పార్లమెంటుకు కవాతును తాత్కాలికంగా నిలిపేసిన రైతన్నలు

ABN , First Publish Date - 2021-11-27T23:24:11+05:30 IST

ట్రాక్టర్లతో పార్లమెంటుకు కవాతు చేయాలన్న నిర్ణయాన్ని

పార్లమెంటుకు కవాతును తాత్కాలికంగా నిలిపేసిన రైతన్నలు

న్యూఢిల్లీ : ట్రాక్టర్లతో పార్లమెంటుకు కవాతు చేయాలన్న నిర్ణయాన్ని రైతు సంఘాలు తాత్కాలికంగా ఉపసంహరించుకున్నాయి. ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తొలి రోజునే మూడు సాగు చట్టాల రద్దు బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుండటంతో ప్రస్తుతానికి ట్రాక్టర్ కవాతును నిలిపేయాలని నిర్ణయించినట్లు సంయుక్త కిసాన్ మోర్చా శనివారం ప్రకటించింది. అయితే కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), నిరసనల సందర్భంగా రైతుల మృతి, లఖింపూర్ ఖేరీలో హింసాకాండ వంటివాటిపై ప్రభుత్వం తమతో చర్చించే వరకు ప్రస్తుత నిరసన కార్యక్రమాలు మాత్రం కొనసాగుతాయని వివరించింది. 


పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభమవుతాయి. తొలి రోజునే మూడు సాగు చట్టాల రద్దు బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చట్టాలను రద్దు చేయనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 19న ప్రకటించారు. అనంతరం రైతు సంఘాలు స్పందిస్తూ పార్లమెంటుకు ట్రాక్టర్ కవాతును యథావిధిగా నిర్వహిస్తామని తెలిపాయి. తాజాగా ఈ నిర్ణయాన్ని మార్చుకున్నాయి. 


కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శనివారం ఉదయం రైతులకు ఓ విజ్ఞప్తి చేశారు. రైతుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చినందువల్ల నిరసనను విరమించి, తిరిగి ఇళ్ళకు వెళ్ళాలని కోరారు. అనంతరం సంయుక్త కిసాన్ మోర్చా నేతలు సమావేశమై, ప్రస్తుతానికి పార్లమెంటుకు ట్రాక్టర్ కవాతును నిలిపేయాలని నిర్ణయించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం చర్చించే వరకు నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. 


నిరసన తెలిపిన రైతులపై నమోదైన కేసులన్నిటినీ ఉపసంహరించాలని, నిరసన కార్యక్రమాల సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లపై నరేంద్ర సింగ్ తోమర్ శనివారం స్పందిస్తూ, రైతులపై నమోదైన కేసులు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనివని చెప్పారు. మరణించిన రైతులకు నష్టపరిహారం గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. పంట దుబ్బులను కాల్చడం నేరంగా పరిగణించడాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. 


Updated Date - 2021-11-27T23:24:11+05:30 IST