులు పాలుపోసుకొని బెరుకులు రాగా మరికొంత పంట మెడవంపునకు గురై వరిపంట వాలిపోయింది. పంటపొలాలను జేడీఏ విజయనిర్మల, ఏడీఏ నర్సింహారావు, కేవీకే శాస్త్రవేత్త డాక్టర్‌ జె.హేమంతకుమార్‌, ఏవో రూప, ఎంపీపీ, జడ్పీటీసీ బీరవల్లి రఘు, కట్టా అజయ్‌కుమార్‌, మండల రైతుబంధు కన్వీనర్‌ డాక్టర్‌ లక్కినేని రఘు,  బీజేపీ నాయకుడు ఆపతి వెంకటరామారావు పంటను పరిశీలించారు.


దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

 కల్తీ విత్తనాలతో దెబ్బతిన్న పంటలను శనివారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పరిశీలించారు. వేంసూరు మండలంలోని మర్లపాడులో దెబ్బతిన్న పంటలను పరిశీలించి మాట్లాడుతూ శాస్త్రవేత్తల నివేదిక ఆధారంగా కంపెనీపై చర్యలు తీసుకోవాలని రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. 450 ఎకరాల్లో ఈ విత్తనం సాగుచేసి నష్టపోయిన రైతులు వ్యవసాయశాఖ, పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. 

Updated Date - 2020-10-25T05:51:57+05:30 IST