అప్పుల భారం, ఎంఎస్‌పీలపై రైతు సంఘాల దృష్టి

ABN , First Publish Date - 2021-11-25T00:36:02+05:30 IST

మూడు సాగు చట్టాలను రద్దు చేసే బిల్లును కేంద్ర కేబినెట్ బుధవారం

అప్పుల భారం, ఎంఎస్‌పీలపై రైతు సంఘాల దృష్టి

న్యూఢిల్లీ : మూడు సాగు చట్టాలను రద్దు చేసే బిల్లును కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదించడంతో రైతు సంఘాలు మరికొన్ని అంశాలపై దృష్టి సారించాయి. వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రభుత్వ సేకరణకు భరోసా లేకపోవడం, పంటలు దెబ్బతినడం, పెరుగుతున్న అప్పుల భారం వంటివాటిని ప్రస్తావిస్తున్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరపాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరాయి. 


ఆలిండియా కిసాన్ మహాసభ జనరల్ సెక్రటరీ హన్మన్ మొల్లాహ్ మీడియాతో మాట్లాడుతూ, తాము ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి నవంబరు 21న ఓ లేఖ రాశామని చెప్పారు. నవంబరు 26 వరకు వేచి చూస్తామని, ప్రధాన మంత్రి స్పందించకపోతే, భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించేందుకు నవంబరు 27న సమావేశమవుతామని చెప్పారు. మూడు సాగు చట్టాలను రద్దు చేయడం రైతులకు సంతోషాన్ని ఇవ్వడం లేదన్నారు. అన్ని వ్యవసాయ మార్కెట్లలోనూ ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధరకు వ్యవసాయోత్పత్తులను సేకరిస్తున్నారని చెప్పారు. రైతులు తాము పండించిన ధాన్యం, గోధుమలను బహిరంగ మార్కెట్లో ఎంఎస్‌పీ కన్నా అతి తక్కువ ధరకు అమ్ముకోవలసి వస్తోందని తెలిపారు. 


సంయుక్త కిసాన్ మోర్చా నేతలు మాట్లాడుతూ, సాగు చట్టాల రద్దు వల్ల కేవలం భవిష్యత్తులో జరగబోయే ప్రమాదం మాత్రమే తొలగిందని చెప్పారు. వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రభుత్వ సేకరణకు భరోసా లేకపోవడం, పంటలు దెబ్బతినడం, పెరుగుతున్న అప్పుల భారం వంటివి ఇంకా వేధిస్తూనే ఉన్నాయని తెలిపారు. 


సాగు చట్టాలను రద్దు చేయాలని దాదాపు 40 రైతు సంఘాలు ఓ సంవత్సరం నుంచి డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 19న జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రైతులకు మేలు కలిగించే ఈ చట్టాలపై ప్రజలకు నచ్చజెప్పడంలో విఫలమయ్యామని చెప్తూ, ప్రజలను క్షమాపణ కోరారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కోసం నూతన నిబంధనావళిని రూపొందించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.


Updated Date - 2021-11-25T00:36:02+05:30 IST